పవన్ కళ్యాణ్ ఆ హీరోయిన్ తో మళ్ళీ 'జల్సా' చేయబోతున్నాడా...?

Update: 2020-04-16 07:50 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత గ్యాప్ తీసుకొని రీఎంట్రీ మూవీగా 'వకీల్ సాబ్' పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా బడా నిర్మాత దిల్ రాజు మరియు బోణీ కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా హిందీలో అమితాబ్ నటించిన 'పింక్' చిత్రానికి రీమేక్. ఈ సినిమాలో నివేదా థామస్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడీగా శృతి హాసన్ నటించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. దీంతో 'గబ్బర్ సింగ్' జోడీని మరోసారి స్క్రీన్ పై చూడొచ్చని అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు. కానీ శృతి హాసన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో 'వకీల్ సాబ్'లో నటించడం లేదని చెప్పేసిందట. దిల్ రాజు ఆఫర్ ను కాదన్న శృతి హాసన్ ఇప్పుడు 'వకీల్ సాబ్' యూనిట్ ను ఇరకాటంలో పడేసింది. ఇక చేసేదేమి లేక శృతి హాసన్ చేయనంటే ఆ పాత్రలో గోవా బ్యూటీ ఇలియానాని తీసుకునే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం.

ఒకప్పుడు తన అందచందాలతో తెలుగు ఇండస్ట్రీని కొన్నాళ్ళు ఓ ఊపు ఊపిన ఇలియానాకి ప్రస్తుతం ఛాన్సులే కరువయ్యాయని చెప్పవచ్చు. బాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడంతో.. రవితేజ హీరోగా తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా పరాజయం పొందటంతో నిరాశే ఎదురై ఫేడ్ అవుట్ అయ్యే దశకు వచ్చింది. ఇప్పుడు అనుకోకుండా పవర్ స్టార్ పక్కన నటించే అవకాశం వస్తే ఇల్లీ బేబీ లక్కీ అనే చెప్పొచ్చు. గతంలో పవన్ కళ్యాణ్ - ఇలియానా జోడీ త్రివిక్రమ్ రూపొందించిన 'జల్సా' సినిమాలో రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ జంట 'వకీల్ సాబ్'లో జోడీ కట్టబోతున్నారనే రూమర్ బయటకి వచ్చింది. ఇదే కనుక నిజమైతే ఇలియానా వల్ల సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ వచ్చినట్టే. మరి ఈ వార్త నిజమై ఇలియానా మళ్ళీ ఫామ్ లోకి వస్తుందేమో చూడాలి. ఇదిలా ఉండగా కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగ్ వాయిదా వేసుకున్న 'వకీల్ సాబ్' లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత తిరిగి షూటింగ్ జరుపుకోనుంది. అంతేకాకుండా కొత్త రిలీజ్ డేట్ కూడా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
Tags:    

Similar News