సింగం-3.. ఇప్పుడేం చేస్తారు మరి

Update: 2016-11-21 15:30 GMT
మొత్తానికి ‘ధృవ’ రిలీజ్ డేట్ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా డిసెంబరు 2న కాకుండా 9న విడుదలవుతోంది. నిర్మాత అల్లు అరవింద్ ఈ మేరకు అధికారికంగానే ప్రకటన కూడా ఇచ్చేశారు కాబట్టి ఇక ఈ డేట్ విషయంలో సందేహాలేమీ పెట్టుకోనక్కర్లేదు. ఐతే ఇప్పుడు తర్వాతి వారం రావాల్సిన ‘సింగం’ సిరీస్ మూడో సినిమా ‘ఎస్-3’ పరిస్థితి ఏంటన్నదే అర్థం కావడం లేదు.

నిజానికి ‘ధృవ’ వల్ల ఆ సినిమాకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. ‘ఎస్-3’ వల్ల ‘ధృవ’కే సమస్య. ‘ధృవ’ టాక్ ఎలా ఉన్నా రెండో వారానికి జోరు తగ్గుతుంది. ఆటోమేటిగ్గా జనాలు కొత్త సినిమా మీద ఆసక్తి చూపిస్తారు. ‘ఎస్-3’ మీద తెలుగులోనూ భారీ అంచనాలున్నాయి. సూర్య సినిమాలు తమిళంలో కంటే తెలుగులో బాగా ఆడుతున్నాయి ఈ మధ్య. అందులోనూ ‘సింగం’ సిరీస్ అంటే అంచనాలు బాగా ఉంటాయి. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు ఈ సిరీస్ విషయంలో చాలా ఆసక్తితో ఉంటారు.

కాబట్టి ‘ఎస్-3’ ముందు అనుకున్న ప్రకారమే డిసెంబరు 16న వస్తే ‘ధృవ’కు దెబ్బ పడటం ఖాయం. ఇంతకుముందు లాగా ఫస్ట్ వీక్ లోనే మొత్తం బడ్జెట్ రికవర్ చేసుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో జనాలు పొలోమని థియేటర్లకు వచ్చేసే పరిస్థితి లేదు. కాబట్టి రికవరీకి రెండు మూడు వారాలైనా పడుతుంది. ఈ నేపథ్యంలో ‘ఎస్-3’ గురించి టెన్షన్ పడుతోంది ‘ధృవ’ టీమ్.

అల్లు అరవింద్ కు.. సూర్యతో పాటు అతడి కజిన్.. ‘ఎస్-3’ నిర్మాత అయిన జ్నానవేల్ రాజాతో మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే ఆ సినిమాను వాయిదా వేయించే ప్రయత్నాలు చేస్తున్నట్లు కొంత కాలంగా వార్తలొస్తున్నాయి. ఐతే డిసెంబరు చివరి వారానికి ఇటు తెలుగులో.. అటు తమిళంలో చాలా సినిమాలు షెడ్యూల్ అయి ఉన్న నేపథ్యంలో ‘ఎస్-3’ని వాయిదా వేయడమూ అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో సూర్య అండ్ కో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News