చందు మొండేటి.. బిగ్ స్టార్స్ తో ఈసారి హిస్టారికల్ థ్రిల్లర్!
సాధారణంగా హిస్టారికల్ సినిమాలకు కావలసిన ఇంటెన్సిటీ, మిస్టరీ చందు మొండేటి మార్క్ మేకింగ్‌లో పుష్కలంగా ఉంటాయి.;
టాలీవుడ్ నుంచి మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి సిద్ధమవుతోంది. విభిన్నమైన కాన్సెప్టులతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చందు మొండేటి, ఇప్పుడు ఏకంగా బడా స్టార్లతో కలిసి ఒక భారీ ప్రయోగానికి తెరలేపుతున్నారు. కార్తికేయ 2తో నేషనల్ వైడ్ గా తన సత్తా చాటిన చందు, ఆ తర్వాత వచ్చిన తండేల్ సినిమాతో కూడా బాక్సాఫీస్ వద్ద తన సక్సెస్ గ్రాఫ్‌ను నిలబెట్టుకున్నారు. ఇప్పుడు అంతకుమించి అనేలా ఒక హిస్టారికల్ థ్రిల్లర్‌ను ప్లాన్ చేస్తుండటం సినిమా వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది.
సాధారణంగా హిస్టారికల్ సినిమాలకు కావలసిన ఇంటెన్సిటీ, మిస్టరీ చందు మొండేటి మార్క్ మేకింగ్‌లో పుష్కలంగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఆయన ఉజ్జయిని నేపథ్యంలో ఒక పవర్ ఫుల్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ కథలో ఉన్న వెయిట్ చూసి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ముందుకొచ్చారు. ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుందట. కరణ్ జోహార్ లాంటి దిగ్గజ నిర్మాత తోడవ్వడంతో ఈ ప్రాజెక్ట్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
అసలు విషయం ఏంటంటే, ఈ భారీ చిత్రంలో భల్లాలదేవ రానా దగ్గుబాటి, బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ కలిసి నటించబోతున్నారని సమాచారం. గతంలో వీరిద్దరూ ‘బేబీ’ సినిమాలో కలిసి కనిపించినప్పటికీ, ఈసారి ఒక హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో వీరి మధ్య ఉండే పోరాటం చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో మరో టాప్ హీరో కూడా నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఉజ్జయిని నగరం చుట్టూ తిరిగే ఈ మిస్టరీ కథలో నటీనటుల ఎంపిక చాలా క్రేజీగా ఉండబోతోంది.
ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయని, త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. చందు మొండేటి తన గత సినిమాల్లో లాగే ఇందులో కూడా అడ్వెంచర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. రానాకు పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ ఉంది, అక్షయ్ కుమార్ కి కూడా మంచి మార్కెట్ ఉంది. కాబట్టి సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయం. కరణ్ జోహార్ ఈ ప్రాజెక్ట్‌ను కేవలం ఇండియన్ మార్కెట్‌కే కాకుండా గ్లోబల్ వైడ్‌గా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతానికి చిత్ర యూనిట్ అఫీషియల్ అప్డేట్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తోంది. ఇక అంతలోపే ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. హిస్టారికల్ థ్రిల్లర్స్ కు ఇప్పుడున్న డిమాండ్ దృష్ట్యా, చందు మొండేటి ఈ కాంబినేషన్‌తో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారోనని అందరూ ఎదురుచూస్తున్నారు. ఉజ్జయిని మిస్టరీ ఏంటి? అక్షయ్, రానా పాత్రలు ఎలా ఉండబోతున్నాయి? అనే వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు ఆగాల్సిందే.