కాంతార మూడో పార్ట్ ఉంటుందా? అసలేం జరుగుతోంది?

సంచలన విజయాన్ని నమోదు చేసిన కాంతార పేరు వినగానే ప్రేక్షకులకు బాక్సాఫీస్ రికార్డులు దాదాపు అందరికీ గుర్తుకొస్తాయి.;

Update: 2026-04-10 06:14 GMT

సంచలన విజయాన్ని నమోదు చేసిన కాంతార పేరు వినగానే ప్రేక్షకులకు బాక్సాఫీస్ రికార్డులు దాదాపు అందరికీ గుర్తుకొస్తాయి. చిన్న సినిమాగా 2022లో విడుదలైన ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. హీరోగా నటించిన రిషబ్ శెట్టి.. దర్శకత్వం వహించిన ఆ మూవీ దాదాపు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఆ విజయాన్ని కొనసాగిస్తూ ప్రీక్వెల్‌ గా వచ్చిన కాంతార: చాప్టర్ 1 (కాంతార 2) కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ చిత్రం కాంతారకు మించి భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించి రూ.850 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో కాంతార సిరీస్‌ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఇప్పుడు ప్రేక్షకులందరూ కాంతార మూడో పార్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే పార్ట్ 3 వస్తుందా లేదా అనే సందేహాలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్‌ లో రిషబ్ శెట్టి తన చిత్ర బృందంతో కలిసి మంగళూరుకు వెళ్లి హరకె నేమోత్సవంలో పాల్గొన్నారు. అక్కడే దైవాన్ని ప్రార్థిస్తూ తదుపరి భాగం గురించి సంకేతం కోరినట్లు సమాచారం. ఆ సమయంలో దైవం నుంచి పాజిటివ్ సిగ్నల్ లభించిందని, ముందుకు సాగాలని సూచన వచ్చినట్టు ప్రచారం జరిగింది.

దీంతో పార్ట్ 3పై ఆశలు మరింత పెరిగాయి. దైవం ఆశీర్వాదం లభించిందనే నమ్మకంతో రిషబ్ శెట్టి.నిర్మాత విజయ్ కిరగందూర్ ఆనందంగా తిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో కాంతార మూవీ మూడో పార్ట్ తప్పకుండా వస్తుందనే అభిప్రాయం ఏర్పడింది. అయితే తాజా పరిణామాలు ఆ ప్రాజెక్టుపై మరోసారి సందేహాలను రేకెత్తిస్తున్నాయి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో వస్తున్న సమాచారం ప్రకారం పార్ట్ 3పై ఇంకా స్పష్టత లేదని టాక్ వినిపిస్తోంది. రిషబ్ శెట్టి వరుస విజయాలతో తన మార్కెట్‌ పెంచుకుంటున్న నేపథ్యంలో తన భవిష్యత్ ప్రాజెక్టులపై మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా తన తదుపరి సినిమాల్లో తన భార్యను సహ నిర్మాతగా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

ఇదే విషయమే ఇప్పుడు కాంతార మూడో పార్ట్ ఆలస్యానికి కారణమవుతుందనే చర్చ జరుగుతోంది. కాంతార సిరీస్ చిత్రాలను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌ పై విజయ్ కిరగందూర్ నిర్మించిన సంగతి తెలిసిందే. పార్ట్ 3 కూడా అదే బ్యానర్‌ లో నిర్మితమవుతుందని ముందుగా వార్తలు వచ్చాయి. రిషబ్ శెట్టితో అగ్రిమెంట్ కూడా పూర్తయ్యిందని సమాచారం. అయితే రిషబ్ శెట్టి తన భార్యను సహ నిర్మాతగా చేర్చాలనే ఆలోచనతో ఉన్నారని, దీనిపై హోంబలే ఫిల్మ్స్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రచారం సాగుతోంది. ఆ అంశంపై ఇరు వర్గాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, ఇంకా తుది నిర్ణయం వెలువడలేదని తెలుస్తోంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News