ఔను.. వంశీ వెబ్ సిరీస్ వైపు అడుగులు వేస్తున్నారట...!

Update: 2020-05-07 06:10 GMT
టాలీవుడ్ లోని సీనియర్ మోస్ట్ దర్శకులలో వంశీ ఒకరు. 'మంచుపల్లకి' 'మహర్షి' 'సితార' 'అన్వేషణ' 'ప్రేమించు పెళ్ళాడు' 'లేడీస్ టైలర్' 'చెట్టు కింద ప్లీడర్' 'ఏప్రిల్ 1 విడుదల' 'ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు' 'గోపి గోపిక గోదావరి' లాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు వంశీ. ఆయన సినిమాకి ఈ జెనరేషన్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికి ఆయన సినిమాలు టీవీల్లో ప్రసారం చేస్తే టీవీలకు అతుక్కొనిపోయి చూసే జనాలున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే గత కొంత కాలంగా ఈయన సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దర్శకుడిగానే కాక వంశీ మంచి రైటర్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. బోలెడు కథలు, నవలలు, సీరియల్స్ కూడా రాసిన వంశీ ఇప్పుడు తన స్వీయ చరిత్రను స్వహస్తాలతో రాయనున్నారు. ఆయ‌న జీవితంలోని విశేషాల‌న్నీ 'పొల‌మారిన జ్ఞాప‌కాలు' రూపంలో రాస్తున్న సంగ‌తి తెలిసిందే. స్వాతి వార ప‌త్రిక‌లో ప్ర‌చురిత‌మైన ఈ వ్యాసాల‌కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది. త్వ‌ర‌లో ఈ క‌థ‌లన్నీ పుస్త‌కం రూపంలో రాబోతున్నాయి.

అయితే అంతకంటే ముందు వంశీ వెబ్ వరల్డ్ లో అడుగుపెట్టబోతున్నాడని సమాచారం. ఈ మద్య కాలంలో సినిమాల కంటే కూడా వెబ్ సిరీస్ లు చూడటానికే ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కంటెంట్ ఎలా ఉన్నా కూడా ఫ్యామిలీస్ అందరూ ఒకే దగ్గర సరదాగా గడుపుతూ ఈ వెబ్ సిరీస్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు కారణం వెబ్ సిరీస్ కూడా సినిమాలకి ఏమాత్రం తగ్గ కుండా భారీగా నిర్మిస్తున్నారు. రాబోయే రోజుల్లో వెబ్ కంటెంట్ దే రాజ్యం కాబోతుందని ఆలోచిస్తున్న నటీనటులు దర్శక నిర్మాతలు ఆ వైపుగా అడుగులు వేస్తున్నారు. సినిమాల‌కు మించిన బ‌డ్జెట్లు పెట్ట‌డానికి ఓటీటీ సంస్థ‌లు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే మన టాలీవుడ్ నుండి హీరో హీరోయిన్స్ డైరెక్టర్లు వెబ్ సిరీస్ వైపు అడుగులు వేశారు. నందిని రెడ్డి, సంకల్ప్ మొదలైన వారు ఇప్పటికే వెబ్ సిరీస్ డైరెక్షన్ లోకి దిగిపోయారు.

ఈ నేపథ్యంలో సీనియర్ డైరెక్టర్ వంశీ కూడా వెబ్ సిరీస్ డైరెక్ట్ చేయబోతున్నారట. ఓ ఓటీటీ సంస్థ వంశీని సంప్ర‌దించి 'పొల‌మారిన జ్ఞాప‌కాల్ని' వెబ్ సిరీస్‌గా రూపొందించాల‌ని.. దానిక‌య్యే ఖ‌ర్చు భ‌రిస్తామ‌ని చెప్పింద‌ట‌. ప్ర‌స్తుతం ఆ ప‌నుల్ని మొద‌లెట్టారట వంశీ. లాక్ డౌన్ ఎత్తేశాక ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. వంశీ సినిమా అంటేనే సహజమైన పాత్రలు.. హృదయానికి హత్తుకొనే సంగీతం.. గలగల పారే గోదావరి ఇవే గుర్తొస్తాయి. మరి ఈ వెబ్ సిరీస్ కూడా అదే కోవలో రూపొందిస్తాడేమో చూడాలి.  


Tags:    

Similar News