ఖరీదైన పచ్చల హారంతో మహారాణినే తలపించింది!
| ముంబైలో జరిగిన ‘ఎర్త్‌షాట్ ప్రైజ్ 2026’ వేడుకలో సోనమ్ కపూర్ రాయల్ లుక్‌తో ఆకట్టుకున్నారు. 400 క్యారెట్లకు పైగా రష్యన్ ఎమరాల్డ్స్‌తో రూపొందించిన ఖరీదైన పోల్కీ హారం ధరించి మెరిశారు. అమృతా షేర్-గిల్ పెయింటింగ్ స్ఫూర్తితో అనామిక ఖన్నా రూపొందించిన చీర, వెల్వెట్ కోట్తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఖరీదైన పచ్చల హారంతో బ్రిటీష్ రాకుమారినే తలపించింది.. ఎవరు ఈ సుందరి? అంటే.. ది గ్రేట్ కపూర్ గాళ్ సోనమ్ కపూర్. బాలీవుడ్ ఫ్యాషనిస్టాగా హృదయాలను ఏలిన సోనమ్ కపూర్ పెళ్లి తర్వాతా ఫ్యాషన్ రంగంలో ఎంటర్ ప్రెన్యూర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బిజినెస్ మేన్ ని పెళ్లాడి రాయల్ లైఫ్ ని ఆస్వాధిస్తున్న సోనమ్ కపూర్ వీలున్న ప్రతి వేదికపైనా తనను తాను ఫ్యాషనిస్టాగా ఎలివేట్ చేసుకుంటూనే ఉన్నారు. ముంబైలో జరిగిన `ఎర్త్‌షాట్ ప్రైజ్ 2026` వేడుకలో సోనమ్ హొయలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఈ భామ మెడలో మెరిసిన ఖరీదైన పచ్చల ఆభరణాలు అందరి చూపునూ తనవైపు తిప్పుకున్నాయి.
ఈ వేడుకలో సోనమ్ కపూర్ తన ఆభరణాల ఎంపికతోనే అసలైన రాయల్ లుక్ లో మెరిసిపోయారు. అంజలి భీమ్రాజ్కా ఫైన్ జ్యువెల్స్ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సుమారు 400 క్యారెట్లకు పైగా రష్యన్ పచ్చలు (ఎమరాల్డ్స్) పొదిగిన సంప్రదాయ పోల్కీ హారం మహారాణి కళను తెచ్చిపెట్టింది. ఆకుపచ్చని మరకతాల కాంతికి తోడు.. చెవులకు కొలంబియన్ ఎమరాల్డ్ డ్రాప్ ఇయర్ కఫ్స్.. చేతికి భారీ పచ్చ ఉంగరం ధరించడంతో సోనమ్ లుక్‌లో రాజసం ఉట్టిపడింది. అదే వేడుకకు విచ్చేసిన బ్రిటిష్ రాజకుటుంబీకురాలు కేట్ మిడిల్టన్ సైతం దివంగత క్వీన్ ఎలిజబెత్ -2 వారసత్వ పచ్చల ఆభరణాలతో మెరవగా.. సోనమ్ కపూర్ తన 400 క్యారెట్ల ఎమరాల్డ్స్ హంగులతో ఏమాత్రం తగ్గకుండా పోటీనిచ్చారు.
కేవలం ఆభరణాలే కాదు.. ఆ పచ్చల హారానికి తగ్గట్టుగా సోనమ్ ఎంచుకున్న వస్త్రధారణ కూడా అంతే ప్రత్యేకంగా నిలిచింది. ప్రముఖ చిత్రకారిణి అమృతా షేర్-గిల్ 1936లో గీసిన `సుమైర్` అనే క్లాసిక్ పెయింటింగ్ స్ఫూర్తితో డిజైనర్ అనామిక ఖన్నా ఈ దుస్తులను రూపొందించారు. చేతితో పెయింట్ చేసిన ఆకుపచ్చ షిఫాన్ చీర.. దానిపై జర్దోసీ పనితనంతో కూడిన సిల్క్ వెల్వెట్ కోటుతో సోనమ్ కట్టిపడేశారు. సోదరి రియా కపూర్, అభిలాషా దేవ్నాని కలిసి చేసిన స్టైలింగ్ సోనమ్ అందాన్ని మరింత రెట్టింపు చేసింది.
90 ఏళ్ల నాటి భారతీయ చిత్రకళకు.. వందల క్యారెట్ల రష్యన్- కొలంబియన్ పచ్చల ఆభరణాలను జోడించి సోనమ్ కపూర్ సృష్టించిన ఈ ఫ్యాషన్ మాయాజాలం అంతర్జాతీయ మీడియా దృష్టిని సైతం ఆకర్షించింది. భారతీయ సంప్రదాయ పోల్కీ పనితనానికి.. ఆధునిక రాజరికపు హంగులను మేళవించి రెడ్ కార్పెట్‌పై ఎలా మెరవాలో సోనమ్ మరోసారి తనదైన శైలిలో నిరూపించారు.