కాకపుట్టిస్తోన్న హిట్ ప్రాంచైజీ నుంచి పార్ట్-4!
మాతృక సక్సెస్ సృష్టించిన ఇంపాక్ట్‌ను కొనసాగిస్తూ అంతకంటే ఎక్కువ సాంకేతిక విలువలతో చిత్రాలను రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రాంచైజీ.. సీక్వెల్స్ మంత్రం నడుస్తోంది. ఇప్పటికే ఉన్న హిట్ ప్రాంచైజీలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా ప్రేక్షకుల్లో క్రేజ్‌ను పెట్టు బడిగా మలచుకోవడానికి నిర్మాతలు ఆసక్తి గా ఉన్నారు. ముఖ్యంగా వరుసగా నాలుగో భాగాలు సిద్ధమవుతుండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మాతృక సక్సెస్ సృష్టించిన ఇంపాక్ట్‌ను కొనసాగిస్తూ అంతకంటే ఎక్కువ సాంకేతిక విలువలతో చిత్రాలను రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం సిద్ధమవుతున్న ప్రాంచైజీల జాబితా చూస్తే? ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున పార్ట్-4ల సందడి కనిపిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా పేరుగాంచిన `రేస్-4`, వినోదాల హంగామాతో సాగే `హంగామా-4`', హై-ఆక్టేన్ యాక్షన్ డ్రామా `దూమ్-4`, సూపర్ హీరో సిరీస్‌గా దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న `క్రిష్-4` వంటి చిత్రాలు లైన్లో ఉన్నాయి. ఒక్కో సినిమాకు ఒక్కో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండటంతో నాలుగో భాగాల ప్రకటనలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
ఒకదాని తర్వాత ఒకటి విడుదల అవకాశం ఉందనే వార్తలు సినీ ప్రియులకు పండగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. సాధారణంగా ఒక ఫ్రాంచైజీలోని మొదటి మూడు భాగాల తర్వాత నాలుగో భాగం వస్తుందంటే? కథలో ఆసక్తికరమైన మలుపులు .. పాత్రల పరిణామ క్రమంలో మార్పులు ఉంటాయి. ఈ చిత్రాల విడుదల తేదీల ప్రణాళికను కూడా వ్యూహాత్మకంగా మారుస్తూ బాక్సాఫీస్ వద్ద పోటీ లేకుండా వరుసగా థియేటర్లకు తీసుకురావడానికి నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇది మార్కెట్ పరంగా కూడా నిర్మాతలకు సురక్షితమైన నిర్ణయం.
ఈ ఫ్రాంచైజీలు ఇంతలా విజయం సాధించడానికి ప్రధాన కారణం వాటిలోని కన్సిస్టెన్సీ అని చెప్పొచ్చు. మొదటి భాగాలు అందించిన వినోదాన్ని ..యాక్షన్‌ను తర్వాతి భాగాల్లో కూడా కొనసాగించడం ద్వారా ప్రేక్షకులు ఈ సినిమాలతో ఒక విధమైన ఎమోషనల్ బాండింగ్ ఏర్పరచుకున్నారు. నాలుగో భాగం వచ్చేసరికి ఆ క్యారెక్టర్లు ఇంట్లో మనుషుల లాగానో లేదా బాగా తెలిసిన హీరోలుగానో మారిపోతాయి. ఈనేపథ్యంలో ప్రతి భాగం విడుదలైనప్పుడు మళ్ళీ కొత్త జోష్‌తో ప్రేక్షకులు థియేటర్లకు తరలి వస్తుంటారు.
సాంకేతిక పరంగా కూడా నాలుగో భాగాల కోసం మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆధునిక విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ కొరియోగ్రఫీ, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాలకు అదనపు బలం కానున్నాయి. ముఖ్యంగా `క్రిష్` వంటి సిరీస్‌లకు ఇప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతికతతో మరింత అద్భుతమైన విజువల్స్ చూపించే అవకాశం ఉంది. కథలో పాత జ్ఞాపకాలను కలుపుతూనే కొత్తతరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా స్క్రిప్టులను సిద్ధం చేయడం దర్శకుల ప్రతిభకు నిదర్శనం.