స్పెషల్ స్టోరీ:ఇద్దరు స్టార్ల త్యాగం పాన్ ఇండియా!
`ప్రతి ముప్పై సంవత్సరాలకు బ్రతుకు తాలూకా ఆలోచన మారుతుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు.;
`ప్రతి ముప్పై సంవత్సరాలకు బ్రతుకు తాలూకా ఆలోచన మారుతుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు. వ్యాపార వేత్తలు ఫ్యాషన్ అంటారు. రాజకీయ నాయకులు తరం అంటారు.. మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్‌లోనూ ఓ కొత్త థాట్‌ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడ్నే టార్చ్ బేరర్ అంటారు` `అరవింద సమేత`లో ఎన్టీఆర్‌ని ఉద్దేశించి రావు రమేష్ చెప్పిన డైలాగ్ ఇది. ఈ డైలాగ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటిలకు కరెక్ట్‌గా సూటవుతుంది.
టాలీవుడ్‌లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన పాన్ ఇండియా మూవీ `బాహుబలి`. ఎస్.ఎస్. రాజమౌళి అత్యంత సాహసోపేతంగా దీన్ని తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తే దానికి ప్రభాస్, రానా తమ వంతు సహాయ సహకారాల్ని అందించారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని వందల కోట్ల బడ్జెట్ పెట్టి ఓ కొత్త శకానికి నాందిపలికారు. దాంతో అద్భుతం ఆవిష్కృతమై టాలీవుడ్ ఇండస్ట్రీ స్వరూపమే మారింది. పాన్ ఇండియా సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాల పరంపర మొదలైంది. దీంతో బాహుబలిరి ముందు తరువాత తెలుగు సినిమా అనే టాక్ మొదలైంది.
తెలుగు సినిమా అంటే యావత్ ప్రపంచం తిరిగి చూడటం మొదలు పెట్టింది. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరో వైపు ఇద్దరు స్టార్ల కఠోరమైన శ్రమ, ఎంతో త్యాగం దాగి ఉందని ఇప్పుడిప్పుడే బయటికొస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్, రానా చాలా కష్టపడ్డారు. బాడీలని భారీ స్థాయిలో పెంచి మహా బలులుగా కనిపించారు. దీని కోసం కఠోరంగా కసరత్తులు చేశారు. అదే ఇప్పుడు వారికి శారీకంగా, హెల్త్ పరంగా ఇబ్బందుల్ని తెచ్చి పెట్టినట్టుగా తెలుస్తోంది. రానా భల్లాల దేవుడిగా భారీ కాయంతో కనిపించడానికి, తెలుగు సినిమాని హాలీవుడ్ చిత్రాల సరసన నిలబెట్టడానికి చాలా శ్రమించాడు.
అదే ఆయన హెల్త్ అప్‌సెట్ కావడానికి ప్రధాన కారణంగా నిలిచినట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా తన హెల్త్ అప్ సెట్ అయిన విషయాల్ని వెల్లడించి షాక్ ఇవ్వడం తెలిసిందే. ఆరోగ్య సమస్య ఉందని తెలిసి షాక్ అయ్యానని, ఆ తరువాత దానికి సంబంధించిన చికిత్స కోసం అమెరికాలో ఒంటరిగా ఉండాల్సి వచ్చిందని ఆ సమయంలోనే తానెవరన్నది తెలిసిందని, అప్పటి నుంచి కొత్త లైఫ్‌ని లీడ్ చేస్తున్నానని చెప్పారు. అంతే కాకుండా సినిమాలకు కూడా దూరంగా ఉంటూ వచ్చానని చెప్పుకొచ్చారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన ఓ దశలో తనకు నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్స్‌లు తిరిగి ఇచ్చేశానన్నారు.
కేవలం అతిథి పాత్రలకే పరిమితమవుతూ వచ్చిన రానా త్వరలో `జై హనుమాన్` మూవీలో కనిపించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రానాతో పాటు ప్రభాస్ కూడా ఇదే స్థాయిలో `బాహుబలి` కోసం శ్రమించాడు. భారీ కాయాన్ని పెంచడం కోసం..బాహుబలిలా కనిపించడం కోసం భారీగా కసరత్తులు చేయడం తెలిసిందే. అయితే దాని వల్లే ప్రభాస్ ఇప్పుడు కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ కారణంగానే ఎక్కువ శాతం బాడీ డబుల్‌ని ఉపయోగిస్తున్నారని టాలీవుడ్‌లో వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి త్యాగం ఫలితంగానే టాలీవుడ్ వర్గాలు ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్‌ని ఎంజాయ్ చేస్తున్నారని, భారీ స్థాయిలో పారితోషికాలని దక్కించుకుంటున్నారని కొంత మంది కామెంట్ చేస్తున్నారు.