ఎందుకీ గందరగోళ పరిస్థితి.. ఆలోచించుకోవాలి!

Update: 2020-05-06 15:20 GMT
కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు.  వారికి మనం అప్పిస్తే వెంటనే దేవుడయిపోతాం. వాడు నాస్తికుడైనా సరే.. మనల్ని దేవుడు అంటాడు. అదే ఫ్రెండ్ అడిగిన సమయానికి మనం అప్పు ఇవ్వలేకపోయామంటే చాలు ఇన్ స్టంట్ కాఫీ లాగా ఇన్ స్టెంట్ దెయ్యంగా మారిపోతాం.  మరో విషయం ఏంటంటే అప్పు ఇచ్చిన తర్వాత.. వాడు చెప్పిన సమయానికి తిరిగి అడిగితే  అప్పుడు మనల్ని వాడు కొరివి దెయ్యం లాగా బ్రహ్మ రాక్షసుడి వెర్షన్ 2.0 లాగా చిత్రిస్తాడు.  ప్రస్తుతం వెబ్ సైట్ ల పరిస్థితి  ఇలాగే ఉంది.

ఒక సినిమాకు బజ్ కావాల్సి వచ్చినప్పుడు..  విషయంలేని సినిమాను జాకీలు వేసి లేపాల్సినప్పుడు.. ఒక హీరో మరో హీరోపై బ్యాక్ గ్రౌండ్ లో ప్రాపగాండా చెయ్యాల్సి వచ్చినప్పుడు.. రిలీజ్ చేసిన పబ్లిసిటీ కంటెంట్ ను టైమ్ టు టైమ్ అప్డేట్ చెయ్యాల్సి వచ్చినప్పుడు.. వారు ఇచ్చిన ఫేక్ కలెక్షన్లను ప్రశ్నించకుండా సినిమా బ్రతకాలి అని పబ్లిష్ చేసినప్పుడు.. వెబ్ సైట్లు దేవతలు.. దేవుళ్ళ తరహాలో కనిపిస్తాయి.  ఇండస్ట్రీకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నట్టు.. పరిశ్రమలో వెబ్ సైట్ లు కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాయన్నట్టుగా కనిపిస్తుంది. ఈ విషయాలకు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా కనిపిస్తే చాలు వెబ్ సైట్ లు వెంటనే చెడ్డవిగా మారిపోతాయి.  మంచి ఊరంతా చెప్పాలి.. చెడు చెవిలో చెప్పాలనే నీతి సూత్రం ఇక్కడ అసలు వర్తించదు.  ఎందుకీ గందరగోళ పరిస్థితి నెలకొంది?

మారుతున్న కాలానికి తగ్గట్టు ప్రేక్షకులు ఇన్ఫర్మేషన్ కోసం పేపర్లు.. ప్రింట్ మ్యాగజైన్ల కంటే ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న న్యూస్ వెబ్ సైట్స్ ను చూడడం మొదలు పెట్టారు.  ఇది మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు నిదర్శనం.  ఏది మంచి.. ఏది చెడు తెలుసుకోగలిగిన సమర్థత.. విజ్ఞత ప్రేక్షకులకు ఎప్పుడూ ఉంటుంది. అసలు సినిమా ఇండస్ట్రీనే ఫేక్ అని కొందరు అంటుంటారు.. ఇలా తవ్వుకుంటూ పోతే చాలా విషయాలు ఫేక్ అనిపించుకుంటాయి.  అయితే వెబ్ సైట్లు కూడా మీ తారల వ్యక్తిగత జీవితాలలోకి వెళ్లి మరీ చూడాల్సిన అవసరం లేదని కొందరు పెద్దలు సూచిస్తున్నారు.  అయితే తారలు కూడా వెబ్ సైట్లను రక్తం తాగే జలగలు.. పారసైట్లు అంటూ విరుచుకుపడడం సరికాదు.  పరిస్థితులకు అనుగుణంగా  అటు వెబ్ మీడియా..ఇటు ఫిలిం ఇండస్ట్రీ నడుచుకుంటూ వెళ్తే మేలని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News