మొత్తానికి షారుక్ ఖాన్ తప్పించుకున్నాడు
షారుక్ ఈ పని చేయడం వెనుక వ్యూహాత్మక కోణం కూడా ఉందనేది కొందరి అభిప్రాయం.;
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద `ధురందర్ 2` వసూళ్లతో సునామీ సృష్టించినా పరిశ్రమలోని అగ్ర హీరోలైన ఖాన్లు, కపూర్లు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తోటి నటుడి ఇంతటి భారీ విజయాన్ని సాధిస్తే కనీసం సోషల్ మీడియాలో కూడా అభినందించలేదనే విమర్శలు నెటిజన్ల నుండి వెల్లువెత్తాయి. హృతిక్ రోషన్ మినహా బాలీవుడ్ దిగ్గజాల మధ్య ఉన్న విభేదాలే దీనికి కారణమని పుకార్లు షికారు చేస్తున్న తరుణంలో షారుక్ ఖాన్ ఒక్కసారిగా రంగంలోకి దిగి ఆ విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసారు.
ధురంధర్ 3 సక్సెస్ వేడుకలో రణవీర్ సింగ్‌ను కలిసిన షారుక్ ఖాన్ ఆయన్ని ఆత్మీయంగా హత్తుకోవడమే కాకుండా రణవీర్ బుగ్గలను నిమిరి తన ప్రేమను చాటుకున్నారు. ఈ ఒక్క దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో షారుక్ తనపై వస్తోన్న విమర్శల నుండి చాకచక్యంగా తప్పించుకున్నట్లు అయింది. మాటలతో కాకుండా తన ప్రవర్తనతో రణవీర్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటి పరిశ్రమలో అంతా సవ్యంగానే ఉందనే సంకేతాన్ని ఆయన పంపారు.
సాధారణంగా బాలీవుడ్‌లో కొత్త తరం నటులు భారీ విజయాలు సాధించినప్పుడు సీనియర్ స్టార్లు స్పందించ కపోవడం వల్ల ఈర్ష్య, పోటీ అనే కోణాలు వెలుగులోకి వస్తాయి. రణవీర్ సింగ్ గ్లోబల్ స్థాయిలో రికార్డులు తిరగరాస్తుంటే ఖాన్ల మౌనం అతని ఎదుగుదలను వారు జీర్ణించుకోలేకపోతున్నారేమో అన్న అనుమానాలను కలిగించింది. అయితే షారుక్ చేసిన ఈ చిన్న పని అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసింది. ఒక పెద్దన్నలా రణవీర్‌ను అభినందించి తన హుందాతనాన్ని నిలబెట్టుకున్నారు.
షారుక్ ఈ పని చేయడం వెనుక వ్యూహాత్మక కోణం కూడా ఉందనేది కొందరి అభిప్రాయం. ప్రస్తుతం `కింగ్` సినిమాతో బిజీగా ఉన్న షారుక్ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురికావడం ఇష్టం లేక ఇలాంటి ఒక పబ్లిక్ మూమెంట్ ద్వారా అందరి నోళ్లు మూయించారా? అన్న సందేహం కొందరి లో ఉంది. షారుక్ ప్రొఫెషనలిజం చాటుకుంటూనే రణవీర్ అభిమానుల మనసులను కూడా గెలుచుకున్నారు. విమర్శలు వస్తోన్న వేళ మౌనంగా ఉండటం కంటే ఇలాంటి ఆత్మీయ పలకరింపు ఎంతో ప్రభావవంతంగా పని చేస్తుంది.
రణవీర్ సింగ్ కూడా షారుక్ పట్ల ఎంతో వినయాన్ని ప్రదర్శించారు. తన చిత్ర విజయంపై అగ్ర హీరోలు స్పందించకపోయినా? షారుక్ పలకరింపుతో ఆయన ఉబ్బితబ్బిబ్బయ్యారు. `డాన్ 3` విషయంలో షారుక్ స్థానంలో రణవీర్ రావడంతో గతంలో తలెత్తిన చిన్నపాటి ఘర్షణ వాతావరణానికి కూడా ఈ కలయికతో ఫుల్ స్టాప్ పడింది. ఖాన్లు, కపూర్లు స్పందించలేదనే నెగటివ్ బజ్ ఇప్పుడు షారుక్ - రణవీర్ ల బ్రోమాన్స్ గా మారిపోయింది.
సినీ పరిశ్రమలో విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కేవలం ట్వీట్లు లేదా పోస్ట్లు మాత్రమే మార్గం కాదు. షారుక్ ఖాన్ వంటి దిగ్గజ నటులు ఇలాంటి బహిరంగ ప్రశంసల ద్వారా తలెత్తిన వివాదాలను సులువుగా పరిష్కరిం చగలరని మరోసారి నిరూపితమైంది. ఈ సంఘటన వల్ల పరిశ్రమలో ఐక్యత పెరగడమే కాకుండా విమర్శకులు కూడా షారుక్ శైలిని ప్రశంసించక తప్పదు. `ధురందర్ 2` విజయం రణవీర్ సొంతమైతే ఆ విజయాన్ని అభినందించే మనసు తనదే అని షారుక్ చాటుకున్నారు.