ఒకప్పుడు కోట్ల మందికి ఫేవరెట్.. ఇప్పుడు ఇల్లు కూడా లేకుండా రోడ్డుపై అడుక్కుంటున్న నటుడు..

హాలీవుడ్‌లో బాల నటుడిగా గుర్తింపు పొందిన టైలర్ చేజ్ ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఇల్లు లేకుండా వీధుల్లో జీవిస్తున్నాడన్న వార్తలు అభిమానులను కలచివేస్తున్నాయి.;

Update: 2025-12-23 07:41 GMT

హాలీవుడ్‌లో బాల నటుడిగా గుర్తింపు పొందిన టైలర్ చేజ్ ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఇల్లు లేకుండా వీధుల్లో జీవిస్తున్నాడన్న వార్తలు అభిమానులను కలచివేస్తున్నాయి. ఒకప్పుడు పిల్లల టీవీ షోగా ఎంతో పేరు తెచ్చుకున్న Ned’s Declassified School Survival Guideలో మార్టిన్ క్వెర్లీ పాత్రతో టైలర్ చేజ్ మంచి గుర్తింపు సంపాదించాడు. అయితే ఇప్పుడు అతని పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం.. టైలర్ చేజ్‌ను వారానికి కనీసం ఒకసారి పోలీసులు కలుస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ.. అవసరమైన సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పనిని కాలిఫోర్నియాలోని రివర్ సైడ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో..ప్రత్యేకంగా ఉన్న పబ్లిక్ సేఫ్టీ ఎంగేజ్‌మెంట్ టీమ్ నిర్వహిస్తోంది. ఈ బృందం ఇల్లు లేని వారికి తాత్కాలిక ఆశ్రయం..మానసిక ఆరోగ్య సేవలు..మద్యం లేదా డ్రగ్స్ చికిత్స వంటి అవకాశాలను కల్పిస్తుంది.

అయితే టైలర్ చేజ్ ఈ సహాయాలను ఇప్పటివరకు అంగీకరించలేదని పోలీసులు చెబుతున్నారు. ఇల్లు ఇవ్వాలని.. చికిత్స తీసుకోవాలని ఎన్నోసార్లు ఆఫర్లు ఇచ్చినా..ఆయన వాటిని తిరస్కరిస్తున్నారని వెల్లడించారు. చట్టపరంగా ఎవరికీ హాని కలగనంతవరకు..సహాయం తీసుకోవాలా వద్దా అన్న నిర్ణయం వ్యక్తిగతమని పోలీసులు స్పష్టం చేశారు.

ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. టైలర్ చేజ్‌పై ఎలాంటి నేర కేసులు లేవు. అతనికి ఎలాంటి అరెస్ట్ వారంట్లు కూడా లేవని పోలీసులు తెలిపారు. పోలీసులతో అతని ప్రవర్తన చాలా ప్రశాంతంగా.. గౌరవంగా ఉంటుందని చెప్పారు. కోపంగా లేదా దూకుడుగా ప్రవర్తించకుండా..సహకారంతో మాట్లాడతాడని అధికారులు పేర్కొన్నారు.

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని వీడియోల వల్ల టైలర్ పరిస్థితి మరింతగా బయటకు వచ్చింది. వీధిలో అస్తవ్యస్తంగా కనిపించిన అతని వీడియోలు చూసి చాలామంది అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ వీడియోల గురించి చెప్పినప్పుడు కూడా టైలర్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని పోలీసులు తెలిపారు.

ఈ వార్తపై అతని పాత సహనటులు కూడా స్పందించారు. టీవీ షోలో కలిసి పనిచేసిన నటులు ఈ పరిస్థితిని బాధాకరమని అన్నారు. కొందరు నటులు అతనికి సహాయం చేయడానికి ముందుకు వచ్చినా.. టైలర్ ఇప్పటికీ తన నిర్ణయంపైనే నిలబడుతున్నాడు. ఒకప్పుడు టీవీ తెరపై నవ్వులు పంచిన నటుడు.. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉండడం అందరికీ కలత కలిగించే విషయం.



Tags:    

Similar News