మాఫియా చేతిలో థియేట‌ర్లు ఎన్ని?

Update: 2019-01-08 01:30 GMT
థియేట‌ర్ మాఫియా అనే ఊత‌ప‌దం కొంద‌రికి అల‌వాటైపోయింది. చేతిలో థియేట‌ర్లు ఉన్నాయి. ఇత‌రుల సినిమాల్ని రిలీజ్ కానీకుండా వాళ్ల సినిమాల్నే సంవ‌త్స‌రం మొత్తం ఆడిస్తారు! అంటూ నిరంత‌రం చిన్న సినిమాలు తీసే నిర్మాత‌లు ఆరోపిస్తుంటారు. ఆ న‌లుగురు.. థియేట‌ర్ మాఫియా! అంటూ త‌మ వాద‌న‌ను ప్ర‌తిసారీ తెర‌పైకి తెస్తుంటారు. అయితే ఇందులో వాస్త‌వం ఎంత‌? అస‌లు ఎవ‌రి చేతిలో ఎన్ని థియేట‌ర్లు ఉన్నాయి. మాఫియా అని పిలుస్తున్న వాళ్ల చేతిలో ఎన్ని థియేట‌ర్లు ఉన్నాయి? అన్న‌ది ప‌రిశీలిస్తే క‌ళ్లు భైర్లు క‌మ్మే నిజాలు తెలుస్తాయి. పండ‌గ‌లు ప‌బ్బాల వేళ కాంపిటీష‌న్ లో రిలీజ్ చేస్తూ థియేట‌ర్లు లేక నానా తంటాలు ప‌డేవాళ్లకు కొన్ని నిజాలు తెలియాల్సి ఉంటుంది.

అస‌లు ఆ న‌లుగురిని లేదా ఆ ఐదుగురిని.. థియేట‌ర్ మాఫియా!! అని పిల‌వ‌డం క‌రెక్టేనా? అంటే ఇదిగో ఈ వివ‌రాలు తప్ప‌క తెలియాలి. ఏపీ - తెలంగాణ‌లో మొత్తం 1170 స్క్రీన్లు ఉన్నాయి. ఇందులోనే మ‌ల్టీప్లెక్స్ స్క్రీన్లు ఉన్నాయి. ఆ న‌లుగురులో అల్లు అర‌వింద్ కి 18 థియేట‌ర్లు ఉన్నాయి. నైజాంలో 3, తూ.గో జిల్లా-కృష్ణా జిల్లాలో క‌లిపి 16 థియేట‌ర్లు - ఓవ‌రాల్ గా 18 థియేట‌ర్లు ఉన్నాయి. దిల్ రాజుకు నైజాం- వైజాగ్ క‌లిపి 60 థియేట‌ర్లు ఉన్నాయి. యువి క్రియేష‌న్స్ కు గుంటూరు-సీడెడ్ లో 35 థియేట‌ర్లు ఉన్నాయి. ఏషియ‌న్ సునీల్ నారంగ్ కి నైజాంలో 170 పైగా థియేట‌ర్లు ఉన్నాయి. అంటే ఇవ‌న్నీ మొత్తం థియేట‌ర్ల‌లో 20శాతం మాత్ర‌మే. దాదాపు 400 మంది లీజులకు తీసుకుని సినిమాల్ని ర‌న్ చేస్తున్నారు. నాగార్జున‌ - వారాహి చ‌ల‌న‌చిత్రం సాయి కొర్ర‌పాటి - ఎన్‌ వి ప్ర‌సాద్ - స‌త్య‌నారాయ‌ణ‌ - సీడెడ్ బ్ర‌హ్మం ఇలా ప‌లువురి పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తుంటాయి. సింగిల్ థియేట‌ర్ల ఓన‌ర్లు ఎక్క‌డికి అక్క‌డ ఉండ‌నే ఉన్నారు.

ఇక‌పోతే మాఫియా అన్న ప‌దం ఎందుకు వ‌చ్చింది? అంటే అంత‌గా క్రేజు లేని సినిమాల్ని ఆడించేందుకు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో థియేట‌ర్లు ఇవ్వ‌లేదంటూ గ‌గ్గోలు పెడుతూ ఆ ప‌దం వాడేస్తున్నారు. ఇక‌పోతే సినిమాల రిలీజ్ ల వేళ ప్రాధాన్య‌తా క్ర‌మం అనేది జ‌నంలో, ట్రేడ్ లో సినిమాపై ఉన్న క్రేజును బ‌ట్టే ఉంటుంది. ఇది వ్యాపార రంగం.. ఇక్క‌డ లాభాలు తెచ్చే సినిమాలే కొనేవాళ్ల‌కు కావాలి. ఆ కోణంలో చూస్తే ఈ సంక్రాంతికి వ‌స్తున్న వాటిలో విన‌య విధేయ రామ‌, క‌థానాయ‌కుడు, ఎఫ్ 2 చిత్రాల‌కు జ‌నాల్లో క్రేజు ఉంది. పైగా ఇవి భారీ బ‌డ్జెట్ల‌తో తెర‌కెక్కించిన స్ట్రెయిట్ సినిమాలు. దిల్ రాజు అన్న‌ట్టు స్ట్రెయిట్ సినిమాల‌కు థియేట‌ర్లు ఇవ్వాలా?  లేక డ‌బ్బింగ్ సినిమాల‌కు థియేట‌ర్లు ఇవ్వాలా? అన్న‌ది ఆలోచిస్తే మ‌న‌కే అర్థ‌మ‌వుతుంది. ఇక పండ‌గ‌ల వేళ రిలీజ్ ల విష‌యంలో స్ట్రీమ్ లైన్ చేయాల్సి ఉంద‌ని ఇదివ‌ర‌కూ సునీల్ నారంగ్ వ్యాఖ్యానించారు. అయితే `పేట‌` నిర్మాత‌ను వీళ్లు ఎందుకు స్ట్రీమ్ లైన్ చేయ‌లేక‌పోయారు?  నిర్మాత‌ల మండ‌లి ప‌రిధిలో రిలీజ్ లు లేవా? అన్న‌దానికి అట్నుంచి స‌మాధానం రావాల్సి ఉందింకా.
   

Tags:    

Similar News