దేవి శ్రీ ప్రసాద్ మౌనాన్ని ఎలా తీసుకోవాలి?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే ఓ సంచలనమే. `జల్సా`, `గబ్బర్ సింగ్` వంటి ఇండస్ట్రీ హిట్లతో మ్యాజిక్ చేసిన జోడీ ఇది.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే ఓ సంచలనమే. `జల్సా`, `గబ్బర్ సింగ్` వంటి ఇండస్ట్రీ హిట్లతో మ్యాజిక్ చేసిన జోడీ ఇది. చాలా కాలానికి ఇద్దరు మళ్లీ `ఉస్తాద్ భగత్ సింగ్` కోసం చేతులు కలపడంతో? ఎలాంటి మ్యాజిక్ చేస్తారని అంచనాలు అంతకంతకు బలపడుతున్నాయి. అయితే తాజాగా జరిగిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు దేవి శ్రీ ప్రసాద్ గైర్హాజరు కావడం సర్వత్రా చర్చకొస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మౌనం టాలీవుడ్ వర్గాల్లో అనేక సందేహాలకు తావిస్తోంది. సాధారణంగా ఏదైనా పెద్ద సినిమా ఈవెంట్‌కు సంగీత దర్శకుడు హాజరు కాలేకపోతే? కనీసం ఒక వీడియో సందేశం పంపడం లేదా సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది.
కానీ డిఎస్పీ కనీసం ట్విట్టర్ , ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఈ సినిమా గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడకపోవడం గమనార్హం. పవన్ కళ్యాణ్ వంటి టాప్ స్టార్ సినిమా విషయంలో ఒక వెటరన్ మ్యూజిక్ డైరెక్టర్ ఇలా పూర్తిగా సైలెంట్‌గా ఉండటం వెనుక ఏదో బలమైన కారణం ఉందనే చర్చ మొదలైంది. మరి ఈ మౌనానికి కారణం ఏమై ఉండొచ్చు? అంటే ఈ సినిమాకు ఇద్దరు సంగీత దర్శకులు పని చేయసిన సంగతి తెలిసిందే. `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ కేవలం పాటలకు మాత్రమే సంగీతం అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాధ్యతలను థమన్ తీసుకున్నారు.
గతంలో డిఎస్పీ పవన్ తో చేసిన సినిమాలకు ఆయనే పూర్తి సంగీతాన్ని ఇచ్చేవారు. కానీ ఇప్పుడు తన పనిని మరొకరితో పంచుకోవాల్సి రావడం లేదా ఆర్.ఆర్ బాధ్యతలను థమన్‌కు అప్పగించడం డీఎస్పీకి నచ్చలేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తప్పక రావాలని దర్శకుడు హరీష్ శంకర్ కోరినా బీజీ కారణంగా దేవి శ్రీ అటెండ్ అవ్వలేదు. దేవీ శ్రీ ప్రసాద్ ఎలాగూ రాలేదు. కనీసం నువ్వైనా రా? అని థమన్ ని రిక్వెస్ట్ చేయగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన వాళ్లు బ్యాక్ లోనే ఉండటం ఉత్తమం అని అతడు అటెండ్ అవ్వలేదు.
సాధారణంగా దేవి శ్రీ ప్రసాద్ తన సినిమాల ప్రమోషన్లలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అలాంటిది తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో ఇంత ఉదాసీనంగా ఉండటం మెగా అభిమానులను కూడా కలవరపెడుతోంది. చిత్ర యూనిట్‌తో ఏవైనా విభేదాలు తలెత్తాయా? లేక తన పనితీరుపై మేకర్స్ అసంతృప్తి వ్యక్తం చేసి థమన్‌ను రంగంలోకి దించారా? అన్న కోణంలో సోషల్ మీడియాలో రకరకాల కథనాలొస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ మౌనం వెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఆయన స్పందిస్తే తప్ప క్లారిటీ రాదు. ఒక క్లాసిక్ కాంబినేషన్ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం దురదృష్టకరం.