పాటల ప్రాణాన్ని తీస్తున్న రీమిక్స్ కల్చర్!
బాలీవుడ్‌లో పాత పాటలను రీక్రియేషన్ (రీమిక్స్) చేసే సంస్కృతిపై ప్రముఖ గేయ రచయిత సమీర్ అంజాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
బాలీవుడ్‌లో పాత పాటలను రీక్రియేషన్ (రీమిక్స్) చేసే సంస్కృతిపై ప్రముఖ గేయ రచయిత సమీర్ అంజాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దర్శకుడు ఆదిత్య ధర్, నటుడు రణ్‌వీర్ సింగ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన `ధురంధర్` ఫ్రాంచైజీలో పాత సూపర్ హిట్ పాటలను రీమిక్స్ చేసి ఉపయోగించడం పట్ల ఆయన ఘాటుగా స్పందించారు. బాలీవుడ్ ప్రముఖులు సంగీతాన్ని ..పాత పాటల సాహిత్యాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారని ఆరోపించారు.
కోమల్ నహతా పాడ్‌కాస్ట్ `గేమ్ ఛేంజర్స్` లో సమీర్ మాట్లాడుతూ..` పాటలను రీక్రియేట్ చేయడంలో మంచి, చెడు రెండూ ఉంటాయని అన్నారు. తాను రాసిన `దిల్బర్` పాటను రీమిక్స్ చేసినప్పుడు అది కొత్త తరానికి చేరువై నప్పటికీ అసలు రచయితలను పక్కనపెట్టి ఇతరులతో అసభ్యకరమైన పదాలు రాయించడం సాహిత్యాన్ని అవమానించడమేనని అభిప్రాయపడ్డారు. పాటను మరింత మెరుగుపరచగలిగితే చేయవచ్చు కానీ అసలు భావాన్ని పాడుచేసే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నారు.
రచయితల అనుమతి లేకుండా వారి సృష్టిని రీమిక్స్ చేయడం నైతికంగా తప్పని సమీర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాలం మారినా అనుభవజ్ఞులైన రచయితలు నేటి తరం అభిరుచులకు అనుగుణంగా రాయలేరనే భావన తప్పని స్పష్టం చేశారు. నాణ్యమైన రచనలు ఎప్పటికీ నిలిచిపోతాయని.. కానీ ప్రస్తుతం బాలీవుడ్‌లో ఒరిజినల్ క్రియేటర్లకు ఇచ్చే గౌరవం తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
`ధురంధర్` సినిమాలో యాక్షన్ సీన్ల వెనుక పాత పాటలను ఉపయోగించిన విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. హింసాత్మక సన్నివేశాల్లో గుళ్లు కురిపిస్తుంటే వెనుక `జుమ్మా చుమ్మా` లేదా తన పాటలను బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేయడం వల్ల ఆ పాటల ప్రాధాన్యత దెబ్బతింటోందని అసహనం వ్యక్తం చేసారు. పరిశ్రమను ఆపడానికి ఇది తన సొంత ఆస్తి కాదని.. అయితే ఈ సంస్కృతి మొత్తం సంగీత రంగాన్ని నాశనం చేసేవరకు ఇలాగే కొనసాగుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఒకప్పుడు నాణ్యమైన సంగీతానికి పెద్దపీట వేసిన ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్ వంటి పెద్ద బ్యానర్లు కూడా ఇప్పుడు సంగీతం పట్ల శ్రద్ధ చూపకపోవడం తనకు తీవ్ర నిరాశ కలిగించిందని సమీర్ అన్నారు. పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న సంస్థలు కూడా ఈ తీరును ప్రోత్సహించడం వల్ల అసలైన సంగీతానికి ఆదరణ తగ్గుతోందని ఆందోళన చెందారు.
సమీర్ అంజాన్ వ్యక్తం చేసిన ఆవేదన కేవలం ఒక గేయ రచయిత వ్యక్తిగత కోపం కాదు. అది భారతీయ సంగీత ఆత్మను కాపాడుకోవాలనే ఆర్తి. రీమిక్స్ సంస్కృతి పేరుతో కొత్తదనం నింపడం పర్వాలేదు కానీ క్లాసిక్ పాటల ఆత్మను, సాహిత్యాన్ని నాశనం చేస్తూ, హింసాత్మక సన్నివేశాలకు వాటిని వాడుకోవడం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. సృజనాత్మకత తగ్గుతున్న చోట రీమిక్స్ లు పుట్టుకొస్తాయి. అయితే పాత జ్ఞాపకాలను గౌరవిస్తూ, అసలైన రచయితల శ్రమను గు గుర్తించినప్పుడే సంగీత రంగానికి నిజమైన భవిష్యత్తు ఉంటుంది. ఇండస్ట్రీలోని అగ్ర సంస్థలు ఇప్పటికైనా కళ్లు తెరిచి, తాత్కాలిక ట్రెండ్స్ వెనుక పడకుండా నాణ్యమైన ఒరిజినల్ సంగీతానికి ప్రాణప్రతిష్ఠ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.