థియేటర్ల మూసివేతపై సురేశ్ బాబు కామెంట్స్

Update: 2020-03-16 08:45 GMT
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పలు రాష్ట్రాలు ముమ్మరంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31వరకు విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్, థియేటర్లను మూసివేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని టాలీవుడ్ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు స్వాగతించారు. కేవలం థియేటర్లే కాకుండా....మార్చి 21 వరకు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని షూటింగ్ లు ఆపివేస్తున్నామని ప్రకటించారు. అయితే, షూటింగ్ లు ఆపివేయడం...థియేటర్లు మూసివేయడం వల్ల ఇండస్ట్రీకి, నిర్మాతలకు, ఇండస్ట్రీలోని 24 విభాగాలకు చెందిన వేలాది మందికి తీవ్ర నష్టం వాటిల్లనుంది. ఈ విషయం పై ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.

థియేటర్ల మూసివేత, షూటింగ్ ల నిలిపివేత వల్ల ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న మాట వాస్తవమేనని సురేశ్ బాబు అన్నారు. 15 రోజులపాటు థియేటర్లు నడపక పోయినప్పటికీ...అద్దెలు చెల్లించాల్సిందేనని, ట్యాక్స్ లు, కరెంటు బిల్లులు, ఇతరత్రా మెయింటెనెన్స్ ఖర్చులు భరించక తప్పదని అన్నారు. థియేటర్లలో స్టాల్స్, డ్రింక్స్ వ్యాపారులు, క్యూబ్ డిజిటల్ ఆపరేటర్లు ఖాళీగా ఉండాలని, దీనివల్ల తమపై ఆర్థికంగా చాలా భారం పడుతుందని అన్నారు. అయితే, తాము ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు...ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం సరికాదని సురేశ్ బాబు అభిప్రాయపడ్డారు. కరోనా వంటి కష్టాలు, ప్రకృతి విపత్తులు ఏ పది పదిహేనేళ్లకోసారో వస్తుంటాయని, అటువంటి సందర్భాల్లో కరోనా వంటి కంటికి కనబడని శత్రువుపై మనమంతా కలిసికట్టుగా యుద్ధం చేయక తప్పదని చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల కోసం సామాజిక ప్రయోజనాలను పణంగా పెట్టడం ఏమాత్రం సబబు కాదని సురేశ్ బాబు అన్నారు.
Tags:    

Similar News