ప్యారడైజ్ టోన్ ఏంటో ‘A’తోనే చెప్పేశారు
కానీ ఇప్పుడు వరుసగా రెండు సినిమాలకు ‘A’ సర్టిఫికెట్ రావడం చూస్తుంటే అన్ని వర్గాల ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తోంది.
నాని సినిమా అంటే కొన్నేళ్ల క్రితం వరకు కుటుంబంతో కలిసి వెళ్లొచ్చనే భావన ఎక్కువగా ఉండేది. ‘భలే భలే మగాడివోయ్’, ‘నిన్ను కోరి’, ‘జెర్సీ’, ‘హాయ్ నాన్న’ వరకు ఆ ఇమేజ్ బాగా పనిచేసింది. మధ్యలో యాక్షన్ సినిమాలు చేసినా, నాని పేరు పూర్తిగా అడల్ట్ కంటెంట్ వైపు వెళ్లలేదు. కానీ ఇప్పుడు వరుసగా రెండు సినిమాలకు ‘A’ సర్టిఫికెట్ రావడం చూస్తుంటే అన్ని వర్గాల ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తోంది.
గతేడాది వచ్చిన ‘హిట్ 3’కు సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. అర్జున్ సర్కార్ పాత్రలో నాని చేసిన హింసాత్మక సన్నివేశాల కారణంగా ఆ సినిమా పెద్దలకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’కూ అదే సర్టిఫికెట్ వచ్చింది. కొత్త పోస్టర్‌లో భారీ ‘A’ అక్షరాన్ని మధ్యలో పెట్టి, జడల్ దాని మధ్య నుంచి దూకుతున్నట్టుగా చూపించారు. సెన్సార్ విషయాన్నే ఈసారి పోస్టర్ ఐడియాగా మార్చేశారు.
నాని గత సినిమాలు చూస్తే ఈ మార్పు ఇంకా బాగా కనిపిస్తుంది. శ్రీకాంత్ ఓదెలతో చేసిన ‘దసరా’కు U/A వచ్చింది. ‘సరిపోదా శనివారం’ కూడా U/Aతోనే థియేటర్లకు వచ్చింది. ‘హాయ్ నాన్న’కు అయితే U సర్టిఫికెట్ వచ్చింది. ఆ తర్వాత ‘హిట్ 3’, ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ వరుసగా A రావడంతో నాని చేస్తున్న పాత్రలు మరింత రఫ్‌గా మారుతున్నాయి.
‘ది ప్యారడైజ్’ విషయంలో ఈ సర్టిఫికెట్ రావడం ముందు ఊహించిందే. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ లో రక్తపాతం, గ్యాంగ్ గొడవలు, నాని రఫ్ లుక్ ఎక్కువగా కనిపించాయి. సినిమా నిడివి కూడా 2 గంటల 49 నిమిషాలుగా ఫిక్స్ అయింది. శ్రీకాంత్ ఓదెల ఈసారి కథను మరింత వైల్డ్ ప్రపంచంలో పెట్టినట్టు ప్రమోషన్స్ నుంచే తెలుస్తోంది. A సర్టిఫికెట్ అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఆలోచిస్తారు.
దీంతో బాక్సాఫీస్ దగ్గర ఒక ప్రాక్టికల్ సమస్య కూడా ఉంటుంది. నానికి రెగ్యులర్‌గా వచ్చే కుటుంబ ప్రేక్షకుల్లో పిల్లలతో సినిమా చూసే వాళ్లు కూడా ఉంటారు. ‘హిట్ 3’ సమయంలోనూ ఇదే పరిమితి ఉంది. అయినా ఆ సినిమా మంచి వసూళ్లు సాధించింది. ‘ది ప్యారడైజ్’కు తెలంగాణలో టికెట్ ధరలు కూడా పెరిగాయి. ఒకవైపు అడ్వాన్స్ బుకింగ్స్ వేగంగా సాగుతున్న సమయంలో, రిలీజ్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది చూడాలి.
నాని మాత్రం ఇదే తరహా సినిమాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. ‘ది ప్యారడైజ్’ తర్వాత సుజీత్‌తో చేస్తున్న ‘బ్లడీ రోమియో’ కూడా యాక్షన్ వైపే ఉన్నా, ఆ తర్వాత కుటుంబ కథ చేయాలనుకుంటున్నట్లు నాని ఇటీవల చెప్పాడు. వెంకీ అట్లూరితో కూడా ఓ సినిమా లైన్‌లో ఉంది. మరి ఆ సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.