సౌత్‌లో 'నాభి' పైనే ఫోక‌స్ ఎక్కువ‌.. తాప్సీపై మ‌ళ్లీ ట్రోల్స్!

తాప్సీ పన్ను పాత గాయాన్ని ప‌దే ప‌దే కెలుకుతోంది. తన తాజా ఇంటర్వ్యూలలో ద‌క్షిణాదిన‌, భోజ్ పురి ప‌రిశ్ర‌మ‌లో `నాభి`పైనే ద‌ర్శ‌కులు ఎక్కువ‌గా దృష్టిని కేంద్రీక‌రిస్తార‌ని వ్యాఖ్యానించింది.;

Update: 2026-02-23 22:30 GMT

తాప్సీ పన్ను పాత గాయాన్ని ప‌దే ప‌దే కెలుకుతోంది. తన తాజా ఇంటర్వ్యూలలో ద‌క్షిణాదిన‌, భోజ్ పురి ప‌రిశ్ర‌మ‌లో `నాభి`పైనే ద‌ర్శ‌కులు ఎక్కువ‌గా దృష్టిని కేంద్రీక‌రిస్తార‌ని వ్యాఖ్యానించింది. హిందీ ప‌రిశ్ర‌మ‌తో పోలిస్తే ఈ అబ్సెష‌న్ ద‌క్షిణాదిన ఎక్కువ అని నోరు పారేసుకోవ‌డం చ‌ర్చ‌గా మారింది. మొత్తానికి ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు `నాభి`పై కొబ్బ‌రి కాయ స‌న్నివేశం అంశాన్ని మళ్లీ ప్రస్తావించడం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా తన తొలి చిత్రం `ఝుమ్మంది నాదం` అనుభవాలను మ‌రోసారి గుర్తు చేసుకోవ‌డం ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

అయితే నాటి ఘ‌ట‌న‌లోకి వెళితే.. తాప్సీ 2010లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో `ఝుమ్మంది నాదం` సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. రాఘవేంద్రరావు గారు తన సినిమాల్లో హీరోయిన్ల అందాన్ని వర్ణించడానికి వారి నాభిపై యాపిల్స్, ద్రాక్ష‌ పండ్లు.. పూలు వేయడం ఒక ట్రేడ్‌మార్క్ స్టైల్. అయితే తాప్సీ వంతు వచ్చేసరికి ఒక సాంగ్‌లో ఆమె నాభిపై ఏకంగా `కొబ్బరికాయ` వేశారు. దీనిపై తాప్సీ స్పందిస్తూ.. ``అప్పటికే నేను శ్రీదేవి గారి పాటలు చూశాను.. నాటి క‌థానాయిక‌లు అందరిపై పూలు, పండ్లు వేసేవారు. కానీ నాపై కొబ్బరికాయ వేయడంలో ఏముందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు`` అంటూ చమత్కరించారు.

తాప్సీ తన తాజా ఇంటర్వ్యూలలో కేవలం ఆ ఇన్సిడెంట్ మాత్రమే కాకుండా.. సౌత్ సినిమా మేకింగ్ స్టైల్‌పై కొన్ని కామెంట్స్ చేశారు. అయితే దీనిని రెండు కోణాల్లో విశ్లేషించాలి. ఒకవైపు దర్శకుడి సృజనాత్మకత, మరోవైపు న‌టి తాప్సీ అసౌకర్యం లేదా అబ్సెషన్.

నిజానికి కె. రాఘవేంద్రరావు విషయానికి వస్తే.. ఆయన సినిమాల్లో పూలు, పండ్లు, నీటి చుక్కలు శ‌రీర‌భాగాన్ని తాక‌డం అనేది ఒక `సింబాలిజం`. అప్పట్లో టెక్నాలజీ తక్కువగా ఉన్న రోజుల్లో హీరోయిన్ల అందాన్ని నేరుగా కాకుండా ప్రకృతితో పూలు పండ్ల‌తో ముడిపెట్టి చూపించడం ఆయన శైలి. అగ్ర నటీమణులు శ్రీదేవి, జయప్రద, రమ్యకృష్ణ ఆయన మేకింగ్‌ను ఒక గౌరవంగా భావించేవారు. అది ఒక రకమైన `గ్లామరస్ పోయెట్రీ` అని వారి అభిప్రాయం. ఆ ఉద్దేశంతో చూస్తే అది ఆయన క్రియేటివిటీ.

కానీ తాప్సీ వాదనలో అబ్సెషన్- ఆబ్జెక్టిఫికేషన్ క‌నిపించాయి. తాప్సీ లాంటి నేటితరం నటీమణుల కోణంలో చూస్తే.. కథతో సంబంధం లేకుండా కేవలం గ్లామర్ కోసమే శరీర భాగాలపై ఫోకస్ చేయడం ఆబ్జెక్టిఫికేషన్ (వస్తువుగా చూడటం)లా అనిపిస్తుంది. నాభిపై కొబ్బరికాయ వేయడం వల్ల వచ్చే అందం ఏంటో ఒక నటిగా తనకు అర్థం కాలేదని వ్యాఖ్యానించింది. ఒకే రకమైన షాట్‌లను ప్రతి సినిమాలోనూ రిపీట్ చేయడం అనేది సృజనాత్మకత కంటే ఒక రకమైన `అబ్సెషన్`గా చూస్తారు. అందుకే తాప్సీ త‌న అభిప్రాయాన్ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు.

ఇటీవ‌ల పరిశ్రమలో వచ్చిన మార్పు:

2026 నాటికి తెలుగు సినిమా ఈ ధోరణి నుంచి చాలా వరకు బయటపడింది. రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకులు గ్లామర్‌ను కథలో భాగంగా చూపిస్తున్నారు తప్ప.. అనవసరమైన షాట్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. `పుష్ప`లో శ్రీవల్లి పాత్ర గానీ, రాజ‌మౌళి చాలా క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌లో క‌థానాయిక‌ల పాత్ర‌లు నటనకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాయి.

ఒకప్పుడు కే రాఘ‌వేంద్ర‌రావు అనుస‌రించిన‌ది ట్రెండ్ లేదా క్రియేటివ్ స్టైల్ కావచ్చు. కానీ కాలం మారుతున్న కొద్దీ ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది. కేవలం గ్లామర్ కోసం చేసే ఇటువంటి ప్రయత్నాలు ఇప్పుడు ప్రేక్షకులకు కూడా అంతగా నచ్చడం లేదు. తాప్సీ అన్నట్లుగా నటీమణులను కేవలం శరీర భాగాలుగా కాకుండా, ఒక `పాత్ర`గా గౌరవించినప్పుడే సినిమాకు పరిపూర్ణత వస్తుంది.

అయితే ఆ కొబ్బరికాయ సీన్ గురించి తాప్సీ చమత్కారంగా చెప్పిన మాటలు.. దర్శకుడిని అవమానించడం కంటే.. అప్పట్లో తనకు ఎదురైన ఒక వింత అనుభవాన్ని పంచుకోవడంగానే భావించవచ్చు.

తాజా ఇంట‌ర్వ్యూలో తాప్సీ ఏమ‌న్నారంటే... సౌత్ సినిమాల్లో హీరోయిన్లను కేవలం గ్లామర్ బొమ్మలుగానే చూస్తారని.. పాటల్లో కేవలం నాభిని హైలైట్ చేయడమే సెన్సువాలిటీ అని భావిస్తారు అని అభిప్రాయపడ్డారు. హిందీలో కూడా ఐటమ్ సాంగ్స్ ఉన్నప్పటికీ సౌత్ సినిమాల్లో ఉన్నంత `నాభి` ఫిక్సేషన్ అక్కడ ఉండదని.. అది ఆ సినిమాల సంప్రదాయంగా మారిపోయిందని తాప్సీ బ‌లంగా అన్నారు.

గతంలో (2017లో) కూడా తాప్సీ ఇదే విషయాన్ని ఒక కామెడీ షోలో చెప్పినప్పుడు తెలుగు అభిమానులు ఆమెపై తీవ్రంగా మండిపడ్డారు. తనకు లైఫ్ ఇచ్చిన దర్శకుడిని కించపరిచిందని ట్రోల్ చేశారు. అయితే రాఘ‌వేంద్ర‌రావు గారిని కించ‌ప‌రిచే ఉద్ధేశం త‌న‌కు లేద‌ని తాప్సీ ఆ త‌ర్వాత అన్నారు. ఇప్పుడు మ‌రోసారి నాభి పై ద‌క్షిణాది ఫోక‌స్ గురించి తాప్సీ వ్యాఖ్యానించ‌గానే య‌థావిథిగా నెటిజ‌నులు ఆమెపై విరుచుకుప‌డుతున్నారు. ప్రస్తుతం తాప్సీ `అస్సీ` అనే సినిమాతో మళ్ళీ తన మార్కు బలమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Tags:    

Similar News