అన్వేష్ కి ఇంస్టాగ్రామ్ భారీ షాక్.. ఫాలోవర్స్ మొత్తం స్వాహా.. అయినా మారని తీరు!
ప్రముఖ యూట్యూబ్ ట్రావెల్ వ్లాగర్ 'నా అన్వేషణ' అన్వేష్‌కు మెటా సంస్థ కోలుకోలేని షాక్ ఇచ్చింది.;
ప్రముఖ యూట్యూబ్ ట్రావెల్ వ్లాగర్ 'నా అన్వేషణ' అన్వేష్‌కు మెటా సంస్థ కోలుకోలేని షాక్ ఇచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలు, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్ట్‌లు చేశారన్న ఆరోపణలతో ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను శాశ్వతంగా తొలగించింది. ఒకప్పుడు 18 మిలియన్ల ఫాలోవర్లతో వెలిగిపోయిన ఆయన క్రేజ్, ఇటీవలి వివాదాలతో 1.3 మిలియన్లకు పడిపోవడమే కాకుండా ఇప్పుడు ఏకంగా అకౌంటే గాల్లో కలిసిపోయింది. దీనిపై అన్వేష్ తనదైన శైలిలో స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివాదాల అన్వేషణ.. చివరకు ఖాతా గల్లంతు:
సోషల్ మీడియాలో విభిన్న దేశాల విశేషాలను చూపిస్తూ పాపులర్ అయిన అన్వేష్, గత కొంతకాలంగా రూటు మార్చారు. హిందూ దేవుళ్లను కించపరిచేలా, మతాల మధ్య చిచ్చు పెట్టేలా వీడియోలు చేస్తున్నారంటూ ఆయనపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట , సైబర్ క్రైమ్ విభాగాల్లో కేసులు నమోదయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి ఆయన సోషల్ మీడియా కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలను అతిక్రమించారని నిర్ధారించుకున్న మెటా సంస్థ, ఆయన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌పై వేటు వేసింది. లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న పేజీ ఒక్కసారిగా మాయమవ్వడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ఒక చేయి పోతే ఏంటి? నా రేంజే వేరు:
అయితే తన అకౌంట్ బ్యాన్ అవ్వడంపై అన్వేష్ ఏమాత్రం తగ్గకుండా రియాక్ట్ అయ్యారు. "నాకు రెండు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు, రెండు యూట్యూబ్ ఛానెళ్లు ఉన్నాయి. అవి నా చేతులు, కాళ్ల లాంటివి. ఇప్పుడు ఒక చేయి పోయినంత మాత్రాన నాకేం నష్టం లేదు, ఒకవేళ ఇంకో చేయి పోయిన,కాళ్ళు వున్నాయి,అవి కూడా పొతే నా శరీరం వుంది,అన్నీ పోయిన నా నోరు వుంది చాలు, అంటూ ధీమా వ్యక్తం చేశాడు. కేవలం ఇన్‌స్టా ఫాలోవర్ల మీద తాను ఆధారపడలేదని, యూట్యూబ్ ద్వారానే తనకు నెలకు రూ. 8 లక్షల వరకు ఆదాయం వస్తుందని చెప్పుకొచ్చాడు. ఇన్‌స్టా అకౌంట్ పోయినా తన ఆర్థిక స్థితికి, క్రేజ్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదని ఆయన వీడియోలో స్పష్టం చేశారు.
2026 టార్గెట్.. బత్తాయిలకు నరకమే:
అకౌంట్ పోయిన బాధ కంటే, తనను విమర్శించే వారిపై అన్వేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన రెండో ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి వీడియో పోస్ట్ చేస్తూ, 2026లో తన వ్యతిరేకులను బత్తాయిలు అని సంబోధిస్తూ నరకం చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. తనను టార్గెట్ చేసిన వారికి భవిష్యత్తులో గట్టి సమాధానం చెబుతానని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరింత దుమారం రేపుతున్నాయి. ఒకవైపు పోలీసులు కేసులు, మరోవైపు మెటా నిషేధం ఉన్నా అన్వేష్ ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఫాలోవర్లు, అకౌంట్ పోయినా అన్వేష్ తన పంథా మార్చుకోనని చెప్పడం చర్చనీయాంశమైంది.