R మాధ‌వ‌న్ ప‌ద్మ‌శ్రీ‌కి ఏ విధంగా అర్హుడు?

మ్యాడీ అలియాస్ ఆర్.మాధ‌వ‌న్ కి ప‌ద్మ‌శ్రీ ద‌క్క‌డంపై ఆయన అభిమాన వ‌ర్గంతో పాటు, సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తోంది.;

Update: 2026-01-26 04:06 GMT

గణతంత్ర దినోత్సవం (జనవరి 26) సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో తెలుగు న‌టులు రాజేంద్ర ప్ర‌సాద్, ముర‌ళీమోహ‌న్‌ల‌తో పాటు, త‌మిళ న‌టుడు ఆర్. మాధవన్ కు పద్మశ్రీ పురస్కారం లభించింది. మ్యాడీ అలియాస్ ఆర్.మాధ‌వ‌న్ కి ప‌ద్మ‌శ్రీ ద‌క్క‌డంపై ఆయన అభిమాన వ‌ర్గంతో పాటు, సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తోంది. ఆయన ఈ పురస్కారానికి ఎలా అర్హుడో, ఆయన సినీ ప్రస్థానం, కెరీర్ లో విలక్షణత గురించి వివ‌రాల్లోకి వెళితే...

ముఖ్యంగా, ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారం `పద్మశ్రీ`కి మాధవన్ ఎలా అర్హుడు? అని ప్ర‌శ్నిస్తే, భార‌త‌దేశంలోని అత్యుత్త‌మ న‌టుల‌లో మ్యాడీ ఒక‌రు అనేది అంద‌రూ అంగీక‌రించే వాస్త‌వం. మాధవన్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన బహుముఖ ప్రజ్ఞాశాలి. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా తమిళం, హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు.

ఆరంగేట్ర ద‌ర్శ‌కుడిగా `రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్` కోసం ఆయన చేసిన కృషి అసాధారణం. ఒక శాస్త్రవేత్త కథను ప్రపంచానికి చాటిచెప్పడానికి ఆయన తన ఆస్తులను కూడా పణంగా పెట్టారు. ఈ సినిమాకి ప్ర‌తిష్ఠాత్మ‌క జాతీయ అవార్డులు కూడా వ‌చ్చాయి. ఇక‌ పర్యావరణ పరిరక్షణ, జంతు సంక్షేమం (PETA ప‌ర్స‌న్ ఆఫ్ ది ఇయ‌ర్), విద్యారంగంలో ఆయన చేస్తున్న సేవలూ ఈ పురస్కారానికి ఆయన్ని అర్హుడిని చేశాయి.

తెలుగు రాష్ట్రాలోను అభిమానులు..

మాధవన్ తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితుడు. అత‌డు న‌టించిన అనువాద చిత్రాల‌తో పాటు, నేరుగా నటించిన తెలుగు సినిమాల్లో అత‌డి న‌ట ప్ర‌ద‌ర్శ‌న చూశాక‌ ఫాలోయింగ్ పెరిగింది. ముఖ్యంగా 2000లో విడుద‌లైన సఖి తెలుగులో ఆయనకు భారీ ఫ్యాన్ బేస్‌ను తెచ్చిపెట్టింది. 2001లో వచ్చిన చెలి రొమాంటిక్ హీరోగా ఇమేజ్‌ను సుస్థిరం చేసింది. 2002లో రన్, డుం డుం డుం (2001) డబ్బింగ్ సినిమాలైనా ఇక్కడ మంచి విజయం సాధించాయి.

తెలుగులో సవ్యసాచి (2018) మ్యాడీ న‌టించిన స్ట్రెయిట్ సినిమా. నాగచైతన్య సినిమాలో విలక్షణమైన విలన్ పాత్రలో నటించారు. అనుష్కతో కలిసి 2020లో నిశ్శ‌బ్ధం అనే చిత్రంలో కీలక పాత్ర పోషించారు. అత‌డు న‌టించిన‌ ఆమనీ (2024), ఆర్య MBBS (2008), 13B (2009) లాంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

మ్యాడీ ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తారు. చాక్లెట్ బాయ్ నుండి రగ్గడ్ మ్యాన్ వరకు అత‌డు చేయ‌ని పాత్ర లేదు. సఖిలో లవర్ బాయ్‌గా కనిపించిన అత‌డు `విక్రమ్ వేద`లో గంభీరమైన పోలీస్ అధికారిగా, ఇరుధి సుట్రు (గురు)లో మొండి కోచ్‌గా అద్భుతంగా నటించారు. బ్రీత్ (వెబ్ సిరీస్), సవ్యసాచి లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో తనలోని కొత్త కోణాన్ని చూపించారు.

ద‌ర్శ‌క ర‌చ‌యిత‌గాను...

ద‌ర్శ‌క‌త్వంలోను మాధ‌వ‌న్ ప్ర‌తిభ‌ను చూపించారు. `రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్` (2022) తో మ్యాడీలోని ద‌ర్శ‌కుడు బయటకు వచ్చారు. ఈ సినిమాకు ఆయనే రచయిత, దర్శకుడు - నిర్మాత. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత‌క‌థ‌ను తెర‌పై అద్భుతంగా ఎలివేట్ చేసారు. ఈ పాత్ర కోసం ఆయన తన ఆహార్యాన్ని పూర్తిగా మార్చుకోవడమే కాకుండా, శాస్త్రీయ అంశాలను సామాన్యులకు అర్థమయ్యేలా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు పొందారు. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు లభించింది. న‌టుడిగా, ర‌చ‌యిత‌గా, ద‌ర్శ‌కుడిగా అన్ని విభాగాల్లోను మ్యాడీ నిరూపించారు.

ఇతర అవార్డులు:

*ఫిలింఫేర్ అవార్డ్స్ (సౌత్): అలైపాయుతే (సఖి), ఆయుత ఎళుతు (యువ), ఇరుధి సుట్రు చిత్రాలకు లభించాయి.

*తమిళనాడు స్టేట్ అవార్డ్స్: రన్, ఇరుధి సుట్రు సినిమాలకు ఉత్తమ నటుడిగా గుర్తింపు ద‌క్కింది.

* గౌరవ డాక్టరేట్: కళారంగంలో ఆయన చేసిన కృషికి గానూ డి.వై. పాటిల్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు.

* FTII ప్రెసిడెంట్: ప్రస్తుతం ఆయన పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

మాధవన్‌కు పద్మశ్రీ రావడం వల్ల ఇండియన్ సినిమాలో టాలెంట్ ఉన్న నటులకు మరింత ప్రోత్సాహం లభించినట్లైంది.

Tags:    

Similar News