ప్రేమకథల కొత్త ఫార్ములా ఇదేనా?

హీరోయిన్ల పాత్ర‌లు, ఎమోష‌న్స్, కథలో కీలక మలుపులను తీసుకొచ్చేలా రూపుదిద్దుకోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Update: 2026-07-27 10:15 GMT

ఒకప్పుడు తెలుగు ప్రేమకథల్లో హీరో పాత్రే కథకు ప్రధాన బలంగా ఉండేది. హీరోయిన్ పాత్ర ఎక్కువగా పాటలు, కొన్ని ఎమోష‌న‌ల్ సీన్స్ కు మాత్రమే పరిమితమయ్యేది. కానీ గత కొన్నేళ్లుగా ఈ ధోరణిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా యూత్‌ను టార్గెట్ గా చేసుకుని రూపొందుతున్న రొమాంటిక్ డ్రామాల్లో హీరోయిన్ల క్యారెక్ట‌ర్ల‌ను మరింత బలంగా, కథను మలుపు తిప్పేలా రాస్తున్నారు.

దీంతో కథలో ఎమోష‌న్స్ కొత్త స్థాయికి చేరడంతో పాటు ఆడియ‌న్స్ కూడా అలాంటి పాత్రలతో త్వరగా కనెక్ట్ అవుతున్నారు. హీరోయిన్ క్యారెక్ట‌ర్ కు సరైన ప్రాధాన్యం లభిస్తే ల‌వ్ స్టోరీ మరింత నేచుర‌ల్ గా, రియ‌లిస్టిక్ అనిపిస్తోందనే అభిప్రాయం సినీ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. ఇటీవలి కాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లెనిన్, చెన్నై లవ్ స్టోరీ సినిమాలు ఈ మార్పుకు మంచి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ల పాత్రలు కేవలం హీరో జ‌ర్నీలో భాగంగా కాకుండా, కథను ముందుకు నడిపించే కీలక శక్తిగా నిలిచాయి.

హీరోయిన్ల పాత్ర‌లు, ఎమోష‌న్స్, కథలో కీలక మలుపులను తీసుకొచ్చేలా రూపుదిద్దుకోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే సమయంలో హీరోల క్యారెక్ట‌ర్లు కూడా సాధార‌ణ‌ యూత్ మనస్తత్వాన్ని ప్రతిబింబించేలా ఉండటం వల్ల కథలోని ఎమోష‌న్స్ కు మరింత బలం చేకూరింది. ముఖ్యంగా పవర్‌ఫుల్, ఎమోషనల్‌గా డిజైన్ చేసిన హీరోయిన్ల క్యారెక్ట‌ర్లే ఈ రెండు సినిమాలకు యూత్ నుంచి మంచి ఆదరణ రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇక మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే, ఈ తరహా సినిమాలు సహజమైన ప్రేమకథలపై ప్రేక్షకుల్లో మళ్లీ ఆసక్తిని పెంచుతున్నాయి. ఓవ‌ర్ డ్రామా, బలవంతపు ట్విస్టులు లేదా మాస్ ఎలివేషన్ల కంటే రియ‌ల్ లైఫ్ కు దగ్గరగా ఉండే క్యారెక్ట‌ర్లు, సంబంధాల మధ్య ఏర్పడే ఎమోష‌న‌ల్ సంఘర్షణలను ఆడియ‌న్స్ ఎక్కువగా ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా జెన్ జీ ఆడియ‌న్స్ సమాన ప్రాధాన్యం ఉన్న హీరో హీరోయిన్ల క్యారెక్ట‌ర్ల‌ను మరింత ఆదరిస్తున్నారని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ క్యారెక్ట‌ర్ల‌ను కథకు కేంద్రబిందువుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కమర్షియల్ అంశాలతో పాటు బలమైన హీరోయిన్ క్యారెక్ట‌ర్లు, నేచుర‌ల్ రొమాన్స్, హృదయానికి హత్తుకునే ఎమోష‌న్స్ కలయికే ఇప్పుడు ప్రేమకథల స‌క్సెస్ కు కొత్త ఫార్ములాగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News