కాస్టింగ్ డైరెక్టర్లు ఫోన్ కూడా ఎత్తేవారు కాదు: రకుల్ ప్రీత్
తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఉన్నప్పుడు కూడా బాలీవుడ్ ఫిలిం మేకర్స్ తనను ఒక కొత్త నటిగానే చూశారని రకుల్ తెలిపారు.;
టాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగి, ఆ తర్వాత బాలీవుడ్‌కు షిఫ్ట్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. రకుల్ నోట నెపోటిజం మాట మరోసారి కలకలం రేపుతోంది. నటవారసుల కారణంగా ఔట్‌సైడర్స్ (సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేని వారు) పడే కష్టాలు ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చాయి.
తాజా ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. తాను బాలీవుడ్‌కు కొత్తగా వచ్చినప్పుడు ఎవరూ తెలియదని... క్యాస్టింగ్ డైరెక్టర్లకు ఫోన్ చేస్తే వారు కనీసం ఆన్సర్ కూడా చేసేవారు కాదని తెలిపారు. ఒకవేళ పొరపాటున ఫోన్ ఎత్తినా, చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చేవారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక ఆడిషన్ కోసం లేదా ఒక చిన్న అవకాశం కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం, గంటల తరబడి వేచి చూడటం వంటివి తనను మానసిక ధైర్యాన్ని పరీక్షించాయని రకుల్ తెలిపారు. మనం బయటి వ్యక్తులం కాబట్టి మనకు రెడ్ కార్పెట్ వెల్‌కమ్ ఉండదు. ప్రతి అడుగులోనూ మనల్ని మనం నిరూపించుకోవాలని కూడా పేర్కొన్నారు.
తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఉన్నప్పుడు కూడా బాలీవుడ్ ఫిలిం మేకర్స్ తనను ఒక కొత్త నటిగానే చూశారని రకుల్ తెలిపారు. దక్షిణాదిలో నేను పెద్ద స్టార్ అని వారికి తెలుసు.. కానీ హిందీ మార్కెట్ లెక్కలు వేరు. అక్కడ మళ్ళీ సున్నా నుండి మొదలుపెట్టాల్సి వచ్చిందని రకుల్ అన్నారు.
అయితే రకుల్ ప్రీత్ సింగ్ నిర్మాత కం నటుడు జాకీ భగ్నానీని పెళ్లాడాక కొంత సెక్యూరిటీ లభించింది. భగ్నానీలకు ఉన్న పరిచయాలతో బాలీవుడ్‌లో అవకాశాలకు కొదవేమీ లేదు. దే దే ప్యార్ దే, రన్ వే 34, డాక్టర్ జీ వంటి సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. 2024లో ఆమె ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానీని వివాహం చేసుకున్న తర్వాత రకుల్ ఆచితూచి ఎంపికలతో కెరీర్ పరంగా ముందుకు వెళుతుననారు. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్థానం చాలా మంది యువ నటీనటులకు స్ఫూర్తిదాయకం. బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, పట్టుదలతో ఉంటే బాలీవుడ్ లాంటి కష్టతరమైన చోట కూడా స్థానం సంపాదించుకోవచ్చని నిరూపించారు.
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో యువహీరోలతో పాటు సీనియర్ హీరోల సరసనా నటించారు. తెలుగులో `వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్`, `ధృవ` వంటి హిట్ సినిమాలు ఉన్నాయి. రకుల్ తమిళంలోను స్టార్ గా కొనసాగింది. భారతీయుడు2 లో చివరిసారిగా రకుల్ కనిపించింది. ఇప్పుడు మళ్ళీ స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. రకుల్ తదుపరి `పతి పత్ని ఔర్ వో` అనే చిత్రంలో నటిస్తోంది. దర్శకుడు శంకర్ నుంచి ఇండియన్ 3 (భారతీయుడు 3) గురించిన అప్ డేట్ రావాల్సి ఉంది.