టాప్- 5 పాన్ ఇండియా స్టార్స్‌లో ఉపాధి పెంచే స్టార్?

ఒకప్పుడు పెద్ద హీరోలు ఏడాదికి 3-4 సినిమాలు చేసేవారు.. సూప‌ర్‌స్ట‌ర్ కృష్ణ ఏడాదికి 7-8 సినిమాలు చేసిన సంద‌ర్భాలున్నాయి.;

Update: 2026-02-20 03:49 GMT

ఒకప్పుడు పెద్ద హీరోలు ఏడాదికి 3-4 సినిమాలు చేసేవారు.. సూప‌ర్‌స్ట‌ర్ కృష్ణ ఏడాదికి 7-8 సినిమాలు చేసిన సంద‌ర్భాలున్నాయి. ద‌ర్శ‌క‌ర‌త్న డా. దాస‌రి నారాయ‌ణ‌రావు ఏడాదిలో అత్య‌ధిక సినిమాలు చేసిన దిగ్ధ‌ర్శ‌కుడిగా నిరూపించారు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ కోసం ఒక్కో సినిమాకు 2 ఏళ్లు కేటాయిస్తున్నారు. దీనివ‌ల్ల ప‌రిశ్ర‌మ‌కు పెద్ద మొత్తంలో ఉపాధి త‌గ్గిపోతోంద‌నే ఆందోళ‌న నెలకొంది. కార్మిక లోకానికి ప‌ని లేక‌, ఉపాధి క‌రువై ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో మ‌న‌కు ఉన్న అర‌డ‌జ‌ను పాన్ ఇండియా స్టార్స్ లో ప్రభాస్ మాత్రమే రిస్క్ తీసుకుంటూ ఎక్కువ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీకి ఆక్సిజన్ అందిస్తున్నారనే అభిప్రాయం ఏర్ప‌డుతోంది. ఇండస్ట్రీ కార్మికుల పాలిట ప్రభాస్ ఒక అండ అనడంలో అతిశయోక్తి లేదు.

మ‌న పాన్ ఇండియా స్టార్ల ప్ర‌స్తుత స్టాట‌స్ ని ప‌రిశీలిస్తే... ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సందీప్ వంగాతో స్పిరిట్, హ‌ను రాఘ‌వ‌పూడితో ఫౌజి చిత్రీక‌ర‌ణ‌ల్లో పాల్గొంటున్నాడు. హైద‌రాబాద్ సిటీలో ఫౌజీని చిత్రీక‌రిస్తుండ‌గా, రామోజీ ఫిలింసిటీలో వేసిన సెట్ లో స్పిరిట్ చిత్రీక‌ణ సాగుతోంది. రాజా సాబ్ తో పాటు ప్యార‌ల‌ల్ గా ఈ రెండు సినిమాల చిత్రీక‌ర‌ణల్లోకి దిగిపోయాడు ప్ర‌భాస్.. ఒకే ఏడాదిలో మూడు నాలుగు సినిమాల్లో న‌టిస్తున్న ఏకైక హీరో ప్ర‌భాస్ మాత్ర‌మే. కెరీర్ ని గొప్ప‌గా ప్లాన్ చేస్తున్నాడు.. ఇత‌ర హీరోల కంటే వేగంగా మూవ్ ఆన్ అవుతున్నాడు. ఇండ‌స్ట్రీకి ప‌ని క‌ల్పిస్తున్నాడు.. కార్మికుల‌కు ఉపాధిని పెంచుతున్నాడు.

ప్ర‌భాస్ తో పోలిస్తే మ‌హేష్ ఒకే స‌మ‌యంలో ఒక సినిమాతోనే స‌రిపెడుతున్నాడు.. మ‌హేష్ ప్ర‌స్తుతం రాజ‌మౌళితో వార‌ణాసి మాత్ర‌మే చేస్తున్నాడు. త‌దుప‌రి సినిమాక క‌థ అయినా క‌నీసం ఫైనలైజ్ చేయ‌లేదు. రాజమౌళి సినిమా అంటే రెండేళ్ల పైనే పడుతుంది. దీనివల్ల ఆ ఒక్క సినిమా టీమ్‌కి పని దొరుకుతుంది కానీ, ఇండస్ట్రీలో ఎక్కువ సర్క్యులేషన్ ఉండదు. వార‌ణాసి కోసం మ‌హేష్ కావాల్సిన‌న్ని కాల్షీట్ల‌నుకేటాయించారు. అత‌డు చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తున్నారు. కానీ త‌న త‌దుప‌రి సినిమా ఫ‌లానా ద‌ర్శ‌కుడితో అని ప్ర‌క‌టించ‌లేక‌పోయారు.

రామ్ చ‌ర‌ణ్ ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. అత‌డు కేవ‌లం పెద్ది కోసం రెండేళ్లు కేటాయించేసాడు.. ఇప్ప‌టికీ త‌న త‌దుప‌రి సినిమాపై క్లారిటీని ఇవ్వ‌లేక‌పోయాడు.. ప్రాజెక్టుల విషయంలో చరణ్ చాలా ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. అత‌డు ప్ర‌స్తుతం కేజీఎఫ్ ఫేం ప్ర‌శాంత్ నీల్ తో `డ్రాగ‌న్` కోసం వంద‌శాతం కాల్షీట్లు ఇచ్చేసాడు. త‌న త‌దుప‌రి సినిమాని వెంట‌నే ప్ర‌క‌టించే మూడ్ అత‌డికి లేనే లేదు. దేవర సీక్వెల్ ఉంద‌ని అన్నారు.. కానీ పెద్ద అప్ డేట్ లేదు. ఎన్టీఆర్ కూడా క్వాలిటీ కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్నారు.. దీనివల్ల సినిమాల సంఖ్య తగ్గుతోంది.

అయితే ప్ర‌భాస్ త‌ర్వాత‌ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్లానింగ్ కాస్త స్పీడ్ గానే ఉంద‌ని చెప్పాలి. ఒకే స‌మ‌యంలో రెండు మూడు సినిమాలు చేయ‌క‌పోయినా, అట్లీతో సినిమాని పూర్తి చేస్తుండ‌గానే అత‌డు లోకేష్ క‌న‌గరాజ్ తో ప్రాజెక్ట్ ని దాదాపు ఖ‌రారు చేసాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అత‌డు `పుష్ప 3` గురించి హింట్స్ ఇవ్వడం చూస్తుంటే.. బన్నీ కూడా ఖాళీగా ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. బ‌న్నీతో పోలిస్తే చ‌ర‌ణ్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్ త‌మ లైన‌ప్ పై వంద‌శాతం క్లారిటీతో ఉన్న‌ట్టు అనిపించ‌డం లేదని విశ్లేషిస్తున్నారు.

సినిమా ఇండస్ట్రీ కేవలం గ్లామర్ మాత్రమే కాదు.. వేలాది మంది కార్మికుల పొట్ట నింపే ఒక భారీ పరిశ్రమ. ఈ కోణంలో చూస్తే ప్రస్తుతం `ప్రభాస్` నిజంగానే `ఉపాధి కల్పించే స్టార్‌`గా అగ్రస్థానంలో ఉన్నారు. రాజమౌళితో బాహుబ‌లి1, బాహుబ‌లి 2 కోసం ఐదేళ్లు కేటాయించిన తర్వాత.. ఇప్పుడు ఆ గ్యాప్‌ని పూడ్చడానికి అన్నట్టుగా ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు.

ఒక సినిమా షూటింగ్ జరుగుతుంటే సెట్‌లో వందలాది మంది దైనందిన కూలీలు, టెక్నీషియన్లు, జూనియర్ ఆర్టిస్టులకు పని దొరుకుతుంది. ప్రభాస్ ఏడాదికి కనీసం రెండు సినిమాలు రిలీజ్ చేయాలనే లక్ష్యంతో ఉండటం వల్ల వేలాది కుటుంబాలకు నిరంతర ఉపాధి లభిస్తోంది.

Tags:    

Similar News