సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!
| సినిమా నటీనటులపై ఏఐ (AI) టెక్నాలజీతో జరుగుతున్న డీప్‌ఫేక్ దాడులపై మెగాస్టార్ చిరంజీవి గట్టిగా స్పందిస్తున్నారు.
సినిమా నటీనటులపై ఏఐ (AI) టెక్నాలజీతో జరుగుతున్న డీప్‌ఫేక్ దాడులపై మెగాస్టార్ చిరంజీవి గట్టిగా స్పందిస్తున్నారు. సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమస్యను పరిష్కరించే దిశగా చిరంజీవి తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. ఈరోజు చిరంజీవి అమిత్ షా ని కలవగా.. సాయంత్రం నుంచి వీరిద్దరూ దేని గురించి మాట్లాడుకున్నారు అన్న ప్రశ్న కామెంట్ల రూపంలో సోషల్ మీడియా మొత్తం వెల్లువెట్టింది. అయితే దీనిపై ఫైనల్ గా క్లారిటీ వచ్చింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి నకిలీ వీడియోలు సృష్టించడం పెరిగిపోయింది. ముఖ్యంగా సినీ నటీమణుల ఫొటోలు, వీడియోలను అసభ్యకరంగా మార్చి ప్రచారం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ఘటనలు బాధితుల వ్యక్తిగత జీవితాలను, గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ విషయంపై చిరంజీవి గతంలోనే సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు.
అయితే..కేవలం పోస్టులకే పరిమితం కాకుండా ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు. హైదరాబాద్‌లో అమిత్ షాను కలిసి డీప్‌ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగం గురించి చిరంజీవి వివరించారు. తెలుగు సినీ పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నటీనటులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు.
ఏఐ పేరుతో ఇతరుల గౌరవానికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి నేరాలను అరికట్టేందుకు బలమైన చట్టాలు రూపొందించాలని చిరంజీవి కోరినట్లు తెలుస్తోంది.
చిరంజీవి, రామ్ చరణ్ లేవనెత్తిన అంశాలను అమిత్ షా సానుకూలంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఆయన భరోసా ఇచ్చినట్లు సమాచారం. అలాగే.. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందించాలని సూచించారంట.
ఈ సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలను సమన్వయం చేసే బాధ్యతను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది.
అమిత్ షా సానుకూలంగా స్పందించడంతో చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. డీప్‌ఫేక్ బాధితులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.