'తారక్ చెప్పినట్లు ఆ సినిమా తీయలేదు.. అందుకే అలాంటి ఫలితం'

Update: 2021-05-30 02:30 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఐదు వరుస హిట్ సినిమాలతో దూకుడు మీదున్నాడు. ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో డబుల్ హ్యాట్రిక్ కి రెడీ అవుతున్నాడు. అయితే ఇప్పుడంటే తారక్ సక్సెస్ ట్రాక్ కొనసాగిస్తున్నాడు కానీ కెరీర్ ప్రారంభంలో కంటిన్యూ గా హిట్స్ అందుకోలేకపోయాడు. తన వరకు న్యాయం చేయగలగినా.. ఇతరత్రా కారణాలతో భారీ అంచనాల మధ్య వచ్చిన అనేక సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. అలాంటి వాటిలో ''అల్లరి రాముడు'' సినిమా ఒకటి.

మాస్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ - ఆర్తి అగర్వాల్ - గజాల హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ''అల్లరి రాముడు''. ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందించిన ఈ సినిమాను చంటి అడ్డాల నిర్మించారు. ఈ సినిమా కోసం తన తాత నటించిన 'వేటగాడు' సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ని రీమిక్స్ చేశారు. 2002 జూలై లో ఈ సినిమా విడుదలైంది. 'ఆది' సినిమా తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే 'అల్లరి రాముడు' సినిమా విషయంలో ఎన్టీఆర్ తప్పేమీ లేదని సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఓ వీడియో ద్వారా వెల్లడించారు.

పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సినిమాలకు సంబంధించిన విశేషాలు అందరితో పంచుకుంటున్నారు. మొన్న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వీడియో పోస్ట్ చేసారు. ఈ నేపథ్యంలోనే 'అల్లరి రాముడు' సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమా కథను తన సోదరుడితో కలసి ప్రగతి రిసార్ట్స్ లో ఎన్టీఆర్ కు వినిపించామని.. అక్షరం మార్చకుండా సినిమాగా తెరకెక్కించాలని ఎన్టీఆర్ తమకు సూచించారని పరుచూరి చెప్పుకొచ్చారు.

కొన్ని అనుకోని కారణాలతో తాను షూటింగ్ కి వెళ్ళలేకపోయానని.. షూటింగ్ సమయంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్క్రిప్టులో కొన్ని మార్పులు చేశారని గోపాలకృష్ణ తెలిపారు. అనుకోని మార్పులు చేయడం వల్ల సినిమా మీద జనంలో ఆసక్తి తగ్గిందని.. ఈ సినిమా ఆడలేదని అనుకుంటారు కానీ, అప్పట్లో బాగానే ఆడిందని ఆయన అన్నారు. దర్శకుడు కె.వి.రెడ్డి మాదిరిగా ఒకసారి స్క్రిప్ట్ ఫైనల్ చేశాక దానిలో మార్పులు చేర్పులు చేయకుండా 'అల్లరి రాముడు' సినిమాని తీయలేకపోయామని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News