అడ్వాన్స్ టికెట్‌ సేల్స్‌లో ఇండియా టాప్ -10 సినిమాలు

భారతదేశ వ్యాప్తంగా ఈ చిత్రం అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు రూ. 25 కోట్ల విలువైన ప్రీ-సేల్స్ (అడ్వాన్స్ బుకింగ్స్) నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.

Update: 2026-07-27 10:37 GMT

హాలీవుడ్ యాక్షన్ - సూపర్ హీరో చిత్రాలకు ఇండియా బాక్సాఫీస్ వద్ద ఉన్న క్రేజ్ అసాధార‌ణంగా ఉంద‌ని మరోసారి రుజువైంది. `ది ఒడిస్సీ` త‌ర్వాత ఇప్పుడు స్పైడ‌ర్ మేన్ హ‌వా మొద‌లైంది. టామ్ హాలండ్ కథానాయకుడిగా నటించిన `స్పైడర్ మేన్: బ్రాండ్ న్యూ డే` చిత్రం భారత బాక్సాఫీస్ వద్ద ముందస్తు టికెట్ బుకింగ్స్‌లో సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం విడుదలకి ఇంకా 3 రోజుల సమయం ఉండగానే.. దేశంలోని టాప్ నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్ అయిన పీవీఆర్ ఐనాక్స్, సినీపొలిస్‌లలో ఇప్పటికే 2.60 లక్షల టికెట్లు విక్రయమయ్యాయి. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే.. విడుదల సమయానికి కేవలం నేషనల్ చైన్స్‌లోనే అడ్వాన్స్ టికెట్ల సంఖ్య 4 లక్షల మార్కును సులువుగా దాటేలా కనిపిస్తోంది.

భారతదేశ వ్యాప్తంగా ఈ చిత్రం అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు రూ. 25 కోట్ల విలువైన ప్రీ-సేల్స్ (అడ్వాన్స్ బుకింగ్స్) నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. వ‌ర్కింగ్ డే అయిన‌ గురువారం రోజున విడుదలవుతున్నా.. ప్రేక్షకుల నుంచి అందుతున్న అసాధార‌ణ‌ స్పందన దృష్ట్యా తుది అడ్వాన్స్ బుకింగ్స్ మొత్తం రూ. 35 కోట్ల నుండి రూ. 40 కోట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశీ మార్కెట్‌లో స్పైడర్‌మేన్ పాత్రకు ఉన్న అపారమైన ప్రజాదరణను ఈ గణాంకాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.

మరోవైపు హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన దృశ్యకావ్యం `ది ఒడిస్సీ` కూడా ఇటీవల భారత బాక్సాఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ చిత్రం విడుదలకాక ముందే భారతదేశంలో ముందస్తు టికెట్ విక్రయాల ద్వారా దాదాపు రూ. 10 కోట్ల అడ్వాన్స్ కలెక్షన్లను సాధించింది. ముఖ్యంగా ఐమ్యాక్స్, 4డిఎక్స్ వంటి ప్రీమియం స్క్రీన్‌లలో ఏకంగా 90,000 పైగా టికెట్లు విక్రయమై.. నోలన్ సినిమాలకు భారతదేశంలో ఉండే ప్రత్యేకమైన ఆదరణను చాటిచెప్పాయి.

ఈ రెండు చిత్రాలను మినహాయిస్తే.. భారతదేశంలో ఇప్పటివరకు ముందస్తు టికెట్ సేల్స్‌తో రాబట్టిన ఆదాయ పరంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి టాప్-10 హాలీవుడ్ సినిమాల వివరాలు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. భారతీయ బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ యాక్షన్, సూపర్ హీరో చిత్రాల ప్రభావం ఏ స్థాయిలో ఉందో వాటి ముందస్తు టికెట్ విక్రయాల (అడ్వాన్స్ బుకింగ్స్) లెక్క‌లు స్ప‌ష్ఠంగా నిరూపిస్తున్నాయి. ఈ జాబితాలో `అవెంజర్స్: ఎండ్‌గేమ్` ఏకంగా రూ. 100 కోట్లకు పైగా అడ్వాన్స్ కలెక్షన్లతో 25 లక్షలకు పైగా టికెట్లు (నేషనల్ చైన్స్‌లో 8.5 లక్షలు) విక్రయించి భారత్‌లో ఆల్-టైమ్ రికార్డుతో మొదటి స్థానంలో నిలిచింది. దాని తర్వాత `స్పైడర్ మేన్: నో వే హోమ్` రూ. 42 కోట్లతో (16.5 లక్షల టికెట్లు), `అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్`రూ. 40 కోట్లకు పైగా (15 లక్షల టికెట్లు), `అవతార్: ది వే ఆఫ్ వాటర్` రూ. 40 కోట్ల (14.5 లక్షల టికెట్లు) అడ్వాన్స్ వసూళ్లతో తర్వాతి స్థానాల్లో నిలిచి బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటాయి.

అదేవిధంగా.. మార్వెల్ సిరీస్‌కు చెందిన `డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్` రూ. 30 కోట్ల అడ్వాన్స్ కలెక్షన్లు (11.5 లక్షల టికెట్లు) సాధించగా, క్రిస్టోఫర్ నోలన్ విజువల్ వండర్ `ఓపెన్‌హైమర్` రూ. 15 కోట్లతో (6.5 నుండి 7 లక్షల టికెట్లు) ఐమాక్స్ ప్రాధాన్యతతో అదరగొట్టింది. టామ్ క్రూజ్ యాక్షన్ డ్రామా `మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్` రూ. 12.5 కోట్లు (5 నుండి 5.5 లక్షల టికెట్లు), `థోర్: లవ్ అండ్ థండర్` రూ. 12 కోట్లకు పైగా (5.5 నుండి 6 లక్షల టికెట్లు) రాబట్టాయి. జాబితా చివరలో డిసి క్యారెక్టర్ చిత్రం `ది బాట్‌మ్యాన్` రూ. 9 కోట్లు (3.5 నుండి 4 లక్షల టికెట్లు) .. `ఫాస్ట్ ఎక్స్` రూ. 8.5 కోట్ల (3.2 నుండి 3.8 లక్షల టికెట్లు) అడ్వాన్స్ సేల్స్‌తో భారత్‌లో అత్యధిక ముందస్తు విక్రయాలు సాధించిన టాప్-10 హాలీవుడ్ చిత్రాలుగా నిలిచాయి.

ఇండియ‌న్ సినిమా మార్కెట్‌లో హాలీవుడ్ సినిమాల ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా మన దేశీయ పెద్ద హీరోల చిత్రాలకు లభించే స్థాయిలో హాలీవుడ్ సినిమాలకు సైతం ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ , కలెక్షన్లు రావడం భారతీయ బాక్సాఫీస్ విస్తృతిని ప్రతిబింబిస్తోంది. ఇటీవ‌లి కాలంలో నోల‌న్, కామెరూన్ వంటి దిగ్గ‌జ ద‌ర్శ‌కులు భార‌త‌దేశ మార్కెట్ గురించి విస్త్ర‌తంగా మాట్లాడుతున్నారంటే, మ‌న మార్కెట్ స‌త్తా ఏంటో కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News