కల్కి 2898 AD: ప్రభాస్ ఫ్రెండు బుజ్జిని చూశారా?

బుజ్జి ఎవ‌రు? అనేది తెలియాలంటే తాజాగా విడుద‌లైన టీజ‌ర్ చూసి తీరాలి.

Update: 2024-05-22 17:03 GMT

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా నాగ్ అశ్విన్ చేస్తున్న భారీ ప్ర‌యోగాత్మ‌క చిత్రం - కల్కి 2898 AD. సైన్స్ ఫిక్ష‌న్ క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో భైర‌వ పాత్ర‌లో ప్ర‌భాస్ న‌టిస్తున్నాడు. ప్ర‌భాస్ లో డ్యూయ‌ల్ షేడ్స్ ఆక‌ట్టుకుంటాయ‌ని చెబుతున్నారు. అలాగే ఈ చిత్రంలో బుజ్జి పాత్ర ఎంతో కీల‌క‌మైన‌ది. బుజ్జి ఎవ‌రు? అనేది తెలియాలంటే తాజాగా విడుద‌లైన టీజ‌ర్ చూసి తీరాలి.


బుజ్జి ఒక‌ సొగసైన రోబోటిక్ వాహనం. భైరవకు స‌హ‌క‌రించే ఒక అసిస్టెంట్ అని తాజాగా విడుద‌లైన‌ టీజ‌ర్ వీక్షించిన వారికి అర్థ‌మ‌వుతోంది. కీర్తి సురేష్ బుజ్జి పాత్ర‌కు గాత్రదానం చేసారు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన రోబో బుజ్జి. భైరవకు న‌మ్మ‌క‌స్తుడిగా పనిచేస్తుంది. ఒక ర‌కంగా రోబో చిత్రంలో వ‌శీక‌ర‌ణ్ (ర‌జ‌నీ)కి స‌హ‌క‌రించే చిట్టీ రోబో లాంటిది. కానీ బుజ్జి ప‌రిమాణంలో చాలా చిన్న‌ది. ఒక బాల్ త‌ర‌హాలో క‌నిపిస్తోంది.

అయితే బుజ్జి ప‌రిమాణం చిన్న‌దే కావొచ్చు.. కానీ ప‌రిధి చాలా పెద్ద‌ద‌ని తాజా టీజ‌ర్ క్లారిటీనిచ్చింది. ఈ సినిమా కథాను ముందుకు న‌డిపించ‌డంలో బుజ్జి అత్యంత‌ కీలక పాత్ర పోషిస్తోంది. ఎంపిక చేసిన ప్రేక్షకుల స‌మ‌క్షంలో కస్టమ్ మేడ్ వాహనాన్ని హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో లాంచ్ చేసారు. బుజ్జిని లాంచ్ చేస్తూ దాదాపు 1 నిమిషం నిడివిగల టీజర్‌ను విడుదల చేశారు. కొన్ని రోజుల క్రితం `కల్కి 2898 AD` ప్రీటీజ‌ర్ విడుద‌లైంది. నిజానికి భైర‌వ‌ బృందం బాడీని కస్టమ్-మేడ్ కారుగా నిర్మించడంతో బుజ్జి అనే రోబోట్ అసహనానికి గురిచేసే చిన్న వీడియోను ప్రభాస్ షేర్ చేసారు. కానీ ఇప్పుడు బుజ్జిని పూర్తి స్థాయిలో పరిచయం చేయ‌డం ఆసక్తిని క‌లిగించింది.

Read more!

టీజ‌ర్ ఆద్యంతం మతి చెడ‌గొట్టే మాయా ప్ర‌పంచం క‌నిపించింద‌ని చెప్పాలి. అక్క‌డ పూర్తిగా ఒక కొత్త ప్ర‌పంచాన్ని సృష్టించారు నాగ్ అశ్విన్. భార‌తీయ సినీప‌రిశ్ర‌మ ఏ దిశ‌గా పురోగమించాలి? అన్న‌ది క‌ల్కి ప్ర‌య‌త్నం స్ప‌ష్ఠంగా చెబుతోంది. సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో దేశీ సినిమాల అవ‌స‌రాన్ని ప్ర‌జ‌లు గుర్తించిన ఈ ద‌శ‌లో క‌ల్కి వ‌స్తుండ‌డం ఆస‌క్తిక‌రం. ఈ మూవీ టీజ‌ర్ లో అధునాత‌న వాహ‌నాలు, వాటి రూప‌క‌ల్ప‌న ఆలోచ‌న‌లు ఎంతో అబ్బుర‌ప‌రుస్తాయి. భ‌విష్య‌త్ లో వాహ‌నాలు ఎలా ఉంటాయి? అన్న‌ది ఈ సినిమాలో చూపిస్తుండ‌డం ఉత్కంఠ‌ను క‌లిగించింది. హాలీవుడ్ లో వ‌చ్చిన చాలా భారీ ప్ర‌యోగాత్మ‌క సైన్స్ ఫిక్ష‌న్ సినిమాల మాదిరిగానే భారీత‌నం నిండిన సినిమాను నాగ్ అశ్విన్ అందిస్తున్నాడ‌ని టీజ‌ర్ స్ప‌ష్ఠ‌త‌నిచ్చింది. ప్ర‌భాస్ ఈ టీజ‌ర్ లో భారీత‌నం నిండిన కాస్ట్యూమ్‌లో క‌నిపించాడు. ప్ర‌యోగాలు చేసేవాడిగా మిస్టీరియ‌స్ గా క‌నిపిస్తున్నాడు. అతడి పాత్ర‌లో సర్కాజ‌మ్ మాత్ర‌మే ఇందులో బ‌య‌ట‌ప‌డింది. ఇందులో అత‌డి నుంచి విల‌క్ష‌ణ‌మైన యాక్ష‌న్ ని కూడా త‌దుప‌రి వీడియోల్లో ఆవిష్క‌రిస్తార‌ని అర్థ‌మ‌వుతోంది. ఏది ఏమైనా బుజ్జి ప‌రిచ‌య టీజ‌ర్ ర‌క్తి క‌ట్టించింది. క‌ల్కి చిత్రంపై భారీ అంచ‌నాల‌ను పెంచింద‌నడంలో సందేహం లేదు. ఇది పూర్తిగా కొత్త ర‌కం సినిమా అంటూ అమితాబ్ , దీపిక ప‌దుకొనే చాలా కాలం క్రిత‌మే వెల్ల‌డించారు. వీళ్లంతా ఎందుకు అలా చెప్పారో ఈ టీజ‌ర్ తో క్లారిటీ వ‌చ్చేసింది. వైజ‌యంతి మూవీస్ అధినేత అశ్వని ద‌త్ ప్ర‌య‌త్నాన్ని ప్ర‌యోగాత్మ‌క పంథాను ప్ర‌శంసించి తీరాలి. జూలైలో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

Full View
Tags:    

Similar News