'మా' డైరీ ఆవిష్కరణ.. అసలు టార్గెట్ ఏంటంటే?

మూవీ ఆర్టిస్టుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తాజాగా మరో ముందడుగు వేసింది.;

Update: 2026-02-23 15:36 GMT

మూవీ ఆర్టిస్టుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తాజాగా మరో ముందడుగు వేసింది. అసోసియేషన్ నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేత సోమవారం ప్రజా భవన్ లో ఆవిష్కరణ చేయించింది. 'మా' అధ్యక్షుడు, టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఆధ్వర్యంలో జరిగిన ఆ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు, పలువురు ఆర్టిస్టులు పాల్గొన్నారు.

సభ్యుల కోసం ఏడాదిపాటు చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలు, ఆరోగ్య సేవలకు సంబంధించిన వివరాలు, అసోసియేషన్ సమాచారాన్ని సమగ్రంగా పొందుపరిచిన 'మా' డైరీని ప్రత్యేకంగా రూపొందించారు. ఆ డైరీ ద్వారా సభ్యులకు అవసరమైన సమాచారం ఒకేచోట అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మూవీ ఆర్టిస్టుల సంక్షేమం కోసం 'మా' చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. ఆర్టిస్టుల ఆరోగ్యం, భద్రత, సంక్షేమం కోసం ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, రెగ్యులర్ హెల్త్ చెకప్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఇటువంటి చర్యలు అసోసియేషన్‌ ను మరింత స్ట్రాంగ్ గా చేస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున కూడా అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ.. సభ్యుల సమస్యల పరిష్కారం తమ ప్రాధాన్యత అని క్లారిటీ ఇచ్చారు. ఆర్టిస్టులకు ఆరోగ్య భద్రత అత్యంత ముఖ్యమని భావించి మెడికల్ క్యాంపులు, ఆరోగ్య పరీక్షలు, అత్యవసర సహాయం వంటి కార్యక్రమాలు నిరంతరం చేపడుతున్నామని తెలిపారు. 'మా' డైరీ ద్వారా సభ్యుల మధ్య సమన్వయం పెరుగుతుందని, సంస్థల పనితీరు మరింత పారదర్శకంగా ఉంటుందని చెప్పారు.

అయితే డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో 'మా' వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు జయవాణి, మలక్‌ పేట్ శైలజ, శివ నారాయణ, శశాంక్, హరనాథ్ బాబు, మానిక్, సంపూర్ణేష్ బాబు, ఎం.ఆర్.సి. వడ్లపట్ల తదితరులు హాజరయ్యారు. అసోసియేషన్ భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించారు. డైరీ ఆవిష్కరణతో 'మా' కార్యకలాపాలకు కొత్త దిశ లభించిందని సభ్యులు అభిప్రాయపడ్డారు.

సభ్యుల సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణ, పరస్పర సహకారం లక్ష్యంగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. మొత్తంగా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం 'మా' ఐక్యతను, సభ్యుల పట్ల సంస్థ కట్టుబాటును మరోసారి చాటిచెప్పింది. ప్రస్తుతం డైరీ ఆవిష్కరణ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల మంచు విష్ణు పదవీకాలం ముగిసింది. కానీ మరోసారి ఆయననే కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. నిజానికి విష్ణు పదవీకాలం పూర్తై, ఎన్నిక జరగాల్సి ఉంది. కానీ మరోసారి విష్ణు ఉంటే పనులన్నీ జరుగుతాయని ఆలోచించారు కమిటీ సభ్యులు. అందుకే ఆయననే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు విష్ణు. అందులో భాగంగా ఇప్పుడు డైరీని తీసుకొచ్చారు.

Tags:    

Similar News