నటి శ్రావణి కేసులో కీలక విషయాలు చెప్పిన డీసీపీ

Update: 2020-09-14 10:50 GMT
‘మనసు మమత’ , మౌనరాగం వంటి సీరియళ్లతో పాపులర్ అయిన బుల్లితెర నటి శ్రావణి (26) అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్య వ్యవహారం రోజుకో మలుపులు తిరుగుతోంది. శ్రావణి ఆత్మహత్య వ్యవహారంలో సాయికృష్ణ పేరు మొదట వినిపించింది. ఆ తర్వాత దేవరాజు రెడ్డి అన్నారు.వీరిద్దరితోపాటు ఓ సినిమా నిర్మాత  పేరు కూడా వినిపిస్తోంది.  అయితే తాజా విచారణలో అసలు నిందితులు ఎవరో తేలినట్టు తెలిసింది.

తాజాగా నటి శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణ ముగిసింది. ఈరోజు నిందితులను మీడియా ముందు పోలీసులు ప్రవేశపెడుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసులో తల్లిదండ్రులు, సాయి వేధించినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని డీసీపీ తెలిపారు. శ్రావణి ఆత్మహత్యలో సాయి, దేవరాజ్ ప్రమేయంపై ఆడియో కాల్స్ , వీడియోలు ఉన్నాయని తెలిపారు. ఈరోజు నిందితులను రిమాండ్ కు తరలిస్తామని వెల్లడించారు.

శ్రావణి ఆత్మహత్యపై సాయి, దేవరాజ్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని.. వాటికి సంబంధించిన సాంకేతిక ఆధారాలన్నీ సేకరించామని పేర్కొన్నారు. విచారణ ముగిసిందని దేవరాజ్, సాయిలను కరోనా పరీక్షల నిమిత్తం హాస్పిటల్ కు తరలించామన్నారు.

మరోవైపు శ్రావణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మూడో వ్యక్తి సినీ నిర్మాత అశోక్ రెడ్డి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నోటీసులు ఇచ్చినా విచారణకు రాలేదన్నారు. అశోక్ రెడ్డి ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉందని పోలీసులు తెలిపారు. అతడికోసం గాలిస్తున్నామని తెలిపారు.

దేవరాజ్ పెళ్లికి నిరాకరించడం.. సాయి వేధింపులకు పాల్పడడడం మూలంగానే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణ వచ్చినట్లుగా తెలుస్తోంది.

పోలీసులు శ్రావణి ఆత్మహత్యకు సాయి, దేవరాజ్ కారణమని నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. వారిని అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మాతను విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. మూడు రోజుల నుంచి దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణను పోలీసులు విచారిస్తున్నారు. శ్రావణి చనువుగా ఉండడం ఇష్టం లేకనే దేవరాజ్, సాయి గొడవ పడ్డారని అంటున్నారు.  

సినిమాల్లో నటించాలనే కోరికతో ఎనిమిదేళ్ల క్రితం శ్రావణి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని గొల్లప్రోలు నుంచి హైదరాబాద్ వచ్చింది. ఆమెకు ఫ్రెండ్ ద్వారా సాయికృష్ణ పరిచయమయ్యాడు. శ్రావణికి సినిమాలు, సీరియల్స్ లో అవకాశం ఇప్పించాడు. ఆర్థికంగా ఆమె ఎదుగుదలలో దోహదపడ్డాడు.దీంతో శ్రావణిపై ప్రేమను పెంచుకున్నాడు. వారి కుటుంబ సభ్యులతో కూడా సాన్నిహిత్యం పెంచుకొని వారి ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటున్నాడు.

అయితే ఈ మధ్య టిక్ టాక్ ద్వారా దేవరాజ్ శ్రావణికి పరిచయం అయ్యాడు. చనువు పెంచుకున్నాడు. కొద్దిరోజులు శ్రావణి ఇంట్లోనే దేవరాజ్ ఉన్నాడు.  వీరిద్దరూ క్లోజ్ గా ఉండడం సాయికి నచ్చలేదు. పోలీస్ స్టేషన్ వరకు గొడవ వెళ్లడంతో దేవరాజ్ దూరంగా జరిగాడు. ఈనెల 7న దేవరాజ్ ను శ్రావణి రెస్టారెంట్ లో కలవడం.. సాయి వచ్చి గొడవ చేయడంతో వివాదం ముదిరింది. ఈ క్రమంలోనే సాయి రెస్టారెంట్ లో శ్రావణిపై చేయిచేసుకున్నట్టు సమాచారం. దీంతోపాటు సాయి, ఫ్యామిలీ మెంబర్స్ వేధించారని.. దాడి చేశారని శ్రావణి పేర్కొందని దేవరాజ్ పోలీసులకు ఆడియో క్లిప్స్ అందజేశాడు.

దీంతో పోలీసులు శ్రావణి ఆత్మహత్యకు సాయి, దేవరాజ్ కారణమని నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. వీరిద్దరూ శ్రావణి ప్రేమ కోసం పడిన గొడవ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించినట్టు సమాచారం. దేవరాజ్ , సాయిలను  అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తోంది.
Tags:    

Similar News