ఫ్లాపులున్నా స‌రే సినిమాలున్నాయి ఇదేం చిత్రం

Update: 2022-03-24 02:30 GMT
`బాహుబ‌లి` త‌రువాత టాలీవుడ్ ద‌శ‌, దిశ మారింది. మార్కెట్ కూడా భారీ స్థాయిలో పెరిగింది. ఇదే ప్ర‌స్తుతం యువ హీరోల‌కు అడ్వాంటేజీగా మారింది. ఇంత‌కు ముందు ఓ సినిమా పోతే ఆ హీరో మ‌ళ్లీ ట్రాక్ లోకి రావ‌డం చాలా క‌ష్ట‌మైపోయేది. అంతే కాకుండా మ‌రో సినిమా ప‌ట్టుకోవ‌డం కూడా గ‌గ‌న‌మే. కానీ ఇప్ప‌డు ఒక్క సినిమా కాదు వ‌రుస‌గా నాలుగైదు సినిమాలు పోయినా స‌రే ఆ హీరో చేతిలో మ‌రో రెండు మూడు చిత్రాలుంటున్నాయి. థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిందా? ఓటీటీలో రిలీజ్ అయ్యిందా? అని చూడ‌టం లేదు.

ఎక్క‌డ రిలీజ్ అయినా.. పెద్ద‌గా ఆడ‌క‌పోయినా స‌రే  నిర్మాత‌లు స‌ద‌రు యంగ్ హీరోల వెంట‌ప‌డుతున్నారు. మాకు సినిమా చేయ‌మంటే మాకు సినిమా చేయండ‌ని వ‌రుస పెట్టి అడ్వాన్స్ లు ఇచ్చేస్తున్నారు. ఇలా వ‌రుస‌గా నాలుగైదు చిత్రాలు ఫ్లాప్ అయినా స‌రే వ‌రుస ప్రాజెక్ట్ ల‌తో యంగ్ హీరోలు చాలా వ‌ర‌కు బిజీగా వుండ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ముందు సినిమాలు వ‌రుస‌గా ఫ్లాప్ అయినా స‌రే వీరి చేతిలో మ‌రో రెండు చిత్రాలుంటున్నాయి.

అలా ఇండ‌స్ట్రీలో హిట్ లు లేక‌పోయినా బిజీగా వున్న హీరోలు చాలా మందే వున్నారు. రాజ్ త‌రుణ్ `సినిమా చూపిస్త మావ‌` త‌రువాత హిట్ అనే మాట విని చాలా రోజులే అవుతోంది. అయినా స‌రే ఇత‌ని చేతిలో ఇప్ప‌టికీ రెండు మూడు ప్రాజెక్ట్స్ రెడీగా వుంటున్నాయి. తాజాగా `స్టాండ‌ప్ రాహుల్‌` మూవీతో రాజ్ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో లేద‌నే కామెంట్ లు వినిపించాయి. అయినా స‌రే రాజ్ త‌రుణ్ తో సినిమాలు చేయ‌డానికి మేక‌ర్స్ రెడీగా వున్నారు.

ఆది సాయికుమార్ హిట్టు అనే మాట విని చాలా కాల‌మే అవుతోంది. `ల‌వ్ లీ` త‌రువాత ఆది హిట్ మాట విన‌లేదు. ఇప్ప‌టికీ ఏళ్లు గ‌డుస్తున్నా ఆదితో సినిమాలు నిర్మిస్తూనే వున్నారు. ప్ర‌స్తుతం ఆది ఐదు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా వున్నాడు.

ఇక ఇదే త‌ర‌హాలో వ‌రుస సినిమాల‌తో బిజీగా వున్న హీరో సందీప్ కిష‌న్‌. `వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్` త‌రువాత ఆ స్థాయి విజ‌యాన్ని అందుకుని చాలా కాల‌మే అవుతోంది. అయినా మ‌నోడి చేతిలో త‌మిళంలో ఒక సినిమా, తెలుగులో మ‌రో సినిమా వుంది. తెలుగులో రూపొందుతున్న `మైఖేల్‌`ని తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయ‌బోతున్నారు.

2018 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు నాగ‌శౌర్య వ‌రుస‌గా ఐదు సినిమాలు పోయాయి. అయినా అత‌ని చేతిలో ఇప్పుడు నాలుగు క్రేజీ చిత్రాలున్నాయి. ఇక అజిత్ `వ‌లిమై`తో త‌మిళంలోనూ విల‌న్ గా మెరిసిన కార్తికేయ హిట్ కోసం ఎద‌రుచూస్తున్నాడు.

హీరోగా చేసిన `రాజా విక్ర‌మార్క‌` ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. అయినా ఈ హీరోతో ప్ర‌ముఖ క్రేజీ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీలు వ‌రుస‌గా సినిమాలు నిర్మించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. శ్రీ‌దేవి మూవీస్ లో ఓ మూవీ, యువీలో ఓ మూవీ, మైత్రీ మూవీ మేక‌ర్స్ లో ఓ మూవీ కార్తికేయ చేయ‌బోతున్నాడు.

ఇక ఈ మ‌ద్య `రాజావారు రాణీ వారు`తో లైమ్ లైట్ లోకి వ‌చ్చేసిన కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఇటీవ‌ల `సెబాస్టియ‌న్‌` తో ఆశించిన ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌లేక‌పోయినా అత‌నితో క్రేజీ బ‌డ్జెట్ తో సినిమా చేయ‌డానికి మైత్రీ వారు రెడీ అవుతున్నారు. 9 కోట్లు పెట్టి సినిమా తీయ‌డానికి సై అంటున్నారు. న‌వ‌దీప్ దీ ఇదే ప‌రిస్థితి.

ఇలా ఫ్లాపులున్నా వీరు వ‌రుస ప్రాజెక్ట్ ల‌తో బిజీగా వుండ‌టానికి కార‌ణం స్టార్ లు బిజీగా వుండ‌టం, వారికి అందుబాటులో లేక‌పోవ‌డం.. పైగా ట్రెండ్ మారింది. మార్కెట్ స్థాయి పెరిగింది. దీంతో చిన్న‌వాళ్లుతో తీసిని సినిమాల‌ని ఏ ప్లాట్ ఫామ్ లో అయినా మార్కెట్ చేసుకునే వీలుంది. ఇదే ఇప్ప‌డు యంగ్ హీరోల‌కు ఫ్లాపులున్నా వారిని బిజీగా వుండేలా చేస్తోంద‌ని చెబుతున్నారు. 
Tags:    

Similar News