మిల్కీ ధగధగలకు స్పెషల్‌ ప్రమోషన్‌

Update: 2015-07-05 08:17 GMT
మిల్కీవైట్‌ సోయగం తమన్నా త్వరలోనే కింగ్‌, కార్తీలతో షూటింగ్‌ కోసం విదేశాలు వెళ్లిపోతోంది. అందుకే అందుబాటులో ఉన్న ఈ టైమ్‌లోనే బాహుబలి ప్రమోషన్‌ని లాగించేస్తోంది. రేపో మాపో యూరప్‌ విమానం ఎక్కేసేలోగానే ఈ చిత్రానికి చేయాల్సినంత ప్రమోషన్‌ చేసేస్తోంది. ఎలాగూ సక్సెస్‌ టైమ్‌లో అందుబాటులో ఉండదు. అందుకే అనుష్క లేకపోయినా ఒంటరిగా తెలుగు మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

అయితే ఈ ప్రమోషన్‌లో ఓ విషయం పూర్తి స్థాయిలో చర్చకొచ్చింది. మిల్కీ ఎప్పటికప్పుడు స్పెషల్‌ డిజైనర్‌ వేర్‌లో కనిపించడమే కాకుండా ప్రత్యేకించి డిజైన్‌ చేసిన బంగారు వజ్రాభరణాల్ని ధరిస్తోంది. ఇవన్నీ కళ్లు మిరుమిట్లు గొలిపేస్తూ వీక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి. అసలు ఈ ఆభరణాలు ఎక్కడివి? అన్న చర్చ సాగుతోంది. మహిళామణులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఆ ధగధగలన్నీ తమన్నా సొంత బ్రాండ్‌ వైట్‌ అండ్‌ గోల్డ్‌ ఆభరణాల షోరూమ్‌నుంచి వచ్చినవే.

ఓవైపు బాహుబలి ప్రమోషన్‌, మరోవైపు వైట్‌ అండ్‌ గోల్డ్‌ ప్రమోషన్‌. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నమాట. తమ్మూ ఇలా ప్రచారం చేసేస్తూ అమ్మాయిల్ని టెంప్ట్‌ చేసేస్తుంటే పురుష పుంగవులు జేబులు తడుముకునే పరిస్థితి ఖాయం. మొత్తానికి పైసా ఖర్చు లేకుండా తన సొంత నగలను బేల ప్రమోట్‌ చేసుకుంటోంది.

Tags:    

Similar News