క్యాస్టింగ్ కౌచ్ పై చిరు సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
సినీ ఇండస్ట్రీలో తరచూ వినిపించే క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.;
సినీ ఇండస్ట్రీలో తరచూ వినిపించే క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆయన రీసెంట్ గా నటించిన మన శంకరవరప్రసాద్ గారు మూవీ సక్సెస్ మీట్.. రీసెంట్ గా హైదరాబాద్ లో జరగ్గా, కాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై తొలిసారిగా చిరంజీవి బహిరంగంగా స్పందించారు. పరిశ్రమలో ప్రొఫెషనలిజం కీలకమని, వ్యక్తిగత ప్రవర్తనే అన్నింటికీ మూలమని స్పష్టం చేశారు.
సినీ పరిశ్రమలో మహిళలు, పురుషులు ఎవరైనా సరే.. ధైర్యంగా అడుగు పెట్టి తమ ప్రతిభను మెరుగుపరుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. "ఇది గొప్ప ఇండస్ట్రీ. అయితే ఇక్కడ నెగిటివ్ పీపుల్ కూడా ఉంటారని చెబుతూ.. కొన్ని చేదు అనుభవాలు ఎవరికైనా ఎదురయ్యాయి అంటే.. అది వాళ్ల తప్పిదమే అని నేను అనుకుంటాను" అని చిరంజీవి వ్యాఖ్యానించారు.
ఆ సమయంలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై మాట్లాడుతూ, "స్ట్రిక్ట్ గా ఉండి, సీరియస్ గా ఉంటే ఎవరూ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించరు. అప్పుడు ఎలాంటి కాస్టింగ్ కౌచ్ ఉండదు. చివరకు బిహేవియర్ మీద అన్నీ ఆధారపడి ఉంటాయి" అని చెప్పారు. అభద్రతాభావంతో ఎవరూ కూడా పరిశ్రమలోకి రావొద్దని, అనవసరమైన భయాలు పెంచుకోవద్దని ఆయన సూచించారు.
"ప్రొఫెషనల్ గా ఉంటే అవతల వాళ్లు కూడా అలాగే ఉంటారు. ఇండస్ట్రీ అద్దంలాంటిది. నీవేం ఇస్తే అదే తిరిగి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ కృత నిశ్చయంతో, దృఢ సంకల్పంతో, హార్డ్ వర్క్ ను ఆసరాగా చేసుకుని రావాలి" అంటూ చిరు సూచించారు. సినీ పరిశ్రమలో మహిళలు రాణించాలంటే కచ్చితంగా అందరూ ప్రోత్సహించాలని ఆయన అన్నారు. ఇక్కడ అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పారు.
ఎవరు ధైర్యంగా వస్తారో వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు చిరు. "నా కూతురు సుస్మిత, అశ్వనీదత్ గారి పిల్లలు స్వప్న సహా అనేక మంది ఇండస్ట్రీలోకి వచ్చి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇది ఇండస్ట్రీ ఎంత ఓపెన్ గా ఉందో చూపించే ప్రత్యక్ష సాక్ష్యం" అని అన్నారు. యువతకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ ముఖ్యమని చెబుతూ సినీ పరిశ్రమలోకి రావాలనుకునే వారందరికీ వెల్కమ్ చెబుతున్నానని స్పష్టం చేశారు.
అయితే ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ పై చిరు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. దీంతో అనేక మంది నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో పని వాతావరణం, మహిళల భద్రత, అవకాశాల అంశాలపై మరోసారి చర్చకు తెరతీశాయి. మొత్తానికి.. కాస్టింగ్ కౌచ్‌పై చిరంజీవి వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారాయి.