DC కామిక్ నవల స్ఫూర్తితో అదృశ్య `సూప‌ర్ మేన్`గా సూర్య భారీ ప్ర‌యోగం!

Update: 2021-08-27 15:30 GMT
సౌత్ సినిమా నెక్ట్స్ ఫేజ్ కి వెళుతోంది. ఇప్ప‌టికే భారీ ప్రాయోగాలు జాతీయ స్థాయిలో సంచ‌ల‌నాలుగా మారుతున్నాయి. కేవ‌లం టాలీవుడ్ లోనే డార్లింగ్ ప్ర‌భాస్ స‌హా తార‌క్.. చ‌ర‌ణ్ లాంటి స్టార్లు భారీ ప్ర‌యోగాల‌తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాల‌తో గ్లోబ‌ల్ మార్కెట్ ని ఢీకొడుతూ సంచ‌ల‌న తార‌లుగా త‌మ‌ని తాము ఆవిష్క‌రించుకుంటున్నారు.

అటు కోలీవుడ్ లోనూ ఇది విప్ల‌వాన్ని తెస్తోంది. ఇంత‌కుముందే ర‌జ‌నీకాంత్ క‌థానాయకుడిగా శంక‌ర్ తెర‌కెక్కించిన రోబో - 2.0 ఈ త‌ర‌హాలో అసాధార‌ణ ప్ర‌యోగాలు. అవి ప్ర‌జ‌ల్లో సంచ‌ల‌నాలు అయ్యాయి. ఇక‌పై సూర్య- విజ‌య్- క‌మ‌ల్ హాస‌న్ స‌హా చాలా మంది స్టార్లు వ‌రుస ప్ర‌యోగాల‌కు శ్రీ‌కారం చుడుతున్నారు. ఇటీవ‌ల మణిరత్నం- శంకర్- గౌతమ్ మీనన్-వెట్రిమారన్- మిస్కిన్- లింగుస్వామి- ఎఆర్ మురుగదాస్- బాలాజీ శక్తివేల్- శశి- లోకేష్ కనగరాజ్ వంటి 10 మంది ప్రముఖ ద‌ర్శ‌క‌నిర్మాతలు సంయుక్తంగా కొత్త ప్రొడక్షన్ బ్యానర్ `రెయిన్ ఆన్ ఫిల్మ్`ని ప్రారంభించి ప్ర‌యోగాల‌కు శ్రీ‌కారం చుట్టారు. తొలిగా ఈ బ్యాన‌ర్ స్టార్ హీరో సూర్య‌తో సినిమాకి క‌మిటైంది. ఖైదీ- మాస్ట‌ర్ చిత్రాల ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి `ఇరుంబు కై మాయవి` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని తెలిసింది. ఇది DC కామిక్ నవల `ది స్టీల్ క్లా` (1961) ఆధారంగా రూపొందిస్తార‌న్న‌ది ఉత్కంఠ పెంచుతోంది.

ఒక ప్రమాదంలో తన చేతిని కోల్పోయి స్టీల్ ప్రొస్థెటిక్ ధరించిన సూపర్ హీరో పాత్రలో సూర్య నటించనున్నారు. అతని ఉక్కు పంజా మినహా ప్రయోగశాల ప్రమాదం తరువాత అతను ఎలా కనిపించకుండా పోతాడు అనేదే కథ. అదృశ్య రూపంలో ఉండే సూర్య సూప‌ర్ మ్యాన్ గా ఎలాంటి విన్యాసాలు చేయ‌నున్నారు? అన్న‌ది తెర‌పైనే చూడాల్సి ఉంటుంది. ఈ కొత్త బ్యాన‌ర్ సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్ర‌ఖ్యాత డీసీ కామిక్ సైన్స్ ఫిక్ష‌న్ నవల ఆధారంగా ఇది ఆస‌క్తిక‌ర ప్ర‌యోగం అని అర్థ‌మ‌వుతోంది. లోకేష్ క‌న‌గ‌రాజ్ ప్రస్తుతం  వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. కమల్ హాసన్- ఫహద్ ఫాసిల్ - సేతుపతి ల‌తో సినిమా చేస్తున్నారు. మరోవైపు సూర్య ప్రస్తుతం తన 41 వ సినిమాగా ఎతర్క్కుం తునింధవన్‌లో బిజీగా ఉన్నారు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది.

గ‌జిని మొద‌లు ప్ర‌యోగాలెన్నో..

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తొలి నుంచి ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌తోనే అసాధార‌ణ ఫాలోయింగ్ సంపాదించారు. ఏ.ఆర్.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య న‌టించిన గ‌జిని అద్భుత ప్రయోగం. మ‌తిమ‌రుపు హీరోగా సూర్య డ్యూయ‌ల్ షేడ్ పాత్ర‌లో గొప్ప గా అభిన‌యించారు. ఆ త‌ర్వాత కె.వి.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో బ్ర‌ద‌ర్స్ లో అవిభ‌క్త క‌వ‌లల పాత్ర‌లోనూ సూర్య అభిన‌యానికి ప్ర‌శంస‌లు కురిసాయి. మురుగ‌దాస్ సెవెంథ్ సెన్స్ చిత్రంలోనూ అత‌డు సూప‌ర్ ప‌వ‌ర్స్ ఉన్న హీరోగా ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకున్నాడు. ఇప్పుడు డీసీకామిక్ న‌వ‌ల ఆధారంగా రూపొందే చిత్రంలో అత‌డు మ‌రో స్థాయిని అందుకుంటాడ‌ని అభిమానులు భావిస్తున్నారు. ఇంత‌కాలం కామిక్ న‌వ‌ల‌ల్ని హాలీవుడ్ లో మాత్ర‌మే తెర‌కెక్కించేవారు. ఇప్పుడు ప్రాంతీయ భాష‌ల్లోనూ రాజీ అన్న‌దే లేకుండా అసాధార‌ణ బ‌డ్జెట్ల‌తో తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చూస్తుంటే సౌతిండ‌స్ట్రీ మ‌రో హాలీవుడ్ గా రూపాంత‌రం చెందింద‌ని అంగీక‌రించాల్సి ఉంటుంది.
Tags:    

Similar News