ప‌వ‌న్‌ త‌ర‌హాలో టార్గెట్‌..ఎమోష‌న‌ల్ అయిన ద‌ళ‌ప‌తి!

అయితే పార్టీని ప్ర‌క‌టించిన త‌రువాత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని వైసీపీ వ‌ర్గాలు తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేయ‌డం తెలిసిందే. వ్య‌క్తిగ‌తంగా, ఫ్యామిలీ ప‌రంగా తీవ్ర అస‌హ‌నానికి గురి చేశారు.;

Update: 2026-02-23 16:07 GMT

జ‌న సేన పార్టీని స్థాపించి ఏపీ రాజ‌కీయాల్లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కింగ్ మేక‌ర్‌గా మారిన డిప్యూటీ సీఎం అయ్యారు. అయితే పార్టీని ప్ర‌క‌టించిన త‌రువాత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని వైసీపీ వ‌ర్గాలు తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేయ‌డం తెలిసిందే. వ్య‌క్తిగ‌తంగా, ఫ్యామిలీ ప‌రంగా తీవ్ర అస‌హ‌నానికి గురి చేశారు. ఇప్పుడు త‌మిళ‌నాట ఇదే త‌ర‌హా పరిస్థితుల్ని కోలీవుడ్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ ఎదుర్కొంటున్నారా? అంటే జ‌రుగుతున్న ప‌రిణామాలు, వేలూర్ బ‌హిరంగ స‌భ‌లో విజ‌య్ ఒక్క‌సారిగా ఎమోష‌న‌ల్ అయిన తీరుని బ‌ట్టి చూస్తే నిజ‌మేన‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

వేలూర్ బ‌హిరంగ స‌భ సాక్షిగా హీరో, టీవీకే పార్టీ అధ్య‌క్షుడు విజ‌య్ చేసిన భావోద్వేగా వ్యాఖ్య‌లే ఇందుకు అద్దం ప‌డుతున్నాయి. విజ‌య్ మాట్లాడుతూ ఎమోష‌న‌ల్ అయ్యారు. `ప్ర‌భుత్వాల అవినీతిని, అక్ర‌మాల‌ను ప్ర‌శ్నిస్తూ..వాటికి వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్నందుకే అంద‌రూ త‌న‌ని ల‌క్ష్యంగా చేసుకున్నార‌ని తెలిపారు. త‌మ పార్టీ నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ‌ల‌కు డీఎంకే ప్ర‌భుత్వం అనుమ‌తులు వివ్వ‌ట్లేద‌న్నారు. అందువ‌ల్లే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌లేక‌పోతున్నాన‌న్నారు.

టీవీకే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన త‌రువాత ప్ర‌తి గ్రామాన్ని సంద‌ర్శిస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా స్టాలిన్ ప్ర‌భుత్వంపై విజ‌య్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అవినీతి, నేరాల‌ను అరిక‌ట్టడంలో స్టాలిన్ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌న్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న‌వి ఎన్నిక‌లు కాద‌ని, త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌కు, అవినీతి ప్ర‌భుత్వానికి మ‌ధ్య యుద్ద‌మ‌న్నారు. ఈ యుద్ధంలో ప్ర‌జ‌లు విజ‌యం సాధిస్తార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల్లో త‌న‌ని ఎలాగైనా ఓడించాల‌ని స్టాలిన్ కుట్ర‌ప‌న్నుతున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో డీఎంకేకు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసిన‌ట్టేన‌న్నారు. ఎన్నిక‌ల భ‌యంతో స్టాలిన్ ప్ర‌భుత్వం భాజ‌పాతో పొత్తు పెట్టుకోవాల‌ని చూస్తోంద‌ని ఆరోపించారు. సెన్సిటివ్‌.. సెంటిమెంట్ అంటూ ఆవేశంగా మాట్లాడిన విజ‌య్ అదే స‌మ‌యంలో భావోద్వేగానికి లోను కావ‌డంతో బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న వారంతా ఒక్క‌సారిగా అరుపులు కేక‌ల‌తో విజ‌య్‌కి సంఘీభావం తెలియ‌జేశారు. రానున్న త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో రెండు కీల‌క స్థానాల నుంచి పోటీ చేయ‌బోతున్నారు. నార్త్ చెన్నై లోని పెరంబూర్‌, క‌ల‌త్తూర్‌, ఆర్కే న‌గ‌ర్‌. వీటిల్లో పెరంబూర్‌ నియోజ‌క వ‌ర్గం నుంచి ఆయ‌న బ‌రిలోకి దిగ‌నున్నార‌ని తెలుస్తోంది. మ‌రో నియోజ‌క వ‌ర్గం ఏంట‌న్న‌ది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన చివ‌రి సినిమా `జ‌న నాయ‌గ‌న్‌` సెన్సార్ వివాదం కార‌ణంగా రిలీజ్ ఆగిపోయిన విష‌యం తెలిసిందే. సీబీఎఫ్‌సీకి వ్య‌తిరేకంగా దీనిపై మేక‌ర్స్ కోర్టుని ఆశ్ర‌యించ‌డం, సినిమా రిలీజ్ మ‌రింత ఆల‌స్యం కావ‌డంతో మేక‌ర్స్ రాజీకి వ‌చ్చేసి కేసు విత్‌డ్రా చేసుకుని రివిజ‌న్ క‌మిటీకి పంపించ‌డంతో వివాదం ఓ కొలిక్కి వచ్చింది. అయితే సినిమా రిలీజ్ ఎప్పుడ‌న్న దాంట్లో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేప‌థ్యంలోనే త‌మిళ‌నాడు ఎన్నిర‌లు పూర్త‌యిన రెండు నెల‌ల త‌రువాత అంటే జూన్‌లో ఈ మూవీ రిలీజ్ అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్టుగా తెలిసింది.

Tags:    

Similar News