మూవీ రివ్యూ : అవతార్: ఫైర్ అండ్ యాష్

Update: 2025-12-19 08:17 GMT

‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ మూవీ రివ్యూ

అవతార్.. ఈ పేరు చెబితే ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల మనసులు పులకరిస్తాయి. 16 ఏళ్ల కిందట ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లి విహరింపజేశాడు దర్శకుడు జేమ్స్ కామెరూన్. తాను ఆవిష్కరించిన ‘టైటానిక్’ అనే అద్భుతాన్ని కూడా మించిన అనుభూతిని ఇవ్వడమే కాదు.. దాన్ని మించిన బాక్సాఫీస్ విజయాన్ని కూడా అందుకున్నాడు కామెరూన్. ప్రపంచ సినిమా చరిత్రలో ‘అవతార్’దే ఒక ప్రత్యేక అధ్యాయం. ఆ సినిమా సాధించిన అద్భుత విజయంతో ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకేసారి నాలుగు సీక్వెల్స్ ప్రకటించాడు కామెరూన్. అందులో ఒకటి మూడేళ్ల ముందు ప్రేక్షకులను పలకరించింది. కానీ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ పేరుతో రిలీజైన ఆ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. విజువల్ గా అద్భుతం అనిపించినా.. సుదీర్ఘ నిడివి.. అలవాటైన కథతో ఒకింత నిరాశకు గురి చేసింది అవతార్-2. ఇంకో మూడేళ్లకు ఇప్పుడు ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు కామెరూన్. మరి ఈ చిత్రం ఎలాంటి అనుభూతిని ఇచ్చేలా ఉంది? తెలుసుకుందాం పదండి.

‘అవతార్-3’ విశేషాల్లోకి వెళ్లే ముందు ఒకసారి ‘అవతార్’ ప్రపంచాన్ని గుర్తు చేసుకోవాల్సిందే. మానవాళికి దూరంగా.. అద్భుత ప్రకృతి సౌందర్యం మధ్య పాండోరా అనే గ్రహంలో ‘నావీ’ అనే విచిత్ర జాతి ఉన్న సంగతిని కనిపెట్టి.. తమకున్న సాంకేతికతతో.. ఆయుధ బలంతో వారిని అక్కడి నుంచి నిర్మూలించి ఆ గ్రహాన్ని కబళించాలని ప్రయత్నం చేస్తుంది మానవజాతి. ఐతే తమకున్న ప్రత్యేక శక్తులకు సంకల్ప బలాన్ని జోడించి మనుషులపై తిరగబడి విజయం సాధిస్తారు నావీలు. నావీల రహస్యాలు తెలుసుకునేందుకు వారి అవతారంలోకి మారి పాండోరాకు వచ్చిన జాక్.. తర్వాత నావీల్లో ఒకడిగా మారి వారికి నాయకత్వం వహిస్తాడు. మనుషులపై పోరాటంలో నావీలను గెలిపిస్తాడు. ఇదీ ‘అవతార్’ కథ. ‘అవతార్-2’ విషయానికి వస్తే.. జాక్ మీద పగబట్టిన మనుషులు.. అతడి కుటుంబాన్ని అంతమొందించాలని ప్రయత్నిస్తే.. దాన్ని అతనెలా తిప్పికొట్టాడనే కథతో తెరకెక్కింది. ఇక ప్రస్తుత ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ కూడా దాదాపుగా ఇదే కథతో తెరకెక్కింది. ఐతే ఈసారి కథలోకి మాంగ్వాన్ అనే కొత్త తెగ వచ్చింది. నావీలకు శత్రువులైన ఈ తెగ సాయంతో మానవ జాతి మరోసారి పాండోరా మీద దాడి చేస్తే.. జాక్ నేతృత్వంలోని నావీలు.. వారితో కలిసొచ్చే సముద్ర జీవులతో కలిసి ఎలా పోరాడారన్న నేపథ్యంలో ‘అవతార్-3’ సాగుతుంది.

తెలుగులో వచ్చే కొన్ని సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన ఫలితాలను అందుకుంటూ ఉంటాయి. ప్రాంతాలను బట్టి అభిరుచుల్లో మార్పు ఉండడమే అందుక్కారణం. అలాంటిది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఏకతాటిపైకి తీసుకొచ్చి అందరికీ ఒకే రకమైన.. అద్భుతమైన అనుభూతి కలిగించడం అంటే అది అసామాన్యమైన విషయం. ‘అవతార్’తో ఆ ఘనతే సాధించాడు కామెరూన్. తనకే సాధ్యమైన అసాధారణ ఊహాశక్తితో తీర్చిదిద్దిన ‘పాండోరా’ అనే అద్భుత ప్రపంచం ఆ దేశం- ఈ దేశం అని తేడా లేకుండా ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఐతే కేవలం కామెరూన్ ‘అవతార్’లో కేవలం విజువల్ మాయాజాలంతో మాత్రమే మెప్పించలేదు. ఒక బలమైన సందేశంతో కూడిన.. ఒక సోల్ ఉన్న కథను ఆయన నరేట్ చేశాడు. మనిషి అత్యాశకు పోతే.. ప్రకృతిని కబళించాలని చూస్తే వినాశనం తప్పదనే సందేశాన్ని ఈ పాండోరా ప్రపంచంతో ముడిపెట్టి చూపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఐతే అవతార్-2 మరోసారి విజువల్ గా మాయాజాలం చేసినప్పటికీ.. కథ పరిధి చిన్నదైపోవడం.. మరీ నెమ్మదిగా-సుదీర్ఘంగా కథాకథనాలు సాగడంతో ప్రేక్షకులకు విసుగొచ్చేసింది. పార్ట్-2కు వచ్చిన ఫీడ్ బ్యాక్ తో ఈసారి కామెరూన్.. ఇంకొంచెం వేగంగా కథను చెప్పే ప్రయత్నం చేశాడు. పార్ట్-2లో ఎంచుకున్న ‘వాటర్’ బ్యాక్ డ్రాప్ తో పోలిస్తే.. ఈసారి ఆయన తీసుకున్న ‘ఫైర్’ నేపథ్యం కథలో కొంచెం వేడి పుట్టించింది. విజువల్స్ గురించైతే చెప్పాల్సిన పనే లేదు. ఎప్పట్లాగే కామెరూన్ కట్టిపడేశాడు. కానీ కామెరూన్ ఎంత మ్యాజిక్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ.. ఇప్పటికే బాగా అలవాటైపోయిన ప్రపంచం కావడంతో కొత్తదనాన్ని ఫీలవ్వలేం. ఎంతకీ తెగనట్లుగా సాగే సుదీర్ఘ నిడివి మరోసారి ప్రతికూలతగా మారింది. కథాకథనాల సంగతి పక్కన పెట్టేసి.. మరోసారి అవతార్ ప్రపంచాన్ని బిగ్ స్క్రీన్ మీద చూడాలనుకుంటే.. ఆ విజువల్ మాయాజాలంలో మునిగిపోవాలనుకుంటే ‘అవతార్-3’ చూడొచ్చు. కానీ కొత్తగా ఏదో ఆశిస్తే మాత్రం కష్టం.

‘అవతార్-2’లో మరీ నెమ్మదిగా.. తాపీగా కథను చెప్పిన కామెరూన్.. ‘అవతార్-3’లో మాత్రం వేగం పెంచాడు. ఆరంభం నుంచే కథనం రేసీగా సాగుతుంది. ఇందులో యాక్షన్ ఘట్టాల డోస్ కూడా బాగా పెరిగింది. నావీలంటే పడని మాంగ్వాన్ తెగతో కలిసిపోయిన కల్నల్.. జేక్ కుటుంబాన్ని దెబ్బ కొట్టే వైనం ఆసక్తికరంగా సాగుతుంది. సెకండ్ పార్ట్ లో కీలకంగా స్పైడర్ పాత్రను ఇందులో కూడా అంతే ప్రధానంగా చూపించారు. పాండోరాలో పరిస్థితులకు అలవాటు పడిపోయే అతణ్ని క్లోన్ చేసి మొత్తం ఆ గ్రహాన్ని కబళించాలనే ప్రయత్నం ఓవైపు జరుగుతుంటే.. ఇంకోవైపు మాంగ్వాన్ తెగ సాయంతో నావీలను దెబ్బ కొట్టే ప్రణాళిక మరోవైపు నడుస్తుంటుంది. ఇలా నావీలను పెద్ద ఉపద్రవంలోకి నెట్టేలా కథను కొంచెం ఆసక్తికరంగా మార్చాడు కామెరూన్.

‘అవతార్-2’లో జేక్ కేవలం తన కుటుంబాన్ని కాపాడుకోవడం మీద కథ నడవడం వల్ల దాని పరిధి తగ్గిపోయింది. కానీ ‘అవతార్-3’లో కథ కాన్వాస్ పెరిగింది. ఇక కామెరూన్ విజువలైజేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎఫెక్ట్స్ మరోసారి కళ్లు చెదిరిపోయేలా చేస్తాయి. కానీ ‘అవతార్’ను చూసినపుడు ప్రతి విషయం కొత్తగా.. వింతగా అనిపించినట్లు ఇప్పుడు అనిపించకపోవడమే పార్ట్-2.. పార్ట్-3లకు సమస్య. ఇదివరకే పరిచయం అయిన ప్రపంచం ఈసారి మనకు కొత్తగా అనిపించదు. కథ పరంగా చూస్తే ‘ది వే ఆఫ్ వాటర్’తో పోలిస్తే ఇది మెరుగే కానీ.. ‘అవతార్’ స్థాయిలో మాత్రం అనిపించదు. మూడు గంటల 17 నిమిషాల గంటల సుదీర్ఘ నిడివి వల్ల ‘అవతార్-2’ అక్కడక్కడా బోర్ కొట్టిస్తుంది. కథలోకి కొత్త పాత్రలను ప్రవేశపెట్టినా సరే.. చివరికి పాండోరా మీద ఆధిపత్యం కోసం మనుషుల ఆరాటం.. వారి నుంచి తమ గ్రహాన్ని కాపాడుకునేందుకు నావీల పోరాటం.. ఇదే లైన్లో కథ నడుస్తుంది కాబట్టి కొత్తదనాన్ని ఫీలవ్వలేం. ఐతే ముందే అన్నట్లు కథాకథనాలను పట్టించుకోకుండా ‘అవతార్’ విజువల్ మాయాజాలం కోసమే వెళ్తే మాత్రం ప్రతి రూపాయికీ గిట్టుబాటు అవుతుంది. ‘అవతార్’ నుంచి ఇంకో రెండు భాగాలు రానుండగా.. మూడో పార్ట్ చూసేసరికే ఓవర్ డోస్ అయిపోయిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగే అవకాశముంది.

చివరగా: అవతార్ 3.. విజువల్ మాయాజాలమే కానీ ఓవర్ డోస్

రేటింగ్- 2.75/5

Tags:    

Similar News