దెబ్బ మీద దెబ్బ‌.. ఇక య‌శ్, చిరుల‌పైనే ఆశ‌లు

ఈ చిత్రాల‌తో నిర్మాత వెంక‌ట్.కె.నారాయ‌ణ‌ రాత మారిపోతుంద‌ని, భారీ లాభాలు అందుకుంటార‌ని అంతా అనుక‌న్నారు. కానీ ఊహించ‌నిదే జ‌రిగింది.

Update: 2026-07-27 10:14 GMT

కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్‌.. సౌత్ ఇండియన్ సినిమాలోకి ఒక్క‌సారిగా దూసుకొచ్చిన ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌. క‌న్న‌డ‌లో సాక‌త్, బై టు ల‌వ్, క‌ల్ట్ అనే మూడు మిడ్ రేంజ్ సినిమాలు తీసిన ఆ సంస్థ‌.. ఒక్కసారిగా ప్రొడ‌క్ష‌న్ స్కేల్ పెంచేసింది. ధ్రువ్ స‌ర్జా హీరోగా భారీ బ‌డ్జెట్లో డెవిల్ అనే క‌న్న‌డ సినిమాను లైన్లో పెట్టిన ఆ సంస్థ‌.. కేజీఎఫ్‌తో తిరుగులేని క్రేజ్ సంపాదించిన య‌శ్ త‌ర్వాతి సినిమా టాక్సిక్‌తో పాటు.. త‌మిళ నంబ‌ర్ వ‌న్ హీరో విజ‌య్ చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్‌ను కూడా ప్రొడ్యూస్ చేసింది.

మ‌రోవైపు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి కొల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఒక సిన‌మాను లైన్లో పెట్టింది. చిన్న స్థాయిలో ప్రొడ‌క్ష‌న్ మొద‌లుపెట్టిన ఒక నిర్మాత‌.. వ‌రుస‌గా ఇలా భారీ ప్రాజెక్టులు చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఈ చిత్రాల‌తో నిర్మాత వెంక‌ట్.కె.నారాయ‌ణ‌ రాత మారిపోతుంద‌ని, భారీ లాభాలు అందుకుంటార‌ని అంతా అనుక‌న్నారు. కానీ ఊహించ‌నిదే జ‌రిగింది.

కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ సినిమాలు ఒక్కొక్క‌టిగా చిక్కుల్లో ప‌డ్డాయి. విప‌రీతంగా ఆల‌స్యం అయ్యాయి. డెవిల్ ఒక పాట కార‌ణంగా వివాదంలో ప‌డింది, దాని విడుద‌లా ఆల‌స్యం అయింది. తీరా చూస్తే సినిమాకు ఆశించిన ఫ‌లితం రాలేదు. ఇక జ‌న‌నాయ‌గ‌న్ చుట్టూ నెల‌కొన్న స‌మ‌స్య‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అన్ని అడ్డంకుల‌నూ దాటుకుని ఈ గురువారం రిలీజైన సినిమాకు బ్యాడ్ రివ్యూలు, టాక్ వ‌చ్చాయి. వ‌సూళ్ల సంద‌డి తొలి రోజుకే ప‌రిమిత‌మైంది. రెండో రోజు బాగా డ్రాప్ అయ్యాయి. సినిమా త‌మిళంలో కూడా ఎక్కువ రోజులు ఆడే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అస‌లే రిలీజ్ ఆల‌స్యం వ‌ల్ల బాగా న‌ష్ట‌పోయాడు నిర్మాత‌.

ఇప్పుడు సినిమా ఫ్లాప్ కావ‌డంతో న‌ష్టం చాలా పెద్ద స్థాయిలోనే ఉండ‌బోతోంది. ఆల్రెడీ డెవిల్ దెబ్బ చాల‌ద‌న్న‌ట్లు ఇంకా భారీ షాక్ త‌గిలింది విజ‌య్ సినిమా రూపంలో. ఇక నారాయ‌ణ ఆశ‌ల‌న్నీ టాక్సిక్‌తో పాటు చిరు సినిమా మీదే ఉన్నాయి. టాక్సిక్ మీద కూడా భారీ బ‌డ్జెట్ పెట్టిన నేప‌థ్యంలో వ‌చ్చే నెల‌లో రిలీజ‌య్యే ఆ చిత్రం మంచి ఫ‌లితాన్ని అందుకోవాల్సిందే. లేదంటే చిరు సినిమాకు కూడా ఫైనాన్స్ ఇబ్బందులు త‌ప్ప‌వేమో.

Tags:    

Similar News