అనుమతి లేకుండా బయోపిక్‌లు తీయడం ఎంత రిస్క్ అంటే?
| బయోపిక్‌ల నిర్మాణంలో ప్రముఖుల అనుమతులు, చట్టబద్ధమైన హక్కుల అంశం మరోసారి చర్చకు వచ్చింది. క్రికెటర్ సౌరవ్ గంగూలీ అనుమతి లేకుండా ఆయన జీవిత ఘట్టాలను ఉపయోగించి దూస్రా సినిమా తీసినట్లు ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. నిర్మాతలు రూ.2 కోట్ల బ్యాంక్ గ్యారంటీ డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ పరిణామం బయోపిక్ నిర్మాతలకు కీలక హెచ్చరికగా మారింది.
ఇటీవలి కాలంలో బయోపిక్ ల ట్రెండ్ నిరంతరాయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అన్ని రంగాల నుంచి ప్రముఖుల జీవితకథలను ఎంపిక చేసుకుని వాటిని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఉత్తరాంధ్ర మేటి కళాకారిణి గరివిడి లక్ష్మి, మరాఠా కళాకారిణి వీఠాభాయి (ఉత్తరాది) జీవితకథల్ని సినిమాలుగా తెరకెక్కించారు.
గరివిడి లక్ష్మి అనుమతి లేకుండానే తన పాటల్ని సినిమాల్లో కమర్షియల్ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్న సంగీత దర్శకుల గురించి పెద్ద చర్చ నడిచింది. గరివిడి లక్ష్మికి రాయల్టీ కూడా ఇవ్వకపోవడం అన్యాయమేనని ప్రజల్లో చర్చ సాగింది. అయితే శ్రద్ధాకపూర్ నటిస్తున్న ఈత (వీఠాభాయి జీవితకథ) సినిమా కోసం మడాక్ ఫిలింస్ అన్ని విధాలా రాయల్టీలు చెల్లించి సినిమాగా మలిచింది. గరివిడి లక్ష్మి కి కానీ వారి బంధువులకు కానీ తమ కళకు వెళ గురించి కానీ, చట్టబద్ధమైన హక్కుల గురించి కానీ అంతగా అవగాహన లేదు. అలాగే బలమైన సపోర్ట్ లేదు. కానీ వీఠాభాయి కుటుంబ సభ్యులకు దీనిపై చాలా అవగాహన ఉంది. వారు ప్రతిదీ మేకర్స్ ని ప్రశ్నిస్తున్నారు. త్వరలోనే ఈత చిత్రం విడుదలకు సిద్ధ మవుతుండగా దీనిపై బోలెడంత చర్చ సాగుతోంది.
ఇంతలోనే క్రీడా ప్రముఖుడైన సౌరవ్ గంగూలీ లైఫ్ ఇన్సిడెంట్స్ ని ఉపయోగించుకుని సినిమా తీసిన ఫిలింమేకర్స్ ఇరకాటంలో పడటంపై పెద్ద చర్చ సాగుతోంది. గత కొంతకాలంగా `దూస్రా` మేకర్స్ చట్టబద్ధంగా ఎలాంటి హక్కులు పొందకుండా, కనీస అనుమతి లేకుండా తన జీవితంలోని కొన్ని కీలక ఘట్టాలను వాడుకుంటూ సినిమా తీసేసారని క్రికెటర్ సౌరవ్ గంగూలీ కోర్టుకెక్కారు. దీనిపై ప్రస్తుతం విచారణ సాగుతోంది. కోర్టు గంగూలీకి అనుకూలంగా ఆదేశించడం ఆసక్తికరంగా మారింది.
క్రికెటర్ గంగూలీ అనుమతి పొందకుండానే అతడి జీవితంలోని కొన్ని కీలక ఘట్టాలను, వ్యక్తిగత గుర్తింపును సినిమా కోసం కమర్షియల్ గా ఉపయోగించు కున్నారని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు దూస్రా నిర్మాతలను 2 కోట్ల బ్యాంక్ గ్యారంటీగా డిపాజిట్ కట్టాలని కూడా ఆర్డర్ జారీ చేసింది. ఈ కేసును విచారించి తుది తీర్పు వెలువరిచే వరకూ అతడి హక్కుల పరిరక్షణ, భద్రత కోసం రమేష్ దేవ్ ప్రొడక్షన్స్ 2కోట్ల డిపాజిట్ ని కోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు కట్టాలని ఆదేశించింది.
ఈ తీర్పు అనంతరం .. ఎవరైనా సెలబ్రిటీ అనుమతులు పొందకుండా లైఫ్ ఇన్సిడెంట్స్ ని లేదా అతడి పేరును ఉపయోగించుకుని సినిమా తీసేయడం అంత సులువు కాదని అర్థమవుతోంది. ప్రముఖులు కోర్టుకు వెళితే కచ్ఛితంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి అరుదైన విషయాలపై ఔత్సాహిక నిర్మాతలతో పాటు, ఎగ్జిస్టెడ్ ఫిలింమేకర్స్ అందరూ అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. తప్పు చేసి చేతులు కాల్చుకునేకంటే ముందుగానే చట్టం గురించిన పూర్తి సమాచారం ఈరోజుల్లో ప్రతి ఒక్కరికీ అవసరమని ఈ ఘటనలు చెబుతున్నాయి.