మెగా హీరో అమ్మాయి కాళ్లు పట్టుకున్నందుకే అది డిలీట్ చేశారా..?

Update: 2021-03-31 11:30 GMT
మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ ''ఉప్పెన'' సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో అయినప్పటికీ హీరోయిజం.. భారీ యాక్షన్ వంటివి పక్కనపెట్టి ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో వచ్చాడు. అంతేకాకుండా ఓ కొత్త పాయింట్ తో ఏ హీరో చేయని డేరింగ్ స్టెప్ వేశాడని చెప్పవచ్చు. వాలెంటైన్స్ డే సందర్భంగా వచ్చిన ఈ సినిమా చూసి మెగా హీరో ఇలాంటి సినిమా చేయడమేంటి అనే కామెంట్స్ చేసినవాళ్ళు కూడా ఉన్నారు. ఏదైతేనేం వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టీ - విజయ్ సేతుపతి నటనకు దేవిశ్రీప్రసాద్ సంగీతం తోడై 'ఉప్పెన' వసూళ్ళ సునామీ సృష్టించింది.

బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ కలసి నిర్మించిన ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. అయితే సినిమా విడుదలైన ఇన్ని రోజుల తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు ఎడిటింగ్ లో తీసేసిన కొన్ని సీన్స్‌ ని ఒక్కక్కటిగా యూట్యూబ్‌ లో వదులుతున్నాడు. అందులో హీరో తన బస్తీ అమ్మాయిని ఒప్పించి బేబమ్మకు లవ్ లెటర్‌ ఇప్పించే సన్నివేశం అభిమానులను ఆకట్టుకుంటోంది. బేబమ్మకు లవ్‌ లెటర్‌ ఇచ్చేందుకు ఆశీ పడే ప్రయత్నాలు ఫన్నీగా ఉండటమే కాకుండా.. ఈ సన్నివేశంలోవచ్చే గోదావరి జిల్లా జానపద గీతం కూడా అలరిస్తోంది. దీంతో ఇంత మంచి సీన్ ని ఎందుకు డిలీట్ చేశారా అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. అయితే అందులో వైష్ణవ్ తేజ్ ఆ అమ్మాయి కాళ్లు పట్టుకోవడం వల్లనే ఈ సీన్ ని తొలగించి ఉంటారని.. మెగా హీరో ఇక అమ్మాయి కాళ్లు పట్టుకుంటే ఫ్యాన్స్ అంగీకరించారనే ఉద్దేశ్యంతో తీసేసి ఉంటారని కామెంట్స్ వస్తున్నాయి. మరి ఇంకా ఇలాంటి సన్నివేశాలు ఎన్ని ఉన్నాయో చూడాలి.
Tags:    

Similar News