చైనా కంటే థియేట్రిక‌ల్ రంగంలో అంత వెన‌క‌బడిపోయామా?

భార‌తీయ సినిమా దాదాపు 110 సంవ‌త్స‌రాలుగా త‌న ఉనికిని చాటుకుంటూనే ఉంది. నేడు దేశీ సినిమా ఇంతింతై అన్న చందంగా ఎదిగింది.;

Update: 2026-02-08 00:30 GMT

భార‌తీయ సినిమా దాదాపు 110 సంవ‌త్స‌రాలుగా త‌న ఉనికిని చాటుకుంటూనే ఉంది. నేడు దేశీ సినిమా ఇంతింతై అన్న చందంగా ఎదిగింది. ఇప్పుడు ప్రాంతీయ సినిమా హ‌వా ఒక రేంజులో ఉంది. ముఖ్యంగా ద‌క్షిణాది సినిమా పాన్ ఇండియా లేదా పాన్ వ‌ర‌ల్డ్‌లో సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. కంటెంట్ బావుంటే 1000కోట్ల నెట్ సునాయాసంగా భార‌త‌దేశం నుంచే వ‌సూల‌వుతుంద‌ని నిరూప‌ణ అవుతోంది. ఇది కేవ‌లం 10శాతం లోపు (రెగ్యుల‌ర్ గా వెళ్లేవాళ్లు) ప్ర‌జ‌ల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించిన‌ప్పుడు వ‌చ్చే ఆదాయం. మిగ‌తా 90 శాతం ప్ర‌జ‌లు ఇండ్ల‌లోనే సినిమాలు చూస్తున్నారు. ఓటీటీలు, యూట్యూబ్, బుల్లితెర‌ను ఆశ్ర‌యిస్తున్నారు.

అయితే భార‌త‌దేశంలో థియేట్రిక‌ల్ రంగం ఎంత ఘోరంగా వెన‌క‌బ‌డిపోయిందో మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ విశ్లేషించిన తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. చైనాలో ఏకంగా 90,000 థియేట‌ర్లు అందుబాటులో ఉంటే, భార‌త‌దేశంలో కేవ‌లం 10,000 లోపు థియేట‌ర్లు ఉన్నాయ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ప్ర‌జ‌ల‌కు థియేట‌ర్లు ఎంత ఎక్కువ‌గా అందుబాటులో ఉంటే, అంత ఎక్కువ‌గా ఆద‌రిస్తార‌ని కూడా అమీర్ ఖాన్ విశ్లేషించారు. ఈ విష‌యంలో భార‌త‌దేశం వెన‌క‌బ‌డింద‌ని ఆవేద‌న చెందారు. మ‌న దేశంలో ప్ర‌జ‌లు సినిమాని విప‌రీతంగా ప్రేమిస్తారు. కానీ థియేట‌ర్ల‌కు రావ‌డం లేద‌ని కూడా ఆయ‌న చెప్పారు. ఒక ఉదాహ‌ర‌ణ‌ను కూడా అమీర్ ప్ర‌స్థావించారు. నిజానికి దురంధ‌ర్ చిత్రాన్ని కేవ‌లం 10వేల థియేట‌ర్ల‌లో విడుద‌ల చేసారు. ఒక‌వేళ 15000 థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తే ఫ‌లితం ఎలా ఉండేదో ఊహించారా? అని కూడా ప్ర‌శ్నించారు. భారత సినీ పరిశ్రమలో ఉన్న అపార అవకాశాలపై ఆలోచన రేకెత్తించారు.

మొత్తానికి అమీర్ ఖాన్ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి థియేట్రిక‌ల్ రంగం మ‌న దేశంలో ఎంత‌గా వెన‌క‌బడి ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ రంగంలో ఎలాంటి లోపం ఉందో కూడా ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌వుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా సినిమాలు నిర్మించే దేశంగా భారత‌దేశానికి థియేట‌ర్ల కొర‌తా? ప్ర‌జ‌ల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించేందుకు అవ‌స‌ర‌మైన‌న్ని థియేట‌ర్లు ఉండాలి క‌దా? అని కూడా ప్ర‌శ్నిస్తున్నారు. మ‌నం చాలా వెన‌క‌బ‌డి ఉన్నామ‌న్న ఆవేద‌న అమీర్ ఖాన్ మాట‌ల్లో ప్ర‌తిధ్వ‌నించింది.

చైనాతో పోలిస్తే భారత్‌లో స్క్రీన్ల సంఖ్య చాలా తక్కువగా ఉండటం వల్ల పెద్ద సినిమాల పూర్తి స్థాయి మార్కెట్ సామర్థ్యం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఒక సినిమా ఎక్కువ స్క్రీన్లలో విడుదలైతే ఆదాయం మాత్రమే కాదు, ప్రేక్షకుల చేరువ, సినిమా కల్చర్ విస్తరణ కూడా వేగంగా జరుగుతుందని అమీర్ ఖాన్ వివ‌రించారు. అమీర్ ఖాన్ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి ప్ర‌జ‌ల‌కు చాలా విష‌యాల‌పై స్ప‌ష్ఠ‌త వ‌చ్చింది. బాహుబ‌లి, ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్, కాంతార‌, దురంధ‌ర్, స‌లార్, క‌ల్కి 2898 ఏడి లాంటి సినిమాలు ఏకంగా 15000 నుంచి 20000 స్క్రీన్ల‌లో ఒకేసారి రిలీజైతే ఆ వ‌సూళ్ల ప్ర‌శంజ‌నం ఎలా ఉంటుందో ఊహించండి. బ‌హుశా ఇప్పుడు కేవ‌లం 1000 కోట్ల క్ల‌బ్ గురించే ఎక్కువ‌గా చ‌ర్చించుకుంటున్న ప్ర‌జ‌లు సునాయాంశంగా 2000కోట్ల వ‌సూళ్ల‌ను అధిగ‌మించే సినిమా గురించి మాట్లాడుకునేందుకు ఆస్కారం ఉంటుంది.

భార‌త‌దేశంలో చాలా థియేట‌ర్లు క‌ళ్యాణ‌మండ‌పాలు, గొడౌన్లు, వ్యాపార వాణిజ్య స‌ముదాయాలుగా మారిపోయాయి. సింగిల్ స్క్రీన్లు త‌మ ఉనికిని కోల్పోయాయి. వాటి స్థానంలో మ‌ల్టీప్లెక్సులను నిర్మిస్తున్నారు. అయితే థియేట‌ర్ల సంఖ్య త‌గ్గిపోవ‌డానికి కార‌ణం పెద్ద సినిమాలు త‌గ్గిపోవ‌డం, జ‌నం మ‌ల్టీప్లెక్సుల్లో సినిమాలు చూడ‌టానికి అల‌వాటు ప‌డ‌టం కూడా ఒక కార‌ణ‌మ‌ని విశ్లేషిస్తున్నారు. మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల‌లో క‌ల్పించే సౌక‌ర్యాల‌తో పోలిస్తే సింగిల్ స్క్రీన్ల‌లో సౌక‌ర్యాలు అంతంత మాత్ర‌మే. ఇలాంటి కార‌ణాల‌తో జ‌నం సింగిల్ థియేట‌ర్ల‌కు వెళ్లడం లేదు. ల‌గ్జ‌రీ యాంబియెన్స్ లో మాత్ర‌మే సినిమాలు చూసేందుకు యూత్ కూడా అడిక్ట్ అయిపోయింది.

Tags:    

Similar News