ట్రెండీ స్టోరి: భారీ బడ్జెట్‌తో రోబో శంకర్ మళ్లీ మళ్లీ జూదం!
రోబో సహా కెరీర్ లో ఎన్నో క్లాసిక్ హిట్స్ తెరకెక్కించిన శంకర్ కెరీర్ ఇటీవలి కాలంలో పూర్తిగా డైలమాలో ఉంది. అయినా అతడు భారీతనం కోసమే మళ్లీ మళ్లీ పాకులాడుతున్నట్టు కనిపిస్తోంది..;
ఈరోజుల్లో భారీతనం నిండిన కథలు చెప్పేందుకు ప్రొఫెషనల్స్ అవసరం లేదు.. ఎవరైనా చెబుతారు. కానీ ఆ భారీతనాన్ని తెరపైకి తేవడానికి పెట్టే `బడ్జెట్` అత్యంత కీలకం. దానిని అందించే నిర్మాతలు, ఫైనాన్షియర్లు చాలా ఆస్తుల్ని అమ్మాల్సి ఉంటుంది. బ్యాంకులకు తణకాలు పెట్టాల్సి ఉంటుంది.. డబ్బు చెట్లకు కాయదు.. ఊరికే రాదు కదా!
అందుకే సినీపరిశ్రమ కేవలం హిట్టును నమ్ముకుంటుంది.. హిట్లు ఇచ్చే దర్శకులకు మాత్రమే పెట్టుబడులు సమకూరుస్తుంది. ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడిని నమ్మి, అదుపు తప్పి పెట్టుబడులు పెట్టించే దర్శకుడిని నమ్మి వందల కోట్లు కుమ్మరించేందుకు ఎవరూ సిద్ధంగా ఉండరు.
రోబో సహా కెరీర్ లో ఎన్నో క్లాసిక్ హిట్స్ తెరకెక్కించిన శంకర్ కెరీర్ ఇటీవలి కాలంలో పూర్తిగా డైలమాలో ఉంది. అయినా అతడు భారీతనం కోసమే మళ్లీ మళ్లీ పాకులాడుతున్నట్టు కనిపిస్తోంది..శంకర్ ఇండియన్ 2తో భారీ డిజాస్టర్ ని ఎదుర్కొన్నాడు. తదుపరి ఇండియన్ 3ని రిలీజ్ చేస్తామని ప్రకటించినా దానిపై స్పష్ఠత లేదు. ఇలాంటి సమయంలో `వేల్పరి` పేరుతో మరో భారీ ప్రాజెక్టుకు శంకర్ శ్రీకారం చుట్టడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమా కోసం సీనియర్ దర్శకుడు ఎంపిక చేసుకున్న కాస్టింగ్ వివరాలు పరిశీలిస్తే షాకవ్వకుండా ఉండలేరు.
వేల్పరి నవలా ఆధారిత చిత్రం. ఇందులో `దురంధర్` చిత్రంతో ఇండస్ట్రీలో సంచలన విజయం సాధించిన రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇదే సినిమాలో జాతీయ అవార్డ్ గ్రహీత `చియాన్` విక్రమ్ ని కూడా ఫైనల్ చేసారని , ఇలాంటి అగ్ర తారల కోసం శంకర్ వెతుకుతున్నాడని కథనాలొస్తున్నాయి.
అయితే భారీతనంతో పాటే బడ్జెట్ పెరుగుతుంది. స్టార్ కాస్టింగ్ .. హై ఎండ్ టెక్నీషియన్లను తీసుకోవాల్సి వస్తే మళ్లీ బడ్జెట్ కాన్వాస్ మారిపోతాయి. భారీతనం కోసం అతడు రాజీ అన్నదే లేకుండా పెట్టుబడులు పెట్టించాల్సి ఉంటుంది. అలా కాకుండా పెట్టుబడి తక్కువ రాబడి లేదా లాభాలు ఎక్కువ! అనే అనీల్ రావిపూడి ఫార్ములాతో ఇప్పుడు శంకర్ సినిమాలు తీసి నిరూపించాల్సి ఉంటుంది. కానీ ఆయన అలా చేయకుండా మరో `ఐ`, మరో అపరిచితుడు, మరో ఇండియన్ 2 తరహాలో భారీ తనం కోసం పాకులాడుతున్నట్టే కనిపిస్తోందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. శంకర్ మైండ్ సెట్ ఇంకా మారలేదని కూడా విమర్శిస్తున్నారు. మరోసారి శంకర్ 500కోట్లు అంతకుమించి బడ్జెట్ పెట్టించబోతున్నారని కూడా గుసగుస వినిపిస్తోంది.
విమర్శల్ని పట్టించుకోరా శంకరా?
అయితే శంకర్ ఇప్పుడు తనను తాను విశ్లేషించుకోవాల్సిన టైమ్ వచ్చినా మారలేదని కొందరు విమర్శిస్తున్నారు.
శంకర్ సినిమాల్లో భారీతనం అనేది కథలో భాగం. కానీ 2.0, ఇండియన్ 2 సినిమాల్లో ఆ భారీతనం కేవలం విజువల్స్ కే పరిమితమై, ఆత్మ లోపించిందని విమర్శలొచ్చాయి. ముఖ్యంగా ఇండియన్ 2 డిజాస్టర్ తర్వాత కూడా `వేల్పరి` లాంటి భారీ కాన్వాసును ఎంచుకోవడం, అత్యంత భారీ బడ్జెట్ తో ప్రాజెక్టును తలకెత్తుకోవడం ఒక రకమైన జూదమేనని విశ్లేషిస్తున్నారు.
రణవీర్ సింగ్, విక్రమ్ లాంటి నేషనల్ లెవల్ స్టార్లను తీసుకోవడం వల్ల మార్కెట్ పెరుగుతుంది కానీ.. బడ్జెట్ ఆకాశాన్ని తాకుతుంది. శంకర్ గ్రాఫిక్స్ పై పెట్టే శ్రద్ధను స్క్రిప్ట్ మీద పెట్టడం లేదనేది విమర్శకుల మాట. `వేల్పరి` అనేది ఒక గొప్ప నవల.. దానికి న్యాయం చేయాలంటే టెక్నాలజీ కంటే బలమైన ఎమోషన్ ముఖ్యం.
శంకర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లీ తన `మద్రాస్ రోజుల`లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆయన భారీతనం పక్కన పెట్టి చిన్న బడ్జెట్ - హై ఇంపాక్ట్' సినిమాలు తీయాలని విమర్శకులు విశ్లేషిస్తున్నారు. అనిల్ రావిపూడి లాగా పూర్తిగా లిమిటెడ్ బడ్జెట్ కామెడీలు కాకపోయినా, రాజమౌళి `మగధీర` తర్వాత `మర్యాద రామన్న` తీసినట్లుగా, శంకర్ తన మార్క్ సోషల్ మెసేజ్ తో ఒక మిడ్ రేంజ్ సినిమా తీయడం సరైన నిర్ణయమని విశ్లేషిస్తున్నారు.
ఇటీవల ట్రెండ్ మారింది. ప్రేక్షకులు కేవలం సెట్లు చూసి మురిసిపోవడం లేదు. సుజాత వంటి గొప్ప రచయితలు లేని లోటు శంకర్ సినిమాల్లో కనిపిస్తోంది. ఆయన లేరు గనుక కొత్త తరం రచయితలతో కలిసి పని చేయాలి. జెంటిల్‌మేన్, భారతీయుడు, ఒకే ఒక్కడు సినిమాల్లో భారీ సెట్లు ఉన్నా.. వాటి వెనుక బలమైన సామాజిక ఆవేదన ఉండేది. మళ్లీ ఆ ఆవేదనను శంకర్ వెలికితీయాలి. ఒకవేళ `వేల్పరి` నిజంగా రాజీ లేని నాణ్యతతో వస్తే శంకర్ మళ్ళీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ కింగ్ అవుతారు. కానీ కేవలం విజువల్స్ నమ్ముకుని కథను వదిలేస్తే మాత్రం మరో భారీ తప్పిదం అయ్యే ప్రమాదం ఉంది.