ట్రెండింగ్: సమంత తర్వాత జెన్-Z లేడీ బాస్?
| ‘మైసా’ సినిమా కోసం రష్మిక మందన్న కఠినమైన యాక్షన్ శిక్షణ తీసుకుంటున్నారు. బ్యాంకాక్‌లో స్టంట్ కొరియోగ్రాఫర్ కేచా ఖంఫక్దీ పర్యవేక్షణలో రోజుకు 8-10 గంటలు సాధన చేశారు. కుంగ్ ఫూ, ముయే థాయ్ సహా పలు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుని రోప్ ఫైట్స్, భారీ స్టంట్స్ చేశారు. ఈ సినిమాతో యాక్షన్ హీరోయిన్‌గా కొత్త అవతారంలో కనిపించనున్నారు.
`మైసా` సినిమా కోసం రష్మిక కష్టం చూస్తుంటే, ఫైటింగులు చేయడానికి కఠోరమైన శిక్షణ తీసుకున్న తీరు చూస్తుంటే.. బ్యాంకాక్ లో రోప్ లతో పోరాటాలు చూస్తుంటే.. టాలీవుడ్ లో ఈ జనరేషన్ లో సమంత తర్వాత యాక్షన్ క్వీన్ గా మెరిసిపోయేది రష్మిక మందన్న అని అర్థం చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే...
తెలుగు చిత్రసీమలో `లేడీ బాస్` విజయశాంతి తర్వాత హీరోలకు దీటుగా యాక్షన్ సన్నివేశాలు చేయడంలో చాలా కాలానికి సమంత తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. `ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2` వెబ్ సిరీస్‌తో పాటు `మా ఇంటి బంగారం` చిత్రంలో సమంత చేసిన ఫైట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని..ఈ తరం మహిళా యాక్షన్ క్వీన్‌గా నిలబెట్టాయి. ఇప్పుడు అదే బాటలో టాలీవుడ్‌లో సమంత తర్వాత ఆ స్థాయిలో మెరిసిపోయే సత్తా తనకుందని నేషనల్ క్రష్ రష్మిక మందన్న నిరూపించబోతున్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో వస్తున్న `మైసా` సినిమా కోసం రష్మిక కష్టం చూస్తుంటే.. ఇండస్ట్రీకి మరో పవర్‌ఫుల్ యాక్షన్ హీరోయిన్ దొరికినట్టే అనిపిస్తోంది.
ఇప్పటివరకు కేవలం గ్లామర్- రొమాంటిక్ పాత్రలతో అలరించిన రష్మిక `మైసా` కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు. ఈ సినిమాలో అత్యంత సహజమైన- ఒళ్ళు గగుర్పొడిచే వైల్డ్ అండ్ రా యాక్షన్ సన్నివేశాల్లో రష్మిక నటించారు. ఒక సాధారణ అమ్మాయి తన శరీరాన్ని కష్టపెడుతూ ఇంతటి భారీ ఫైట్స్ చేయడం తనకు కూడా ఎంతో కొత్తగా.. సవాల్‌గా అనిపించిందని రష్మిక స్వయంగా చెప్పుకొచ్చారు. ఎలాంటి భయం లేకుండా కేవలం బలం- టెక్నిక్స్‌తో కూడిన ఈ యాక్షన్ సీన్స్ ఎంతో ఆసక్తిగా నేర్చుకున్న తీరు ఇటీవల విడుదలైన మేకింగ్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ సినిమాలో రోప్ వర్క్- కఠినమైన స్టంట్స్ ఉండటంతో చిత్రబృందం ప్రత్యేకంగా బ్యాంకాక్‌కు వెళ్లి మరీ రష్మికకు శిక్షణ ఇప్పించింది. అక్కడ ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ కేచా ఖంఫక్దీ పర్యవేక్షణలో రోజుకు 8 నుండి 10 గంటల పాటు నిరంతరాయంగా రష్మిక కఠోర సాధన చేశారు. కుంగ్ ఫూ- ముయే థాయ్- హప్కిడో- జుజిట్సు- తైక్వాండో వంటి రకరకాల మార్షల్ ఆర్ట్స్‌ను కలిపి రూపొందించిన ఫైట్లను రష్మిక ఎంతో సునాయాసంగా నూటికి నూరు శాతం కష్టపడి పూర్తి చేశారని స్టంట్ మాస్టర్ సైతం ప్రశంసించారు. అసాధ్యం అనుకున్న స్టంట్స్‌ను పట్టుదలతో చేస్తూ రష్మిక తన సామర్థ్యాన్ని నిరూపించిన తీరు చూస్తుంటే నెక్ట్స్ లేడీ బాస్ అవుతారా? అనే డౌట్ పుట్టించారు!
మహిళా యాక్షన్ క్వీన్‌గా సమంత ఎలా చెరగని ముద్ర వేస్తున్నారో.. అదే తీరుగా రష్మిక కూడా దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. `మైసా` విడుదల తర్వాత రష్మికను కూడా అందరూ టాలీవుడ్ నయా యాక్షన్ క్వీన్ అని పొగిడేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా పెళ్లి తర్వాత వచ్చిన మార్పుగా దీనిని చూడాలి.