గొల్లపూడికి మొద్దు శ్రీను లేఖ.. హంతకుడు ఇంత సున్నితమా?
రాజకీయ చరిత్రలో సంచలనం సృష్టించిన పరిటాల రవి హత్య కేసు గురించి మాట్లాడితే, అందులో ప్రధాన నిందితుడిగా నిలిచిన మొద్దు శ్రీను పేరు తప్పకుండా ప్రస్తావనకు వస్తుంది.;
రాజకీయ చరిత్రలో సంచలనం సృష్టించిన పరిటాల రవి హత్య కేసు గురించి మాట్లాడితే, అందులో ప్రధాన నిందితుడిగా నిలిచిన మొద్దు శ్రీను పేరు తప్పకుండా ప్రస్తావనకు వస్తుంది. కఠినమైన నేరస్తుడిగా పేరు గాంచిన అతని వ్యక్తిత్వంలో మరో సున్నిత కోణం ఉందన్న విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 2005 జనవరి 24న అనంతపురంలో జరిగిన పరిటాల రవి హత్య రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఘటనలో కీలక పాత్ర పోషించిన షార్ప్ షూటర్‌గా మొద్దు శ్రీను తనే బాధ్యత తీసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. నా బావ సూరి కళ్లలో ఆనందం చూడటానికే ఈ పని చేశానని అతడు మీడియా ముందే చెప్పడం అతని నిర్దాక్షిణ్య స్వభావాన్ని ప్రతిబింబించింది. అతని మాటల్లో పశ్చాత్తాపం లేకపోవడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.
అయితే, ఇదే వ్యక్తిలో మరో విభిన్న కోణం కూడా ఉందన్న విషయం అతను జైలులో ఉన్నప్పుడు వెలుగులోకి వచ్చింది. 2008 నవంబర్ 9న విశాఖ సెంట్రల్ జైల్లో ఖైదీ అయిన మల్లెల ఓం ప్రకాశ్ చేతిలో మొద్దు శ్రీను హత్యకు గురయ్యాడు. ఈ సంఘటనతో అతని జీవితం ముగిసినా, అతని వ్యక్తిత్వంపై చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. మొద్దు శ్రీను చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో ప్రముఖ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావుకు రాసిన నాలుగు పేజీల లేఖ అతని సున్నిత మనసును ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ లేఖలో అతడు గొల్లపూడి రచనల పట్ల తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, త్రిశూలం సినిమాలో మీరు జయసుధ పాత్రను బాధపెట్టడం చూసి కోపం వచ్చింది, చిన్నతనంలో మారుతీరావు కనిపిస్తే రోకలిబండతో బుర్ర బద్దలు కొట్టేవాడినని పేర్కొన్నాడు. ఆ సినిమా కల్పితమని తెలిసినా, ఆ పాత్ర బాధను తట్టుకోలేకపోయానని చెప్పడం మొద్దు శ్రీను భావోద్వేగాల తీవ్రతను చూపిస్తుంది.
అదే సమయంలో ఎర్ర సీత, సాయంకాలమైంది వంటి నవలలు తన హృదయాన్ని కరిగించాయని చెప్పడం ద్వారా సాహిత్యం పట్ల అతనికి ఉన్న అభిరుచి స్పష్టమైంది. మీ పుస్తకాలు చదివితే నక్సలైట్లు కూడా మారిపోతారు. వాటిని ఉర్దూలోకి అనువదించి ఒసామా బిన్ లాడెన్‌కు చదివిస్తే ఆయన కూడా మారిపోతాడని చెప్తూ, మీ అనుమతి లేకుండానే మిమ్మల్ని నా గురువుగా, నన్ను మీ శిష్యుడిగా ప్రకటించుకుంటున్నా అని మొద్దు శ్రీను తన లేఖలో వ్యాఖ్యానించడం అతని ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తుంది.
ఈ లేఖ గురించి గొల్లపూడి మారుతీరావు చెప్తూ, మొద్దు శీను తనను గురువుగా భావించడం హృదయాన్ని హత్తుకుందని, తనకెంతో మంది అభిమానులున్నప్పటికీ తాను ఇద్దరు అభిమానుల్ని మాత్రం చాలా ప్రత్యేకంగా గుర్తుంచుకుంటానని, వారిలో ఒకరు ఇండియా ప్రధాని పీవీ నరసింహారావు కాగా, మరొకరు మొద్దు శ్రీను అని తెలిపారు. గొల్లపూడి చెప్పిన దాన్ని బట్టి చూస్తే మొద్దు శ్రీను సాహిత్యం పట్ల ఇష్టం కలిగిన సున్నిత మనస్కుడని అర్థమవుతుంది.