టాలీవుడ్ లో కొత్త 'లవ్ గురు'

హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి స్పూఫ్ మూవీలతో మొదట్లో సాయి రాజేష్‌కు వచ్చిన ఇమేజ్ వేరు. కానీ ఆ తర్వాత సంచలన ప్రేమకథలతో అతను తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.

Update: 2026-07-27 10:37 GMT

సినిమా జానర్లలో లవ్ స్టోరీలను ఎవర్ గ్రీన్ అంటారు కానీ.. కొత్తగా అనిపించేలా, మంచి ఫీల్ ఉండేలా ఆ కథలు రాయడం, వాటిని మొనాటనీ రాకుండా తెరకెక్కించడం, ప్రేక్షకుల మెప్పు పొందడం అంత తేలికేమీ కాదు. ముఖ్యంగా తెలుగులో వరుసగా ప్రేమకథలు తీసి మెప్పించిన రచయితలు-దర్శకులు తక్కువగా కనిపిస్తారు. తమిళంలో మణిరత్నం, గౌతమ్ వాసుదేవ్ స్థాయిలో ప్రేమకథలతో అద్భుతాలు చేసిన డైరెక్టర్లు అరుదు.

చిత్రం, నువ్వు నేను, జయం చిత్రాలతో సంచలనం రేపిన తేజ.. తర్వాత ఆ మూసలో పడి కనుమరుగైపోయాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్, శేఖర్ కమ్ముల లాంటి దర్శకులు ప్రేమకథలతోనే తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి.. తర్వాత వేరే జానర్ల వైపు వెళ్లిపోయారు. ఐతే ఇప్పుడు టాలీవుడ్‌కు ఒక కొత్త ‘లవ్ గురు’ దొరికాడు. రచయితగా-దర్శకుడిగా-నిర్మాతగా త్రిపాత్రాభినయం చేస్తూ.. ప్రేమకథలను మేకింగ్‌లో తనదైన ముద్ర వేస్తున్నాడు. అతనే.. సాయిరాజేష్.

హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి స్పూఫ్ మూవీలతో మొదట్లో సాయి రాజేష్‌కు వచ్చిన ఇమేజ్ వేరు. కానీ ఆ తర్వాత సంచలన ప్రేమకథలతో అతను తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. తనే కథ అందిస్తూ నిర్మించిన ‘కలర్ ఫొటో’ అతడిలోని సీరియస్ ఫిలిం మేకర్‌ను వెలుగులోకి తెచ్చింది. ఆ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు రావడం విశేషం. ఆ తర్వాత స్వీయ దర్శకత్వంలో ‘బేబి’ సినిమా తీస్తే అది టాలీవుడ్లో ప్రకంపనలు రేపింది. సంచలన కథాంశం, టిపికల్ క్యారెక్టర్లు, అదిరిపోయే టేకింగ్‌తో ఇటు రచయితగా, అటు దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు సాయిరాజేష్.

దీని తర్వాత దర్శకుడిగా ఇంకో సినిమా చేయకుండా.. ‘కలర్ ఫొటో’ తరహాలోనే కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ, స్వీయ నిర్మాణంలో ‘చెన్నై లవ్ స్టోరీ’ చేశాడు సాయిరాజేష్. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తోంది. కొంచెం డివైడ్ టాక్ వచ్చినప్పటికీ తట్టుకుని ఈ సినిమా బలంగా నిలబడింది. తొలి వీకెండ్లో భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు సాయి రాజేష్ అందించిన స్క్రిప్టే పెద్ద బలం అనడంలో సందేహం లేదు.

వరుసగా మూడో ప్రేమకథలోనూ వైవిధ్యం చూపించడం, మంచి ఫీల్ తీసుకురావడం చిన్న విషయం కాదు. సాయిరాజేష్ ప్రేమకథ చేశాడు అంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని.. మంచి ఫీల్, ఇంటెన్సిటీ ఉంటాయనే నమ్మకంతో ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. ప్రస్తుతం తనలా వరుసగా మంచి ప్రేమకథలు అందిస్తున్న ఫిలిం మేకర్స్ తెలుగులో లేరు. అందుకే తనను టాలీవుడ్‌లో కొత్త ‘లవ్ గురు’గా అభివర్ణిస్తున్నారు.

Tags:    

Similar News