నిన్న లెనిన్.. నేడు చెన్నై లవ్ స్టోరీ.. అదే చర్చ

ఐతే ఈ పాత్రను శ్రీలీల చేసి ఉంటే అంత బాగా పండేది కాదని, ఆమె ఇలా పెర్ఫామ్ చేయగలిగేది కాదని.. ఆమెను తప్పించి మంచి పని చేశారని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు చేశారు.

Update: 2026-07-25 09:37 GMT

రెండు వారాల కిందట ‘లెనిన్’ సినిమా రిలీజైనపుడు హీరోయిన్ పాత్ర గురించి పెద్ద చర్చే జరిగింది. మొదట ఈ సినిమామొదలైనపుడు అఖిల్ అక్కినేని సరసన కథానాయికగా ఎంచుకున్నది శ్రీలీలను. కానీ కారణాలేంటో కానీ.. ఆమె స్థానంలోకి తర్వాత భాగ్యశ్రీ బోర్సే వచ్చింది. మేకర్స్ డేట్స్ ఇష్యూ వల్లే ఈ మార్పు జరిగిందన్నారు. ఈ చిత్రంలో భారతి పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ భాగ్యశ్రీ అందం, అభినయంతో ఆకట్టుకుంది. తన కెరీర్లో మరే చిత్రానికీ రానంత అప్రిషియేషన్ ఈ సినిమాతో అందుకుంది భాగ్యశ్రీ. ఆమెకు దక్షిణాదిన తొలి హిట్ కూడా ఇదే.

ఐతే ఈ పాత్రను శ్రీలీల చేసి ఉంటే అంత బాగా పండేది కాదని, ఆమె ఇలా పెర్ఫామ్ చేయగలిగేది కాదని.. ఆమెను తప్పించి మంచి పని చేశారని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు చేశారు. ఇలా ఒక కథానాయికను కించపరచడాన్ని చాలామంది తప్పుబట్టారు. ఇది అనవసర చర్చ అనే అభిప్రాయం కలిగింది. కొన్ని రోజుల పాటు సాగిన ఈ చర్చ తర్వాత సద్దుమణిగింది.

ఐతే ఇప్పుడు ఇంకో సినిమా విషయంలోనూ ఇలాంటి చర్చే జరుగుతోంది. శుక్రవారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’లో లీడ్ పెయిర్ కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ చాలా బాగా నటించారు. ముఖ్యంగా శ్రీ గౌరీప్రియపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇలాంటి పెర్ఫామెన్స్ అరుదు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాల్లో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న నటి ఇంత బాగా పెర్ఫామ్ చేయడం పట్ల ఆశ్చర్యపోతున్నారు.

ఐతే ఈ సినిమాకు ముందు హీరో హీరోయిన్లుగా అనుకున్నది ‘బేబి’ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యలను అన్న సంగతి తెలిసిందే. వాళ్లే ఈ పాత్రలను చేసి ఉంటే అవి ఇంత బాగా పండేవా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వైష్ణవి.. ఇప్పుడు ప్రేక్షకులు చూస్తున్న శ్రీ గౌరీప్రియను మ్యాచ్ చేయగలిగేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐతే నటనలో వైష్ణవిని తక్కువగా అంచనా వేయలేం. ‘బేబి’లో ఆమె అదిరపోయే పెర్ఫామెన్స్ ఇచ్చింది.

కానీ ‘చెన్నై లవ్ స్టోరీ’లో ఆమె భాగమై, ఎంత బాగా నటించినా సరే.. ఆ పాత్రకు తను సూటయ్యేదా అన్నది మాత్రం సందేహమే. ఎందుకంటే ‘బేబి’లో ఆమె చేసిన పాత్రకు ఇది పూర్తి భిన్నమైంది. ‘బేబి’ వల్ల వైష్ణవి మీద ఒక ముద్ర పడిపోయింది. తనకు ఒక బోల్డ్ ఇమేజ్ వచ్చింది. అలాంటి పాత్ర చేశాక.. ‘చెన్నై లవ్ స్టోరీ’లో నివేదిత లాంటి పాత్రతో ఆమె మెప్పించడం, ఆ పాత్రలో ప్రేక్షకులు తనను అంగీకరించడం కష్టమే. కాబట్టి కారణాలు ఏవైనప్పటికీ.. ఈ మార్పు మంచికే అనుకోవాలి.

Tags:    

Similar News