అగ్ర న‌టితో డేటింగ్‌పై నిజాలు చెప్పిన స్టార్ క్రికెట‌ర్!

బాలీవుడ్ నటి ప్రీతి జింతా సహా ఇతర నటీమణులతో ఎఫైర్ సాగించాడంటూ సాగిన ప్ర‌చారంపై ఇప్పుడు మాజీ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ క్లారిటీ ఇచ్చారు.

Update: 2026-08-05 04:25 GMT

బాలీవుడ్ నటి ప్రీతి జింతా సహా ఇతర నటీమణులతో ఎఫైర్ సాగించాడంటూ సాగిన ప్ర‌చారంపై ఇప్పుడు మాజీ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ క్లారిటీ ఇచ్చారు. ఈ ఊహాగానాలన్నీ పూర్తిగా నిరాధార‌మైనవని ఆయన తోసిపుచ్చారు. తాను ఏనాడూ ఏ బాలీవుడ్ నటితోనూ డేటింగ్ చేయలేదని లీ స్పష్టం చేశారు. నిజం ఏంటో తనకు ఎల్లప్పుడూ తెలుసు కాబట్టి ఇలాంటి పుకార్లు తనను ఏనాడూ ప్రభావితం చేయలేదని తెలిపారు.

ప్రీతి జింటా గురించి బ్రెట్ లీ మాట్లాడుతూ.. ఆమెను ఒక మంచి స్నేహితురాలని వర్ణించారు. ప్రీతి మేధస్సును, తెలివితేటలను ప్రశంసించడమే కాకుండా.. ఆమెపై తనకు ఎప్పటికీ అపారమైన గౌరవం ఉంటుందని పేర్కొన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు బ్రెట్ లీ ప్రాతినిధ్యం వహించగా... ఆ జట్టుకు ప్రీతి జింటా సహ యజమానిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ మ్యాచ్‌లలో వీరిద్దరూ కలిసి కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ ఆ కాలంలో మీడియాలో, సోషల్ మీడియాలో అనేక కథనాలు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. మైదానంలో జట్టును ఉత్సాహపరిచే క్రమంలో వీరిద్దరి స్నేహబంధం అనేక రకాల రూమర్లకు దారితీసింది. అయితే ఆ సమయమంతా తాము కేవలం మైదానానికే పరిమితమైన ఒక వృత్తిపరమైన, చక్కని స్నేహబంధాన్ని మాత్రమే కొన‌సాగించామ‌ని లీ స్పష్టం చేశారు.

ఇన్‌స్టాగ్రామ్ స‌హా ఇత‌ర‌ సోషల్ మీడియా లలో ఈ సమాచారం వైరల్ కావడంతో క్రీడాభిమానులు, సినీ ప్రేక్షకుల నుండి విప‌రీత‌మైన‌ స్పందన లభించింది. చాలా కాలంగా నలుగుతున్న ఈ పుకార్లపై బ్రెట్ లీ స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఆయన వ్యాఖ్యలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు యూజర్లు వీరిద్దరి కాంబినేషన్ చూడటానికి చాలా బాగుండేదని వ్యాఖ్యానించగా... , మరికొందరు నిజం చెప్పినందుకు లీని అభినందించారు.

క్రీడా ప్రపంచం, బాలీవుడ్ పరిశ్రమల మధ్య సంబంధాలు ఎల్లప్పుడూ మీడియా దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటాయి. చాలా సందర్భాల్లో ఇలాంటి అనుబంధాలు నిజమైన దాంపత్య బంధాలుగా మారినా.. కొన్నిసార్లు కేవలం స్నేహాన్ని కూడా పుకార్లుగా మార్చడం జరుగుతుంటుంది. బ్రెట్ లీ ఇచ్చిన ఈ వివరణతో ప్రీతి జింటాతో అత‌డికి ఉన్నది కేవలం గౌరవప్రదమైన స్నేహం మాత్రమేనని రుజువైంది. ముంబైలో ప‌ర్య‌టిస్తున్న బ్రెట్ లీ.. మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.

Tags:    

Similar News