మూడుసార్లు ఫెయిల్..అమ్మాయిల వెంట హీరో!
అక్షయ్ కుమార్ తండ్రి చాలా కఠినమైన వ్యక్తి. చదువులో వెనుకబడినప్పుడు తన తండ్రి నుండి ఎలాంటి శిక్షలు ఎదురయ్యేవో కూడా అక్షయ్ గుర్తు చేసుకున్నారు.;
సినీ రంగంలో అత్యంత వేగంగా సినిమాలు పూర్తి చేసే నటుడిగా పేరున్న అక్షయ్ కుమార్ చదువు విషయంలో మాత్రం తాను చాలా వెనుకబడి ఉండేవాడినని బహిరంగంగా అంగీకరించారు. పాఠశాల రోజుల్లో తాను ఒకే తరగతిలో ఏకంగా మూడుసార్లు ఫెయిల్ అయ్యానని ఆయన వెల్లడించారు. పుస్తకాల కంటే ఆటపాటలు, అల్లరి పనుల పట్ల ఉన్న ఆసక్తి వల్లే తాను పరీక్షల్లో రాణించలేకపోయానని చదువు అప్పట్లో తనకు ఒక పెద్ద భారంగా అనిపిం చేదన్నారు. ఒక సూపర్‌స్టార్ తన వైఫల్యాలను ఇంత నిజాయితీగా పంచుకోవడం ఇంట్రెస్టింగ్.
చదువులోనే కాదు. అల్లరి పనుల్లో కూడా అక్షయ్ అందరికంటే ముందుండేవారు. ఓ టాక్ షోకు హాజరైన ఆయన చిన్ననాటి స్నేహితుడు ఒకరు అక్షయ్ చిలిపి పనులను బయటపెట్టారు. స్కూల్ రోజుల్లో అక్షయ్‌కు అమ్మాయి లంటే చాలా ఇష్టమని, నిరంతరం అమ్మాయిల వెంట పడేవాడని ఆయన పేర్కొన్నారు. దీనికి అక్షయ్ కూడా నవ్వుతూ అవునని సమాధానమివ్వడం ఆసక్తికరం. ప్రస్తుతం క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే ఈ నటుడిలో ఒకప్పుడు ఇంతటి అల్లరి కోణం ఉందనే విషయం ఆయన అభిమానులకు సరికొత్తగా అనిపిస్తోంది.
అక్షయ్ కుమార్ తండ్రి చాలా కఠినమైన వ్యక్తి. చదువులో వెనుకబడినప్పుడు తన తండ్రి నుండి ఎలాంటి శిక్షలు ఎదురయ్యేవో కూడా అక్షయ్ గుర్తు చేసుకున్నారు. `ఒకసారి నేను ఫెయిల్ అయినప్పుడు మా నాన్న నన్ను కొట్ట డానికి వచ్చారు. కానీ అప్పుడు నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నానని తెలిసి ఆయన ఆగిపోయారు` అని అక్షయ్ పేర్కొన్నారు. తన తండ్రి క్రమశిక్షణే తనను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని, బాల్యంలో చేసిన ఆ పొరపాట్లే జీవితం పట్ల తనకు ఒక స్పష్టతను ఇచ్చాయని అభిప్రాయపడ్డారు.
సాధారణంగా సెలబ్రిటీలు తమ వైఫల్యాలను దాచడానికి ప్రయత్నిస్తారు. కానీ అక్షయ్ కుమార్ తన పరాజ యాలను, అల్లరి పనులను బాహాటంగా చెప్పడం విశేషం. ఇది ఓ రకంగా పిల్లలకు ఓ సందేశం లాంటింది. మార్కులు లేదా పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ముగిసిపోదని, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుందని ఆయన నిరూపించారు. చదువులో రాణించలేకపోయినా? తనలోని మార్షల్ ఆర్ట్స్ , నటన పట్ల ఉన్న ఆసక్తిని కెరీర్‌గా మార్చుకుని నేడు కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం ఆక్షయ్ కుమార్ బాలీవుడ్ లో నటుడిగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు.