2025 లో మాటలు తప్ప చేతలేం లేవు!
టాలీవుడ్ అంటే పాన్ ఇండియాలో ఓ సంచలనం అన్నది కాదనలేని నిజం. వరుసగా ఎన్నో సినిమాలు పాన్ ఇండియాలో సంచలన విజయాలు సాధించాయి.;
టాలీవుడ్ అంటే పాన్ ఇండియాలో ఓ సంచలనం అన్నది కాదనలేని నిజం. వరుసగా ఎన్నో సినిమాలు పాన్ ఇండియాలో సంచలన విజయాలు సాధించాయి. వందల కోట్ల వసూళ్లును సాధించాయి. 1000 కోట్లు 1500 కోట్లు అంటూ 1800 కోట్ల వరకూ తెలుగు సినిమా పాన్ ఇండియాలో సత్తా చాటింది. కానీ ఇదంతా 2024 వరకే. 2025లో తెలుగు సినిమా పాన్ ఇండియాలో ఏం సాధించింది అంటే చెప్పుకోవడానికి ఒక్క 1000 కోట్ల వసూళ్ల సినిమా కూడా లేదు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన `సంక్రాంతి కి వస్తున్నాం` 300 కోట్ల వసూళ్లను సాధించింది.
500 కోట్లు అయితేనే రికార్డు ఖాతాలోకి:
ఆ తర్వాత కొన్ని నెలల అనంతరం పవన్ కళ్యాణ్ నటించిన `ఓజీ` కూడా 300 కోట్ల వసూళ్లను సాధించింది. `మిరాయ్`, `హిట్ 3`, `డాకు మహారాజ్`, `కుబేర`, `అఖండ 2` లాంటి సినిమాలు 100 కోట్ల వసూళ్లతోనే సరిపెట్టాయి. పాన్ ఇండియాలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రాలు సంచలనం సృష్టిస్తాయి? అనుకుంటే 500 కోట్ల క్లబ్ ని కూడా టచ్ చేయలేదు. ఇప్పుడు తెలుగు సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుందంటే? మినిమం 500 కోట్ల వసూళ్లు అయినా సాధించాలి. అంతకు తక్కువ సాధిస్తే అది రికార్డు ఖాతాలోకి ఎక్కదు. రెగ్యులర్ సినిమాల ఖాతాలో నమోదవుతుంది.
టాలీవుడ్ కంటే బెటర్ సినిమాలు:
2025 ముగించడానికి ఇంకా వారం రోజులే సమయం ఉంది. ఈలోగా ఆ రేంజ్ సినిమాలు ఏవైనా ఉన్నాయా? అంటే లేవనే చెప్పాలి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన `గేమ్ ఛేంజర్` 1000 కోట్లు సాధిస్తుందని బజ్ నెలకొంది. కానీ 180 కోట్ల వసూళ్లతోనే డిజాస్టర్ గా సరిపెట్టుకుంది. ఇక బన్నీ, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ లాంటి స్టార్లు ఎవ్వరూ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాలేదు. దీంతో అగ్ర తారలెవరూ బాక్సాఫీస్ వద్ద కనిపించలేదు. కానీ పర భాషా చిత్రాలు మాత్రం ఈ ఏడాది బాక్సాఫీస్ ని షేక్ చేసాయనే చెప్పాలి. టాలీవుడ్ కంటే మెరుగైన ఫలితాలు సాధించి 2025 తమదేనని ప్రూవ్ చేసారు.
2025 ముగింపుకల్లా సాధ్యమేనా?
కన్నడ నుంచి రిషబ్ శెట్టి నటించిన `కాంతార చాప్టర్ 1` రిలీజ్ అయి ఏకంగా 800 కోట్ల వసూళ్లను సాధించింది. పాన్ ఇండియాలో ఓ సంచలనంగా మారిన చిత్రమిది. కోలీవుడ్ నుంచి రజనీకాంత్ నటించిన `కూలీ` నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా 500 కోట్ల క్లబ్ లో సునాయాసంగా చేరింది. బాలీవుడ్ నుంచి `ఛావా`, `సయ్యారా` లాంటి సినిమాలు కూడా 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించినవే. `ఛావా` 800 కోట్ల వసూళ్లను సాధించింది. తాజాగా రిలీజ్ అయిన `ధురంధర్` ఇప్పటికే 800 కోట్ల వసూళ్లను సాధించింది. 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందనే అంచనాలున్నాయి. ఈ ఏడాది ముగింపు కల్లా? సాధ్యమవుతందా? లేదా? అన్నది చూడాలి.