తెలుగబ్బాయి కోసం 8 నెలల వెయిట్ చేశా.. కానీ వర్కవుట్ అవలేదు!
సాధారణంగా హీరోకు ధీటుగా కనిపించే విలన్ అంటే భారీ కటౌట్, బలమైన శరీరాకృతి ఉండాలనే అభిప్రాయం ఉంటుంది.
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను మేకర్స్ ఇప్పటికే వేగవంతం చేశారు. ముఖ్యంగా సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్న రాఘవ్ జుయల్ పాత్రపై ఆసక్తి పెరుగుతోంది. సాధారణంగా హీరోకు ధీటుగా కనిపించే విలన్ అంటే భారీ కటౌట్, బలమైన శరీరాకృతి ఉండాలనే అభిప్రాయం ఉంటుంది. అయితే శ్రీకాంత్ ఓదెల మాత్రం ఈసారి ఆ ఫార్ములాకు పూర్తిగా భిన్నమైన లుక్‌ను ఎంచుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
విలన్ క్యారెక్టర్ కోసం డైరెక్టర్ శ్రీకాంత్ దాదాపు 8 నెలల పాటు సరైన వ్యక్తి కోసం ఎదురుచూశారట. ముఖ్యంగా సన్నగా, స్టైలిష్‌గా ఉండటంతో పాటు ఎలాంటి కాస్ట్యూమ్ వేసినా సహజంగా క్యారీ చేయగల పర్సనాలిటీ ఉన్న వ్యక్తి కావాలని భావించారట. అంతేకాదు, ఈ పాత్రకు ఒక తెలుగబ్బాయి అయితే మరింత బాగుంటుందని శ్రీకాంత్ ఓదెల అనుకున్నారట. ఆ ఆలోచనతో ఎంతోమందిని పరిశీలించినా, తన ఊహకు సరిపోయే వ్యక్తి మాత్రం దొరకలేదని శ్రీకాంత్ తెలిపారు.
సరిగ్గా అదే టైమ్ లో తన అసిస్టెంట్ డైరెక్టర్ చూపించిన రాఘవ్ ఫొటో చూసిన వెంటనే శ్రీకాంత్ ఓదెలకు ఇంట్రెస్ట్ కలిగిందని చెప్పారు. అయితే ఫొటోలో చూసిన పర్సనాలిటీ, సినిమాలో తాను ఊహించుకున్న పాత్రకు సరిపోతుందా అనే చిన్న డౌట్ మాత్రం ఉందని, కానీ రాఘవ్‌ను డైరెక్ట్ గా కలిసి కథ చెప్పిన తర్వాత ఆ అనుమానాలన్నీ తొలగిపోయాయని శ్రీకాంత్ వెల్లడించారు. క్యారెక్టర్ ను అర్థం చేసుకునే విషయంలో రాఘవ్ చూపించిన కాన్ఫిడెన్స్ తనకు నచ్చిందని, అప్పుడే ఈ క్యారెక్టర్‌కు సరైన వ్యక్తి ఇతనేననే డెసిషన్ కు వచ్చానని చెప్పారు.
ఇక వీరిద్దరి కలయికలో మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. రాఘవ్‌కు కథ చెప్పే సమయంలో భాష విషయంలో తాను ఇబ్బంది పడ్డానని శ్రీకాంత్ చెప్పగా, తనకు ఇంగ్లీష్‌లో అంతగా పట్టు లేదని రాఘవ్ సరదాగా చెప్పడం విశేషం. మొత్తానికి తెలుగబ్బాయి కోసం ఎనిమిది నెలలు వెతికిన డైరెక్టర్ ఆలోచన చివరకు బాలీవుడ్ నేపథ్యం ఉన్న రాఘవ్ జుయల్ వద్ద ఆగడం ది ప్యారడైజ్ విలన్ పాత్రపై మరింత ఆసక్తిని పెంచుతోంది.