మృణాల్ ఠాకూర్ కామెంట్స్‌కు బిపాసా బసు ఫినిషింగ్ టచ్!
బాలీవుడ్‌లో ఒకప్పుడు నటీమణులు అంటే? సన్నగా, నాజూగ్గా ఉండాలనే సాంప్రదాయ భావనలు ఉండేవి.
బాలీవుడ్‌లో ఒకప్పుడు నటీమణులు అంటే? సన్నగా, నాజూగ్గా ఉండాలనే సాంప్రదాయ భావనలు ఉండేవి. అయితే ఆ మూసధోరణులను తిరగరాస్తూ బాలీవుడ్‌లో కండలు తిరిగిన (మస్కులర్) శరీర ఆకృతితో ఫిట్‌నెస్‌కు సరికొత్త అర్థం చెప్పిన ఘనత నాదేనంటూ బిపాసా బసు చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన బిప్స్ ఫిట్‌నెస్, ఆరోగ్యం , సినీ పరిశ్రమలో ఎదురయ్యే వయోభారం ఒత్తిళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
2000 ప్రారంభంలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సమయాన్ని ఈ సందర్భంగా బిపాసా గుర్తు చేసుకున్నారు. ఆ కాలంలో చాలామంది నటీమణులు నాజూగ్గా, తెల్లగా, సున్నితమైన శరీర ఆకృతితో ఉండేవారని తెలిపారు. కానీ తాను మాత్రం పొడవుగా, అథ్లెటిక్ బిల్డ్‌తో, డార్క్ స్కిన్ టోన్‌తో అందరికంటే భిన్నంగా కనిపించేదాన్ని అన్నారు. ఆ రోజుల్లో మస్కులర్‌గా ఉన్న మహిళలను నటీమణులుగా అంగీకరించడం చాలా కష్టంగా ఉండేదని.. అయినా తాను భయపడకుండా ఆ ట్రెండ్‌ను ముందస్తుగా ప్రారంభించానని వెల్లడించారు.
కేవలం బాహ్య సౌందర్యం కోసం మాత్రమే కాకుండా అంతర్గత ఆరోగ్యం కోసమే ఫిట్‌నెస్ అవసరమని తాను ప్రతి ఒక్కరికీ చెప్పడం ప్రారంభించానని బిపాసా అన్నారు. `నన్ను నేను ప్రేమించుకోవడం అనే భావనను ప్రచారం చేయడం ద్వారానే మహిళల్లో వర్కవుట్స్ చేయడంపై .. ఆరోగ్యంగా ఉండటంపై అవగాహన పెరిగిందన్నారు. తాను సెట్ చేసిన ట్రెండ్ ద్వారా చాలామంది మహిళలు వ్యాయామం వైపు అడుగులు వేశారని, అయితే ప్రస్తుతం ప్రజలు ఆరోగ్యకరమైన కారణాల కోసమే చేస్తున్నారా? లేక? శరీరాకృతి బాగుండాలని చేస్తున్నారా అన్నది ప్రశ్నార్థకమేనని అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో వయస్సు పెరగడంపై పరిశ్రమలో ఉండే ఒత్తిడి గురించి కూడా బిపాసా మనసు విప్పారు. గ్లామర్ పరిశ్రమలో మహిళలకు వయస్సు పెరగడం అనేది పెద్ద పాపంగా చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. `నాకు 20 ఏళ్ల వయస్సు కంటే? ప్రస్తుతం ఉన్న వయస్సు ... వ్యక్తిత్వమే చాలా ఇష్టం. చిన్నదానిలా కనిపించాలనే ఒత్తిళ్లకు నేను ఎప్పటికీ లొంగిపోను. వయస్సుతో పాటు అందంగా మారడాన్ని నేను గర్వంగా భావిస్తాను` అని బిపాసా స్పష్టం చేశారు.
ఇటీవల నటి మృణాల్ ఠాకూర్‌కి సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో బిపాసా బసు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒక సీరియల్ ప్రమోషన్‌లో భాగంగా మృణాల్ కండలు తిరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే వెళ్లి బిపాసాను చేసుకో.. నేను ఆమె కంటే చాలా బెటర్ అని కామెంట్ చేశారు. ఈ పాత వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మృణాల్‌పై బాడీ షేమింగ్ ఆరోపణలు చేసి ట్రోల్ చేశారు. దీనిపై మృణాల్ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కూడా చెప్పారు.
సోషల్ మీడియాలో మృణాల్ వ్యాఖ్యలపై ట్రోలింగ్ ..మహిళల ఆరోగ్యంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో బిపాసా బసు చాలా గౌరవప్రదంగా, పరిణతి చెందిన శైలిలో సమాధానమిచ్చారు. ఎవరినీ ప్రత్యక్షంగా విమర్శించకుండా ఒక మహిళగా తన ఫిట్‌నెస్ ప్రయాణాన్ని, సాధించిన మార్పులను వివరిస్తూనే స్వయం ప్రేమ ,శారీరక దృఢత్వ ప్రాముఖ్యతను చాటిచెప్పడంపై నెటిజన్లు, అభిమానులు బిపాసాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.