నేషనల్ అవార్డు వస్తుందని ముందే అనుకున్నా
ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా పెద్ది అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.;
ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా పెద్ది అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పెద్ది షూటింగ్ లో బిజీగా ఉన్న ఆయన రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కోస్తా ఆంధ్రలో తన బాల్యం, తన లైఫ్ లో సుకుమార్ ఎలాంటి ప్రభావం చూపారు లాంటి విషయాలతో పాటూ పలు అంశాల గురించి మాట్లాడాడు.
తాను సినిమాల్లోకి వెళ్లడం తన ఫ్యామిలీకి ఏ మాత్రం ఇష్టం లేదని, తన సోదరి ప్లాస్టిక్ సర్జన్ కావడంతో తాను కూడా అలాంటి మంచి పొజిషన్ లోనే ఉండాలని అతని పేరెంట్స్ కోరుకున్నట్టు చెప్పిన ఆయన, తన తల్లిదండ్రులను ఒప్పించడానికే తాను హైదరాబాద్ వచ్చి ఎంబీఏ కోర్సులో జాయిన్ అయ్యానని బుచ్చిబాబు తెలిపాడు.
ఎంబీఏలో జాయిన్ అయ్యాక మధ్యాహ్నం వరకు కాలేజ్ కు వెళ్లి క్లాసులకు అటెండ్ అవడం, ఆ తర్వాత సుకుమార్ ఆఫీస్ కు వెళ్లడం తనకు డైలీ రొటీన్ అయిపోయిందని, అదే తనను ఆర్య2, 100% లవ్, రంగస్థలం లాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ ను చేసిందని, దాని వల్లే ఇండస్ట్రీలో తాను నిలబడినట్టు తెలిపాడు బుచ్చిబాబు.
తన గురువు సుకుమార్ వల్లే తాను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానని చెప్తున్న బుచ్చిబాబు, తన లైఫ్ లో ఎంతో కీలకమైన సంబంధం తనకు సుకుమార్ తో ఉందని, తాను సినిమాలు తీయాలనుకుంటున్న విషయం సుకుమార్ కు చెప్పినప్పుడు సినిమా నీలోనే ఉంది. నువ్వు నన్ను చూస్తూ ఉండటం వల్లే అది బయటపడిందని సుకుమార్ తనతో చెప్పినట్టు చెప్పిన బుచ్చిబాబు ఆర్య సినిమా తర్వాత తన లైఫ్ మొత్తం మారిపోయిందని చెప్పాడు.
ఉప్పెన సినిమాకు నేషనల్ అవార్డు వస్తుందని తాను ముందు నుంచే నమ్మానని చెప్పిన బుచ్చిబాబు, అది కేవలం తన డెబ్యూ సినిమా మాత్రమే కాదని, ఆ సినిమా ఎన్నో రూల్స్ ను ధిక్కరించిన సినిమా అని చెప్పుకొచ్చాడు. రంగస్థలం సినిమా చేస్తున్నప్పుడే సుకుమార్ తో తాను ఈ క్లైమాక్స్ ను షేర్ చేసుకున్నానని, అది విని ఆయన షాకయ్యారని బుచ్చిబాబు చెప్పాడు. ఎవరు నమ్మనప్పుడు కూడా ఉప్పెన రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తుందని, ఆ సినిమాకు నేషనల్ అవార్డు వస్తుందని తాను ముందు నుంచే నమ్మినట్టు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బుచ్చిబాబు వెల్లడించాడు.