తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!
| అన్నీ పనులు చేసి.. ఒక మనిషి చివరికి తన బలం నిజంగా ఏ పనిలో ఉందో అనే విషయం మర్చిపోయారంట. ప్రస్తుతం మన తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి అలాగే కనిపిస్తోంది.
అన్నీ పనులు చేసి.. ఒక మనిషి చివరికి తన బలం నిజంగా ఏ పనిలో ఉందో అనే విషయం మర్చిపోయారంట. ప్రస్తుతం మన తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి అలాగే కనిపిస్తోంది.
తెలుగు సినిమా అంటే ఒకప్పుడు అందరికీ ముందుగా గుర్తొచ్చేవి ప్రేమకథలు, కుటుంబ కథా చిత్రాలు. అందమైన ప్రేమ, కుటుంబ బంధాలు, మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. కానీ ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్‌లో మన దర్శకులు ఎక్కువగా మాస్ కథలు, భారీ యాక్షన్ సినిమాల వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో తెలుగు సినిమా అసలైన బలాన్ని మరిచిపోతోందా అనే ప్రశ్న ఎదురవుతోంది.
ఒకప్పుడు నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే, మనసంతా నువ్వే, సంతోషం, మన్మథుడు వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. ఈ సినిమాలకు భారీ యాక్షన్ సన్నివేశాలు, వందల కోట్ల బడ్జెట్లు అవసరం కాలేదు. మంచి కథ, అందమైన ప్రేమ, సహజమైన హాస్యం, కుటుంబ భావోద్వేగాలే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి.
ఇప్పుడు కూడా అలాంటి కథలకు ఆదరణ ఉందని కొన్ని సినిమాలు నిరూపిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించింది. ఈ సినిమా ఇతర భాషల్లో రీమేక్ అయి అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే సీతారామం ప్రేమకథ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. కానీ ఈ సినిమాలు ఏవి కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయలేదు.
ఇలాంటి సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేయడం కంటే, మొదటి నుంచే పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ఆసక్తికరంగా ఉంది. అయితే మన దర్శకులు, నిర్మాతలు ఆ ధైర్యం ఎందుకు చెయ్యడం లేదో ఎవరికి అర్థం అవ్వడం లేదు.
ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలు మాస్ సినిమాలు, భారీ యాక్షన్ చిత్రాలు తీస్తున్నాయి. కానీ మంచి ప్రేమకథలు, కుటుంబ కథా చిత్రాలు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. అలాంటి సమయంలో తెలుగు దర్శకులు తమ పాత బలాన్ని మళ్లీ గుర్తు చేసుకోవాలి. సందీప్ రెడ్డి ఒక మంచి లవ్ స్టోరీ తీసిన.. లేదా సుకుమార్ లాంటి దర్శకుడు ఒక మనిషి లవ్ స్టోరీ తీసి పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసిన.. అవి బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి.
ఒక మంచి ప్రేమకథ లేదా కుటుంబ కథ పాన్ ఇండియా స్థాయిలో క్లిక్ అయితే, తెలుగు సినిమాకు మరో కొత్త దారి తెరుచుకుంటుంది. భారీ యాక్షన్ సినిమాలతోనే కాదు, మనసుకు హత్తుకునే కథలతో కూడా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను గెలుచుకోవచ్చు.
ఈ ఒక్క ప్రయత్నం విజయవంతమైతే, పాన్ ఇండియా ప్రేమకథలు.. కుటుంబ సినిమాల విషయంలో తెలుగు సినిమా మళ్లీ తనదైన రాజ్యాన్ని సృష్టించే అవకాశం ఉంది. మరి ఇది ఎప్పటికీ నిజం అవుతుందో వేచి చూడాలి.